అంబేడ్కర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసం
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:00 AM
Ambedkar statue vandalized శ్రీకాకుళం హయాతీ నగరం బాలజీనగర్‌లో అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు.
నిందితులపై చర్యలు తీసుకోవాలి
దళిత సంఘాల నాయకులు డిమాండ్
శ్రీకాకుళం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం హయాతీ నగరం బాలజీనగర్‌లో అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ పైడిపునాయుడు, ఎస్‌ఐ హరికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దగ్గరలో ఉన్న సీసీ పుటేజ్‌ల ఆధారంగా ఇద్దరు వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి ఈ విగ్రహం చేతిని విరగ్గొట్టినట్టు గుర్తించారు. వారి కోసం గాలిస్తున్నారు. మద్యం మత్తులో విగ్రహాన్ని ధ్వంసం చేశారా? ఉద్దేశపూర్వకంగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా? అనే దానిపై ఆరా తీస్తున్నారు. సోమవారం అంబేడ్కర్ ఇండియా మిషన్ (ఎయిమ్) నాయకులు కంఠ వేణు, తైక్వాండో శ్రీను అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. విగ్రహానికి మరమ్మతులు చేపట్టారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం.