మత్తుపదార్థాల వినియోగంపై ఉక్కుపాదం
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:57 PM
Drugs should be banned జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టాలి. వీటిపై ఉక్కుపాదం మోపాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టాలి. వీటిపై ఉక్కుపాదం మోపాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డితో కలిసి నార్కొటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘విద్యార్థులు, వర్కర్లు, డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని గంజాయి సరఫరా జరుగుతోంది. ఈ నేపథ్యంలో గట్టి నిఘా అవసరం. డ్రగ్స్ విక్రయాల ప్రాంతాల్లో కఠిన తనిఖీలతో పాటు బాధితులకు కౌన్సెలింగ్, పునరావాసం కల్పించాలి. స్కూళ్లు, కళాశాలల్లో క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలి. డ్రగ్స్‌రహిత సమాజంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాల’ని సూచించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘గంజాయి అరికట్టడంలో కేసుల పెట్టడమే లక్ష్యం కాదు. ఒకే వ్యక్తి పదేపదే గంజాయి వాడుతున్నాడంటే నిఘా లోపం ఉన్నట్లే. చిన్నపాటి సమాచారం ఉన్నాసరే పోలీసులకు అందజేయాల’ని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్, పోలీసు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, విద్య, వైదారోగ్యశాఖ, ఇంజినీరింగ్, రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు.