Share News

గంజాయిపై ఉక్కుపాదం

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:07 AM

Home Minister Anitha:గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. జిల్లాలో బుధవారం ఆమె పర్యటించారు.

 గంజాయిపై ఉక్కుపాదం
మాట్లాడుతున్న హోంశాఖ మంత్రి అనిత

  • విశాఖ రేంజ్‌లో రూ.5కోట్ల ఆస్తుల జప్తు

  • ప్రతీ జిల్లాలో సైబర్‌ స్టేషన్‌.. 5శక్తి బృందాలు

  • రాష్ట్రంలో 7శాతం తగ్గిన నేరాలు

  • ఫోక్సో కేసుల్లో నాలుగు నెలల్లోనే శిక్ష ఖరారు

  • హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత

శ్రీకాకుళంక్రైం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. జిల్లాలో బుధవారం ఆమె పర్యటించారు. అనంతరం జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘గంజాయి రహిత సమాజ నిర్మాణం కోసం ఈగల్‌ టీంలను ఏర్పాటు చేశాం. పాడేరు, మన్యం వంటి చోట గంజాయి సాగును నివారించాం. మాదకద్రవ్యాల కేసుల్లో మూలాలు కనుక్కొని, నేరస్థుల ఆర్థిక స్థితి గతులపై ఆరా తీసి వారి ఆస్తులను జప్తు చేస్తున్నాం. విశాఖ రేంజ్‌ పరిధిలో మూడు కేసుల్లో రూ.5కోట్ల ఆస్తులు జప్తు చేశాం. గంజాయి సాగు, స్మగ్లింగ్‌, కొనుగోలు చేసిన వారిపై పీడీ యాక్ట్‌ పెడుతున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అరికట్టడంలో పట్టు సాధిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయి. రాష్ట్రంలో నేరాల శాతం 7శాతం తగ్గాయి. పోక్సో కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తున్నాం. విజయనగరం జిల్లాలో 67 పోక్సో కేసులు నమోదు కాగా, 20 కేసుల్లో నిందితులకు నాలుగు నెలల్లోనే శిక్ష పడేలా చర్యలు తీసుకున్నాం. శ్రీకాకుళం జిల్లాలో నేటికి రూ.4కోట్ల మేర ప్రోపర్టీని రికవరీ చేసి నిందితులను అరెస్టు చేశాం. సంకల్పం కార్యక్రమం ద్వారా మహిళలు, బాలికల భద్రతతో పాటు, గంజాయి నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్‌ నేరాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రతీ జిల్లాలో ఐదు శక్తి బృందాలను ఏర్పాటు చేస్తాం. ఈ బృందాల ద్వారా ఆపదలో ఉన్న వ్యక్తుల ఫిర్యాదు మేరకు వారి సమస్యలను పరిష్కరిస్తాం. ప్రతీ జిల్లాలో ఒక సైబర్‌ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేసి నైపుణ్యం కలిగిన అవుట్‌ సోర్సింగ్‌ యువతను నియమించి పెండింగ్‌లో ఉన్న సైబర్‌ కేసులను పరిష్కరిస్తాం.


సమన్వయంతో విధులు నిర్వహించాలి

  • శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయాన్ని హోం మంత్రి అనిత సందర్శించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విశాఖ రేంజ్‌ డీఐజీ గోపినాథ్‌ జెట్టి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఎస్పీలు కేవీ మహేశ్వరరెడ్డి, వకుల్‌ జిందల్‌, పార్వతీపురం మన్యం ఏఎస్పీ అంకిత సురాన హోం మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మూడు జిల్లాల పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. నేరాల గణాంకాలు, రేంజ్‌ పరిధిలో ఎస్పీలు తీసుకుంటున్న చర్యలపై డీఐజీ గోపినాథ్‌ జెట్టి హోంమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసుల ప్రతిష్ట పెంచేలా ప్రతీ అధికారి, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు దశల వారిగా పోలీసుశాఖకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. పోలీసు వాహనాలు, ఫింగర్‌ ప్రింట్‌ పరికరాలు, సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలను అందిస్తామని తెలిపారు. విద్యాలయాలు, గృహ సముదాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే మహిళలు, ఫిర్యాదు దారులపై మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం ఏఎస్పీలు పి.శ్రీనివాసరావు, పి.సౌమ్యలత, డీఎస్పీలు సీహెచ్‌.వివేకానంద, వీవీ అప్పారావు, శేషాద్రి, రాంబాబు, భవ్యరెడ్డి, రాఘవులు, శ్రీనివాసరావు, ఎస్‌బీ సీఐ ఇమాన్యుయల్‌ రాజు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • ‘మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇటీవల పులివెందుల పర్యటనకు వెళ్లారు. ఆయన ప్రతిపక్ష నేత కానప్పటికీ హెలికాఫ్టర్‌లో వచ్చినప్పుడు 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం’ అని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. హెలికాఫ్టర్‌ విషయమై చేస్తున్న రాద్ధాంతం గురించి జగనే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పులివెందులకు వెళ్లిన హెలికాఫ్టర్‌లోనే మళ్లీ పది నిమిషాలు ఎలా వెళ్లగలిగారని ప్రశ్నించారు. ఈ విషయమై ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 10 , 2025 | 12:07 AM