Share News

Minister Nimmala Ramanaidu: అమాత్యా.. ఇవిగో సమస్యలు

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:52 PM

Minister Nimmala Ramanaidu: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు అధ్వానంగా ఉన్నాయి. వంశధార, నాగావళి, మహేంద్రతనయా, బాహుదా, నారాయణపురం తదితర ప్రాజెక్టులు, వాటి పరిధిలోని కాలువలు నిర్వహణకు నోచుకోవడం లేదు.

Minister Nimmala Ramanaidu: అమాత్యా.. ఇవిగో సమస్యలు
జలుమూరు మండలం టెక్కలిపాడు వంశధార ఎడమ కాలువ

-సాగునీటి ప్రాజెక్టులు బాగుపడేనా?

-అధ్వానంగా కాలువలు.. దెబ్బతిన్న షటర్లు

-ప్రమాదంలో గొట్టా బ్యారేజీ

-వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం

-నిర్వహణను గొలికొదిలేసిన వైనం

-ప్రస్తుత ప్రభుత్వంపైనే ఆశలు

-నేడు జిల్లాకు నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాక

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు అధ్వానంగా ఉన్నాయి. వంశధార, నాగావళి, మహేంద్రతనయా, బాహుదా, నారాయణపురం తదితర ప్రాజెక్టులు, వాటి పరిధిలోని కాలువలు నిర్వహణకు నోచుకోవడం లేదు. ఎటుచూసినా కట్టలు కుంగిపోయి, గండ్లు పడుతూ, పూడిక పేరుపోయి, షట్టర్లు దెబ్బతిని కనిపిస్తున్నాయి. దీనివల్ల ఆయకట్టు పరిధిలోని శివారు భూములకు నీరు అందక పంటలు దెబ్బతింటున్నాయి. గత ఐదేళ్లూ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఆధునికీరణకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. దీంతో రైతులు కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం జిల్లాకు రానున్నారు. మరో రెండు నెలల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుందని, ఈలోగా సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.


నరసన్నపేట, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వంశధార కాలువల ద్వారా 2.08 లక్షల ఎకరాలకు సాగు అందాల్సి ఉంది. ఎడమ కాలువ ద్వారా హిరమండలం, సారవకోట, జలుమూరు, నరసన్నపేట, పోలాకి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, టెక్కలి, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 1.48 లక్షల ఎకరాలకు, కుడి కాలువ ద్వారా జలుమూరు, ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, శ్రీకాకుళం రూరల్‌, గార మండలాల్లో 60 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పిడికెడు మట్టి పనులు కూడా చేయకపోవడంతో ఎడమ కాలువ పరిధిలోని శివారు ప్రాంతాలైన పోలాకి, కోటబొమ్మాళి, టెక్కలి, వజ్రపుకొత్తూరు, పలాస మండలాలకు సక్రమంగా సాగునీరు అందడం లేదు. జలుమూరు, నరసన్నపేట, పోలాకి మండలాల్లో ఓపెన్‌హెడ్‌ చానల్స్‌ మీద ఆధారపడి ఉన్న కాలువ ద్వారా సాగునీరు అందక ఏటా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడమ కాలువ, అనుబంధ కాలువల్లో సిల్ట్‌, గుర్రపుడెక్క పేరుకుపోయింది. చాలాచోట్ల షట్టర్లు లేవు. గత ఖరీఫ్‌లో వంశధార ఎడమ కాలువ పరిధిలో 35వేల ఎకరాల వరి పంట దెబ్బతింది. అదే విధంగా కుడి కాలువ పరిధిలోని శ్రీకాకుళం రూరల్‌, గార మండలాల్లో శివారు ప్రాంతాలకు సాగునీరు అందక వర్షంపైనే రైతులు ఆధారపడుతున్నారు. ఆర్‌ఎంసీ కాలువల్లో పేరుకుపోయిన పూడికతో పాటు గుర్రపు డెక్క కారణంగా ఈ దుస్థితి ఏర్పడింది.


నాగవళి నదిపై ఉన్న నారాయణపురం ఆయకట్టు ద్వారా జిల్లాలో ఆమదాలవలస, పొందూరు, బూర్జ, ఎచ్చెర్ల, లావేరు మండలాలకు సాగునీరు అందుతుంది. ఈ కాలువలు కూడా ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో సాగునీరు అందక ఎచ్చెర్ల, లావేరు మండలాల్లో ఈఏడాది పంటలు దెబ్బతిన్నాయి. ఇక ఉద్దానం ప్రాంతానికి సాగునీరు అందించే మహేంద్రతనయ, ఆఫ్‌షోర్‌ పనులు జరగగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం

గత వైసీపీ ప్రభుత్వం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. వంశధార, నాగావళి, ఆఫ్‌షోర్‌, నారాయణపురం, బాహుదా వంటి ప్రాజెక్టులు, వాటి పరిధిలోని కాలువల నిర్వహణను గాలికొదిలేయడంతో గత ఐదేళ్లూ సక్రమంగా సాగునీరు అందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలువల్లో అక్కడక్కడ పనులు చేసి పూడికలు తొలగించారు. మరో రెండు నెలల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. ఇప్పుడే సాగునీటి వనరులకు సంబంధించి పనులు చేపట్టాలి. ప్రస్తుతం సాగునీటి సంఘాల నియామకం పూర్తయ్యింది. ఇటీవల చెరువులు, కాలువల మరమ్మతులకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. ఈ రెండు నెలల్లో వాటిని పూర్తిచేయాల్సి ఉంటుంది. లేకుంటే ఖరీఫ్‌లో ఇబ్బందికరమే.

21nnp4.gif

జమ్ము సమీపంలో నరసన్నపేట బ్రాంచ్‌ కాలువపై దెబ్బతిన్న షటర్లు

Updated Date - Apr 21 , 2025 | 11:52 PM