Share News

Minister achhennaidu: త్వరలోనే అన్నదాత సుఖీభవ

ABN , Publish Date - Jul 04 , 2025 | 11:59 PM

farmer welfare government scheme ‘రైతులకు శుభవార్త. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్నామ’ని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థకశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

Minister achhennaidu: త్వరలోనే అన్నదాత సుఖీభవ
కవిటి అగ్రహారంలో పర్యటిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి పాలన

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

  • కవిటి అగ్రహారం, మర్లపాడులో పర్యటన

  • నందిగాం, జూలై 4(ఆంధ్రజ్యోతి): ‘రైతులకు శుభవార్త. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్నామ’ని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థకశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నందిగాం మండలం కవిటిఅగ్రహారం, మర్లపాడు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘వైసీపీ దుర్మార్గపు పాలనలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. అన్నక్యాంటీన్లు మూతపడ్డాయి. రీసర్వే పేరిట రైతులకు సమస్యలు ఎదురయ్యాయి. వ్యవస్థలను బాగుచేస్తూ అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తున్నాం. ఇచ్చిన హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకున్నాం. పింఛన్ల పెంపుతోపాటు తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 68 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఒకేరోజు రూ.8,700 కోట్లు జమ చేశాం. ఇంకా పెండింగ్‌ ఉన్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో త్వరలో నిధులు జమ చేస్తాం. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతల్లో కేంద్రసాయంతో కలిపి రైతుల ఖాతాల్లో రూ.20వేలు జమచేస్తాం. ల్యాండ్‌ యాక్టింగ్‌ చట్టాన్ని రద్దు చేసి రైతుల్లో నెలకొన్న భయాన్ని తొలగించిన ఘనత సీఎం చంద్రబాబుదే. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తాం. ఆటోడ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంగా ఉంది. వైసీపీ పాలనలో వివిధ కారణాలతో రద్దయిన మూడున్నర లక్షల పింఛన్లను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నామ’ని తెలిపారు. కార్యక్రమంలో పి.అజయ్‌కుమార్‌, ఎల్‌.ఎల్‌.నాయుడు, పి.చంద్రశేఖర్‌, ఎం.బాలకృష్ణ, ఎస్‌.జానకిరాం, ఎం.పద్మావతి, బి.శివకృష్ణ, బారికి, మదన్‌గౌడ్‌, కె.హరిబాబు, ఎం.శేషగిరి, డి.శ్రీనివాసరావు, ఆర్‌.సన్యాసిరావు, పి.నర్శింహమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 11:59 PM