అమ్మో... చలి
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:25 AM
low temparatures జిల్లావాసులను చలి వణికించేస్తోంది. మరోవైపు పొగమంచు కమ్మేస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ, సరిహద్దు ప్రాంతాల్లో రాత్రివేళ 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
వణికిస్తున్న శీతలగాలులు
రోజురోజుకూ తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
ఇబ్బందులు పడుతున్న జిల్లావాసులు
వృద్ధులు, చిన్నారులకు శ్వాసకోశ వ్యాధులు
నరసన్నపేట/ మెళియాపుట్టి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లావాసులను చలి వణికించేస్తోంది. మరోవైపు పొగమంచు కమ్మేస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ, సరిహద్దు ప్రాంతాల్లో రాత్రివేళ 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మెళియాపుట్టి, మందస, టెక్కలి, నందిగాం, పాతపట్నం, కొత్తూరు మండలాలతోపాటు ఉద్దానం ప్రాంతాల్లో పగలు ఉష్ణోగ్రతలు 20కి మించి నమోదు కావడం లేదు. రాత్రి, పగలూ ఉష్ణోగ్రతలు తగ్గడం, అధికంగా శీతలగాలులు వీస్తుండడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు గజగజలాడిపోతున్నారు. పిల్లలు, వృద్ధులు రోగాలబారిన పడుతున్నారు. దగ్గు, జలుబు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. అటువంటి వారంతా చలికి తట్టుకోలేక మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నివస్త్రాలు ధరించినా.. శీతల గాలుల ప్రభావం తట్టుకోలేక కొంతమంది చలిమంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. గాలిలో తేమశాతం పెరగడంతో చలితీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
కమ్మేస్తున్న పొగమంచు
జిల్లాలో రహదారులను మంచు దుప్పటి కప్పేస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వీస్తుండగా మరోవైపు ఉదయం 8 గంటల వరకు పొగమంచు కురుస్తోంది. పొగ మంచువల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పట్టణాల్లో పాఠశాలలకు బస్సుల్లో, ఆటోల్లో వచ్చే విద్యార్థులు గజగజలాడుతున్నారు. మంచు ప్రభావంతో పెసర, మినప పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
చలికాలంలో వృద్ధులు, చిన్నారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఉన్ని వస్త్రాలు ధరించాలి. చలికి మంటలను వేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- ఎస్.శ్రీనివాసబాబు, సూపరింటెండెంట్, సామాజిక ఆసుపత్రి, నరసన్నపేట
జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా (డిగ్రీల సెల్సియస్‌లో)
-------------------------------------------
తేదీ గరిష్ఠం కనిష్ఠం
-------------------------------------------
7న 27 18
8న 26 18
9న 26 17
10న 27 17
11న 25 16
12న 27 17