Share News

grievances: గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ

ABN , Publish Date - Aug 05 , 2025 | 12:36 AM

No negligence in resolving petitions జిల్లాపరిషత్‌ సమావేశంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల ఫిర్యాదుల వేదిక.. ‘మీ-కోసం’ కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి.

grievances: గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
గ్రీవెన్స్‌లో అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేదు

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాపరిషత్‌ సమావేశంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల ఫిర్యాదుల వేదిక.. ‘మీ-కోసం’ కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 140 మంది వివిధ సమస్యలపై అధికారులకు వినతులను అందజేశారు.

6 నెలలుగా బిల్లులు, జీతాలు లేవు

‘కళాశాలల్లో ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన నిర్వహణకు సంబంధించి ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏడు నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదు’ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు, జీతాలు చెల్లించకపోతే నిర్వహణ ఎలా చేయగలమని వాపోయారు. సమస్యను పరిష్కరించి తమను ఆదుకోవాలని కోరుతూ గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

నా పింఛను ఆపేశారు... ఎలా బతికేది...?

కొత్తూరు మండలం నేరడి గ్రామానికి చెందిన మంగి లక్ష్మీనారాయణమ్మ.. దివ్యాంగ వృద్ధురాలు. మంచానికే పరిమితమై.. మాట్లాడలేని పరిస్థితి. 79శాతం వికలాంగ ధ్రువపత్రం ఉన్న ఈమెకు గతంలో దివ్యాంగ పింఛన్‌ అందేది. కానీ ఏమైందో.. పింఛన్‌ నిలిచిపోయింది. భర్త కూడా వృద్ధాప్యంతో పనిచేయలేని పరిస్థితి. దీంతో ఆ దంపతులిద్దరూ సోమవారం గ్రీవెన్స్‌కు చేరుకున్నారు. పింఛన్‌ లేకపోతే తాము ఎలా బతికేదని, డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పింఛన్‌ పునరుద్ధరించాలని లక్ష్మీనారాయణమ్మ సైగలతో అధికారులను వేడుకున్నారు. ఇలా చాలామంది వినతులు అందజేశారు.

కలెక్టర్‌ మాట్లాడుతూ.. అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యానికి తావు లేదని స్పష్టం చేసారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపించాలని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ డి.పృథ్వీరాజ్‌ కుమార్‌, డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, ఉప కలెక్టర్‌ బి.పద్మావతి, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 12:36 AM