పనిచేయని అధికారులెవరైనా నిలదీస్తా
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:36 AM
‘అధికారులు బాధ్యతతో పని చేయాలి.. అహం కారంతో కాదు. పనిచేయని అధికారులెవరైనా నేను నిలదీస్తా’నని పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్
పొందూరు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘అధికారులు బాధ్యతతో పని చేయాలి.. అహం కారంతో కాదు. పనిచేయని అధికారులెవరైనా నేను నిలదీస్తా’నని పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. పొందూరు మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ కిల్లి ఉషారాణి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల సమావేశాలను అధికారులు చులకనగా చూడరాదని... తప్పనిసరిగా హాజరవ్వాలని అన్నారు. సీఎస్‌డీటీ మఽధుబాబు సమావేశానికి రాకపోవడంపై మండి పడ్డారు. భూమిలేని కొందరు యూరియాను తీసుకుని బ్లాక్‌లో అమ్ముకోవడంతో నిజమైన రైతులకు అన్యాయం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా మనకు వచ్చిన యూరియాను కొందరు ఇతర నియోజకవర్గాలకు తరలించడం కూడా తన దృష్టికి వచ్చిందని పేర్కున్నారు. మొంథా తుఫానుతో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినా ఎవరూ నమోదు చేయలేదని పలువురు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీని పై ఆ శాఖకు సంబంధించిన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జలజీవన్ మిషన్ సనుల్లో భాగంగా పైపులు వేసేందుకు సిమెంట్ రోడ్లను తవ్వేసి వదిలివేయడంతో సంబంధిత అధికారులను సభ్యులు నిలదీశారు. ధర్మవరంలో తామే సిమెంట్ రహదారి పై గోతులు పూడ్చుకున్నామని ఎంపీటీసి అన్నెపు కుమారి తెలిపారు. నియోజకవర్గంలో రహదారులపై ఆక్రమణలు తొలగించేటప్పుడు పార్టీ నాయకులు ఎవరూ కలుగజేసుకోరాదని చెప్పానని ఎమ్మెల్యే అన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో ఎస్.వాసుదేవరావు వైస్ ఎంపీపీ శ్రీదేవి, పీఏసీఎస్ అధ్యక్షులు వండాన మురళి, మాజీ ఎంపీపీ కూన ప్రమీల, డిప్యూటీ ఎంపీడీవో సింహచలం, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు మేలు
ఆమదాలవలస, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించే ఆర్థిక సాయం వరంగా మారుతోందని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని తన స్వగృహం వద్ద సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎల్లువాడ పుష్పకు రూ.1.25 లక్షలు, గండుపల్లి లక్ష్మీభవానీకి రూ.3.90 లక్షలు, బొడ్డేపల్లి పట్టాభి కుటుంబానికి రూ.65 వేల వంతున అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాలు, వైద్య అవసరాల్లో కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఎన్నో కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌తో ఆర్థిక భరోసా కల్పించామని అన్నారు.