Share News

నేడు అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:55 PM

Train from Berhampur to Surat ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరనుంది. ఒడిశా రాష్ట్రం బరంపురం నుంచి సూరత్‌ వరకూ ప్రత్యేక రైలు పట్టాలెక్కనుంది. శనివారం బరంపురం రైల్వే స్టేషన్‌ వద్ద అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు.

నేడు అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం
ప్రారంభించేందుకు సిద్ధమైన అమృతభారత్‌ రైలు

బరంపురం నుంచి సూరత్‌ వరకూ వెళ్లనున్న రైలు

పలాస, శ్రీకాకుళంరోడ్‌, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం రైల్వేస్టేషన్లలో హాల్ట్‌

ఉత్తరాంధ్ర ప్రజలకు తీరనున్న కష్టాలు

పలాస, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరనుంది. ఒడిశా రాష్ట్రం బరంపురం నుంచి సూరత్‌ వరకూ ప్రత్యేక రైలు పట్టాలెక్కనుంది. శనివారం బరంపురం రైల్వే స్టేషన్‌ వద్ద అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ రైలు బరంపురం నుంచి సూరత్‌ వరకూ రాకపోకలు సాగిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలాస, శ్రీకాకుళంరోడ్‌, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం రైల్వేస్టేషన్లలో హాల్ట్‌ కల్పించారు. సూరత్‌, రాయపూర్‌, భిలాయ్‌, అహ్మదా బాద్‌, గాంధీదామ్‌ ప్రాంతాల్లో ఉత్తరాంధ్రకు చెందిన అనేక మంది పనిచేస్తున్నారు. వీరు ఆ ప్రాంతాలకు వెళ్లడానికి రైలు సౌకర్యం ఉన్నా పూర్తిస్థాయిలో బెర్త్‌లు దొరక్క జనరల్‌ భోగీల్లో ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటి నుంచో గుజరాత్‌ వరకూ ప్రత్యేక రైలు నడపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అమృత్‌భారత్‌ రైలు అందు బాటులోకి రానుండడంతో తాము కష్టాల నుంచి గట్టెక్కగలమని భావిస్తున్నారు. అలాగే అమృత్‌భారత్‌ రైలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ మీదుగా ప్రయాణిస్తూ వస్త్ర, వాణిజ్య కేంద్రాలను అనుసంధానం చేయనుంది. దీనిద్వారా ఆర్థిక, పారిశ్రామిక చైతన్యం పెంపొందించవచ్చని రైల్వేశాఖ భావిస్తోంది.

అమృత్‌ భారత్‌ రైలు (09022)ను శనివారం మధ్యాహ్నం 12 గంట లకు ప్రారంభించనున్నారు. మరుసటి రోజు 9 గంటలకు సూరత్‌ (ఉద్నా)కు చేరుకుంటుంది. పార్వతీపురం మీదుగా సుంగర్‌ పూర్‌రోడ్‌, మునిగుడ, కేసింగి, కాంటాబంజి, ఖరియారోడ్‌, మహాసముంద్‌, లఖోలి, బద్ధియా, రాయఘడ, నాగపూర్‌, బుసావల్‌ వంటి రైల్వేస్టేషన్ల గుండా ప్రయాణిస్తుంది. ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో తయారు చేసిన ఈ రైలు సీటింగ్‌ ఏర్పాటు, మెరుగైన సౌకర్యాలు కల్పించారు. మొత్తం 22 కోచ్‌లు ఉండే ఈ రైలులో 11 జనరల్‌ సెకండ్‌క్లాస్‌ సిటింగ్‌ కోచ్‌లు, స్లీపర్‌ క్లాస్‌కోచ్‌లు, రెండు సెకండ్‌ క్లాస్‌-లగేజీ వ్యానులు, ప్యాంట్రీకార్‌ పొందుపరిచారు.

పలాస రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన డీఆర్‌ఎం

అమృత్‌ భారత్‌ రైలును పలాస రైల్వేస్టేషన్‌లో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు జెండా ఊపి ప్రారంభిస్తారని రైల్వేశాఖ ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు పలాస రైలు చేరుతుందని, ఆయనతో పాటు ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా హాజరుకానున్నారని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఈస్ట్‌కోస్ట్‌రైల్వే ఖుర్ధారోడ్‌ డివిజన్‌ రైల్వేమేనేజర్‌ అలోక్‌ త్రిపాఠి పలాస రైల్వేస్టేషన్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఫ్లాట్‌ఫారం 2లో రైలును నిలుపుదల చేయనుండడంతో స్టేషన్‌ను సుందరీకరించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ అనిల్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 11:55 PM