Share News

అమ్మో.. ఎయిడ్స్‌!

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:35 AM

Today is World AIDS Day ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన వైరస్‌ హెచ్‌ఐవీ. 1990-2002 మధ్య జిల్లాలో హెచ్‌ఐవీ కేసుల తీవ్రత అధికంగా ఉండేది. ప్రస్తుతం తగ్గుముఖం పట్టడం ఉపశమనమే అయినా.. ఇంకా కేసులు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో గడిచిన ఐదేళ్లలో హెచ్‌ఐవీతో మృతి చెందేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది.

అమ్మో.. ఎయిడ్స్‌!

  • కేసుల సంఖ్య తగ్గినా.. అప్రమత్తంగా ఉండాల్సిందే

  • నేడు ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం

  • ఇచ్ఛాపురం/ నరసన్నపేట, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన వైరస్‌ హెచ్‌ఐవీ. 1990-2002 మధ్య జిల్లాలో హెచ్‌ఐవీ కేసుల తీవ్రత అధికంగా ఉండేది. ప్రస్తుతం తగ్గుముఖం పట్టడం ఉపశమనమే అయినా.. ఇంకా కేసులు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో గడిచిన ఐదేళ్లలో హెచ్‌ఐవీతో మృతి చెందేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. జిల్లాలో మొత్తం 1,768 మంది మృతి చెందగా.. వీరిలో స్త్రీలు 637 మంది, 1,131 మంది పురుషులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏఆర్టీ కేంద్రాల్లో ప్రభుత్వం ఉచితంగా మందులను పంపిణీ చేయడం. బాధితులకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో మరణాల సంఖ్య తగ్గింది. జిల్లాలో ప్రధానంగా వలసలు అధికంగా ఉండడం, ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా విస్తరిస్తూ వచ్చింది. చాలావరకూ కట్టడి చేయడంలో జిల్లా యంత్రాంగం సఫలమైంది. అవగాహనతోనే ఎక్కువ మంది ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సెక్స్‌తో పాటు వైద్యసేవల సమయంలో అప్రమత్తంగా ఉంటున్నారు.

  • వ్యసనాలే కారణం..

  • ప్రస్తుతం మద్యం మత్తులో యువత చిత్తు అవుతోంది. వ్యసనాల కారణంగా కొంతమంది తప్పటడుగులు వేస్తున్నారు. ఆపై ఆర్థికపరమైన ఇబ్బందులతో సెక్స్‌ వర్కర్లు పెరగడం కారణంగా పలువురు హెచ్‌ఐవీ బారిన పడుతున్నారు. ముఖ్యంగా సెక్స్‌ పరంగానే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఒక్కోసారి రక్తం, అవయవ మార్పిడి, అస్తవ్యస్త వైద్య విధానంతో ఈ వైరస్‌ వ్యాపిస్తోంది. ప్రధానంగా 15 నుంచి 49 సంవత్సరాల్లోపు వారు హెచ్‌ఐవీ బారిన పడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం, బాధితులపై పర్యవేక్షణ కరువవ్వడం, కేసుల గుర్తింపులో జాప్యం తదితర కారణాలతో ఎక్కువమంది ఆస్పత్రి పాలవుతున్నారు. హెచ్‌ఐవీ బయటపడితే కుటుంబ పరువు ఎక్కడిపోతుందోనని చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. ఇంకొందరు మనోవ్యధకు గురై మరింత కృంగిపోయి మరణిస్తున్నారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ తీవ్రతను తగ్గించే చాలా రకాల మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం అందుబాటులో ఉన్నాయి. 2008 నుంచి ఏఆర్టీ(యాంటీ రైట్రోవైరల్‌ థెరపీ ద్వారా)మందులు ఇస్తున్నారు. బాధితులకు నెలకు రూ.2,250 చొప్పున పింఛన్‌ కూడా అందుతోంది.

  • జిల్లాలో చికిత్సా కేంద్రాలివీ

  • సమగ్ర సలహా, పరీక్ష కేంద్రాలు, ఐసీటీసీలు- పీపీటీసీటీలు : 15

  • పెసిలిటీ ఇంటిగ్రేటెడ్‌ ఐసీటీసీలు (ప్రాథమిక ఆరోగ్య /పట్టణ కేంద్రాలు : 113

  • ఏఆర్‌టీ కేంద్రాలు :3 (శ్రీకాకుళంలో జీజీహెచ్‌, టెక్కలిలో జిల్లా ఆసుపత్రి, రాగోలులో జెమ్స్‌)

  • లింక్‌ ఏఆర్‌టీ కేంద్రాలు :10 (ఇచ్చాపురం, సోంపేట, పలాస, నరసన్నపేట, పాతపట్నం, కొత్తూరు, బుడితి, పొందూరు, కోటబొమ్మాళి, రణస్థలం)

  • సుఖవ్యాధుల చికిత్సా కేంద్రాలు : జీజీహెచ్‌- శ్రీకాకుళం, జిల్లా ఆసుపత్రి - టెక్కలి

  • రక్తనిధి కేంద్రాలు:11 (ప్రభుత్వం :04 ప్రైవేట్‌:07 ):

  • టార్గెట్‌ ఇంటర్‌ వెన్సన్‌ సెంటర్‌ (స్వచ్చంద సేవాసంస్ధలు ): 3

  • లింక్‌ వర్కర్స్‌ ప్రాజెక్టు (గ్రామాల్లో ): 100

  • కేర్‌ సపోర్టు సెంటర్‌: 1 (ఎస్‌ఎన్‌పీ, శ్రీకాకుళం)

  • జిల్లాలో క్రమం తప్పకుండా ఏఆర్‌టీ మందులువాడే వారి సంఖ్య : 19,992 మంది

  • నేడు అవగాహన ర్యాలీ

  • ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా సోమవారం అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.అనిత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణాధికారి డా.శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ఏడురోడ్ల జంక్షన్‌, జీటీ రోడ్డు, చిన్నబజార్‌ మీదుగా పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అక్కడ నుంచి మళ్లీ ఏడురోడ్ల జంక్షన్‌ వద్దకు చేరుకుని మానవహారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎయిడ్స్‌పై ప్రజల్లో అపోహలు తొలగించడం, అవగాహన పెంచడం, నివారణ, సంరక్షణ, ఐక్యత సందేశం ఈ ర్యాలీ లక్ష్యమన్నారు.

  • సంవత్సరం పరీక్షల సంఖ్య బాధిత పురుషులు బాధిత స్త్రీలు బాధిత గర్భిణులు మొత్తం హెచ్‌ఐవీ శాతం

  • 2022-23 1,23,879 233 207 16 440 0.36

  • 2023-24 1,23,424 267 201 14 472 0.38

  • 2024-25 1,10,241 203 188 15 392 0.36

  • 2025-26 62,906 96 75 7 172 0.27

  • (అక్టోబర్‌ 30వరకు)

  • అవగాహన పెంచుతున్నాం

  • జిల్లాలో ఎయిడ్స్‌ను సమూల నిర్మూలనకు కృషి చేస్తున్నాం. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. హెచ్‌ఐవీ వైరస్‌ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో మందులు అందిస్తే చాలా ప్రయోజనం. కలెక్టర్‌, వైద్యఆరోగ్యశాఖ, ప్రభుత్వ, ప్రభుత్వేతర శాఖల సహాకరాంతో ప్రజలకు విస్తృతంగా హెచ్‌ఐవీ నివారణపై అవగాహన కల్పిస్తున్నాం. గర్భిణుల నుంచి పిల్లలకు ఎట్టి పరిస్థితిలో వ్యాధి సోకకుండా కట్టడి చేస్తున్నాం.

    - డాక్టర్‌ టి.శ్రీకాంత్‌, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణాధికారి, శ్రీకాకుళం

  • మనోధైర్యం కల్పిస్తున్నాం

  • హెచ్‌ఐవీ వ్యాప్తి చెందకుండా బాధితులకు కౌన్సిలింగ్‌, అవగాహన ద్వారా మనోధైర్యం కల్పిస్తున్నాం. ఏఆర్టీ కేంద్రాల వద్ద మందులను అందజేస్తున్నాం. వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడితే ప్రాణనష్టం ఉండదు.

    - రెడ్డి భార్గవ్‌, ఎండీ, ఏఆర్టీ వైద్యులు, నరసన్నపేట, సామాజిక ఆసుపత్రి

Updated Date - Dec 01 , 2025 | 12:35 AM