Share News

Fiber net : ఏపీ ఫైబర్‌.. నో సిగ్నల్‌

ABN , Publish Date - Jul 13 , 2025 | 11:59 PM

Internet outage Connectivity issues జిల్లాలో ఏపీ ఫైబర్‌నెట్‌ సేవలు దారుణంగా తయారయ్యాయి. సాంకేతిక సమస్యలు కారణంగా వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో చాలామంది ఇతర నెట్‌వర్క్‌లకు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Fiber net : ఏపీ ఫైబర్‌.. నో సిగ్నల్‌
జేఆర్‌.పురంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ సిగ్నల్‌ పరిస్థితి ఇదీ

  • జిల్లాలో సక్రమంగా అందని సేవలు

  • సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు

  • వినియోగదారుల్లో అసంతృప్తి

  • విముఖత చూపుతున్న ఆపరేటర్లు

  • సాంకేతిక సమస్యలతో ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలకు అంతరాయం కలుగుతోంది. యూపీఎస్‌లు పనిచేయడం లేదు. డిజిటల్‌ బాక్సులు ఇవ్వడం లేదు. సేవలు సక్రమంగా లేక వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు మారిపోతున్నారు. దీంతో మేము నష్టపోతున్నాం. నాలుగు నెలలుగా మాకు కమీషన్లు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇలా అయితే ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవల నుంచి తప్పుకోవడమే ఉత్తమం.

    - శ్రీకాకుళం పరిసర ప్రాంతాలకు చెందిన ఏపీ ఫైబర్‌నెట్‌ ఆపరేటర్‌ బాలకృష్ణ ఆవేదన ఇది

    ..................

  • సచివాలయాలకు ఇంటర్నెట్‌ సేవలు సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నాం. ఏపీ ఫైబర్‌నెట్‌ ఎప్పుడు పనిచేస్తుందో.. ఎప్పుడు పనిచేయదో అర్ధం కావడం లేదు. ఒక్కోసారి హైస్పీడ్‌తో ఇంటర్నెట్‌ వస్తోంది. మరోసారి నో సిగ్నల్‌ కనిపిస్తోంది. దీంతో సెల్‌ఫోన్లకు వైఫై ఆన్‌చేసి కంప్యూటర్లను వాడుకోవాల్సిన దుర్భర పరిస్థితి ఎదురవుతోంది.

    - గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ అసిస్టెంట్ల ఆవేదన ఇది

    .................

  • రణస్థలం, జూలై 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏపీ ఫైబర్‌నెట్‌ సేవలు దారుణంగా తయారయ్యాయి. సాంకేతిక సమస్యలు కారణంగా వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో చాలామంది ఇతర నెట్‌వర్క్‌లకు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఫైబర్‌నెట్‌ డిపాజిట్లు కట్టి కమీషన్‌ ప్రాతిపదికగా పనిచేస్తున్న ఆపరేటర్లు సైతం ఇక మేము విధుల నుంచి తప్పకుంటామని చేతులెత్తేస్తున్నారు. ఇంటింటికీ నాణ్యమైన ఇంటర్‌నెట్‌ సేవలు అందించేందుకు 2017లో టీడీపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలను ప్రారంభించింది. ఇంటర్నెట్‌, కేబుల్‌, ల్యాండ్‌ ఫోన్‌.. ఇలా మూడు రకాల సేవలను అతి తక్కువ ధరకు ప్రజలకు అందించడమే ధ్యేయంగా ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. విడివిడిగా లభించే ఈ మూడు రకాల సర్వీస్‌ ప్రొవైడర్లను ఫైబర్‌ నెట్‌ ద్వారా అందించి కుటుంబాలకు సాంత్వన చేకూర్చాలని అప్పటి సీఎం చంద్రబాబు భావించారు. ఉమ్మడి జిల్లాలో 40వేలకుపైగా ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. రూ.149కే బేసిక్‌ప్లాన్‌ అందుబాటులోకి తేవడంతో చాలామంది ఏపీ ఫైబర్‌నెట్‌ సేవలు పొందేందుకు ఆసక్తి చూపారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ ఫైబర్‌ నిర్వీర్యమైంది. వైసీపీ ప్రభుత్వం బేసిక్‌ ప్లాన్‌ను రూ.149 నుంచి ఏకంగా రూ.350కు పెంచింది. పైగా టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందనే కారణంతో.. ఫైబర్‌ నెట్‌ నిర్వహణను గాలికి వదిలేయడంతో సేవలకు అంతరాయం కలిగింది. ఆపై వినియోగదారుల సంఖ్య తగ్గింది. జిల్లాలో 2024 నాటికి వచ్చేసరికి 19వేలకు పడిపోయింది. సేవలు సక్రమంగా వినియోగదారుల్లో ఫైబర్‌నెట్‌పై అసంతృప్తి కనిపిస్తోంది. జిల్లాలో సచివాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి మరో 2వేల వరకూ సర్వీసులు ఉన్నాయి. వాటికి నిరంతరాయంగా సేవలు అందించడంలో ఏపీ ఫైబర్‌నెట్‌ విఫలమవుతోంది. దీంతో ఫైబర్‌ నెట్‌ సేవలు తగ్గుముఖం పడుతున్నాయి. జియో, ఎయిర్‌టెల్‌ వంటి సంస్థల కనెక్షన్లు పెరుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని కనెక్షన్లకు దిగజారడం ఖాయమని ఆపరేటర్లు తేల్చిచెబుతున్నారు.

  • కేవలం పట్టణాలు..పరిసరాల్లోనే..

  • విద్యుత్‌ శాఖతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా హైస్పీడ్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఇన్‌ఫ్ర్టాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,449 విద్యుత్‌ సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్‌ స్తంభాలను ఉపయోగించుకొని 24 వేల కిలోమీటర్ల మేర కేబుల్‌ లైన్‌ను ఏర్పాటు చేశారు. ఫైబర్‌ నెట్‌తో తమ కేబుల్‌ వ్యవస్థ ఎక్కడ దెబ్బతింటుందోనని ఆపరేటర్లు ఆందోళన చెందారు. ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లపై విముఖత చూపారు. అందుకే పట్టణాలు, సమీప గ్రామాలకే ఏపీ ఫైబర్‌ నెట్‌ పరిమితమైంది.

  • వైర్ల ద్వారా సరఫరాతో ఇబ్బందులు..

  • జిల్లాలో ఏపీ ఫైబర్‌ నెట్‌ టీమ్‌కు సంబంధించి 20 మంది వరకూ ఉన్నారు. వారికి సైతం జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని తెలుస్తోంది. ఏపీ ఫైబర్‌ మంచిదే అయినా.. మిగతా ప్రైవేటు ఫైబర్లు టవర్ల ద్వారా సిగ్నల్‌ను పంపుతున్నాయి. కానీ ఏపీ ఫైబర్‌ మాత్రం వైర్ల ద్వారా అందుతోంది. అక్కడే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. యూపీఎస్‌లతో పాటు ఇతర సామగ్రి కూడా అందించడం లేదని ఆపరేటర్లు వాపోతున్నారు. అందుకే వారు సైతం పెద్దగా సహకరించడం లేదు. దీంతో ఏపీ ఫైబర్‌ సేవలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. వాస్తవానికి ఏపీ ఫైబర్‌ నెట్‌ టారిఫ్‌ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. రూ.349కు సంబంధించి ప్రైవేటు సంస్థలతో పోల్చుకుంటే తక్కువే. కానీ 100 ఎంబీబీఎస్‌ నెట్‌ స్పీడు ఉంటేనే సేవలు సాధ్యమయ్యేది. కానీ ఏపీ ఫైబర్‌ నెట్‌కు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. నెట్‌ వర్క్‌ సక్రమంగా ఉండడం లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. కానీ జిల్లాలో మాత్రం సేవలు మెరుగుపడడం లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు.

  • రెండు నెలల్లో గాడిన

  • ఏపీ ఫైబర్‌నెట్‌ను గాడిలో పెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. మరో రెండు నెలల్లో అన్ని సమస్యల పరిష్కారం దిశగా ప్రత్యేక ప్రణాళికతో అడుగులేస్తోంది. సాంకేతిక సమస్యలను అధిగమించడంతోపాటు తక్కువ ధరకు బేసిక్‌ ప్లాన్‌ అందుబాటులోకి తేనుంది. ప్రతి గ్రామానికి పైబర్‌ నెట్‌ సేవలు విస్తరించనున్నాం.

    - గౌతమ్‌కుమార్‌, జిల్లా మేనేజర్‌, ఏపీ ఫైబర్‌ నెట్‌, శ్రీకాకుళం

  • నెట్‌వర్క్‌ సరిగ్గా లేదు..

  • ఇంటర్నెట్‌, కేబుల్‌, ల్యాండ్‌ ఫోన్‌ సౌకర్యం కలుగుతుందని చెప్పి ఏపీ ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ తీసుకున్నాం. బేసిక్‌ ప్లాన్‌ను రూ.149 నుంచి రూ.350కు పెంచారు. ఆపై నిర్వహణ సరిగ్గా లేదు. నెట్‌వర్క్‌ సదుపాయం పూర్తిగా పడిపోయింది. దీంతో ఎప్పుడు సేవలు నిలిచిపోతాయో తెలియడం లేదు. అందుకే గతం మాదిరిగా విడివిడిగా మూడింటి ప్రొవైడర్‌ సేవలు తీసుకున్నాం.

    - ఎం.రామారావు, రణస్థలం

  • నిర్వహణ అస్తవ్యస్తం

  • జిల్లాలో ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవల్లో ఎటువంటి పురోగతి లేదు. ముఖ్యంగా సిగ్నల్‌ సమస్యలు వేధిస్తున్నాయి. ఇతర ప్రైవేటు సంస్థల కంటే బేసిక్‌ ప్లాన్‌ అందుబాటులో ఉంది. కానీ ప్రైవేటు సంస్థలు ఇస్తున్న నాణ్యత ఇవ్వడం లేదు. నిర్వహణ సైతం బాగుండడం లేదు. ఇప్పటికైనా ఫైబర్‌నెట్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలి.

    - ఐ.కోటేశ్వరరావు, జేఆర్‌ పురం

Updated Date - Jul 13 , 2025 | 11:59 PM