Share News

Great teachers: బోధనలో ముగ్గురూ.. ముగ్గురే!

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:30 AM

state-level award winners రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయినులు తిమ్మరాజు నీరజ, కూర్మాన అరుణకుమారి, బూరవల్లి విజయభారతి ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వీరు అవార్డులను అందుకోనున్నారు.

Great teachers: బోధనలో ముగ్గురూ.. ముగ్గురే!
వినూత్నంగా బోధిస్తున్న అరుణకుమారి, నీరజ, విజయభారతి(ఫైల్‌)

రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతల విజయ ప్రస్థానం

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయినులు తిమ్మరాజు నీరజ, కూర్మాన అరుణకుమారి, బూరవల్లి విజయభారతి ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వీరు అవార్డులను అందుకోనున్నారు. కాగా.. బోధనలో వారి ప్రత్యేకత, విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో వారి కృషి ఎనలేనది. వినూత్న పద్ధతులతో బోధన అవలంభిస్తూ.. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారి విజయ ప్రస్థానం గురించి ప్రత్యేక కథనం.

బట్టీ విధానానికి స్వస్తి..

సృజనాత్మకకు అరుణకుమారి ప్రాధాన్యం

జి.సిగడాం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): సమయపాలన, క్రమశిక్షణకు ఆమె మారుపేరు. అవార్డులు, డాక్టరేట్‌లు ఆమె సొంతం. రాష్ట్ర, జిల్లాస్థాయిల్లోని వివిధ శిక్షణా కార్యక్రమాల్లో దిట్ట. బట్టీ విధానానికి స్వస్తి చెప్పి.. ఉపకరణాలు, బొమ్మల ఆధారంగా సృజనాత్మకత బోధనలో ఆమెకు ఆమే సాటి. ఇదీ జి.సిగడాం మండలం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని కూర్మాన అరుణకుమారి ప్రత్యేకత. ఈమె వినూత్న బోధనతో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్నారు. బట్టీ విధానంలో విద్యార్థులు చదివితే పెద్దగా గుర్తుండదు. అందుకే పాఠాలు, నృత్యాలు, టీచింగ్‌, లెర్నింగ్‌ మెటీరియల్‌ సహకారంతో అభినయం, నాటకీకరణ, వర్కింగ్‌ మోడల్స్‌ ద్వారా బోధిస్తే సులువుగా అర్థమవుతుందని ప్రధానోపాధ్యాయులు అరుణకుమారి ఆచరణలో నిరూపించారు. పనికిరాని వస్తువులతో బోధనోపకరణాలు తయారుచేసి వాటికి సృజనాత్మకత జోడించి కొత్త ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయని రుజువు చేశారు. వర్ణమాల మొదలు ఆంగ్లవ్యాకరణం, గణిత ప్రక్రియ మానవశరీర భాగాలు, పర్యావరణం, అనేక అంశాలలో బోధనోపకరణాలు రూపొందించారు.

ఈమె ఎఫ్‌ఎల్‌ఎన్‌ రాష్ట్ర వృత్తి శిక్షణలో కేఆర్‌పీగా, తెలుగు మాడ్యూల్‌ రైటర్‌గా వ్యవహరించారు. మోడల్‌ లైబ్రరీ శిక్షణలో, జాతీయస్థాయి బొమ్మల ఆధారిత బోధనలో, రాష్ట్రస్థాయి శిక్షణలో పాల్గొన్నారు. ఫ్రూట్స్‌ బృందంలో, ఫ్రూట్స్‌ ఈ మ్యాగజైన్‌లో 2020 నుంచీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ఏపీ-ఈ పాఠశాల, డీటీహెచ్‌ సేవలు, దీక్షా యాప్‌ ఈ- కంటెంట్‌ క్రియేటింగ్‌ పాఠం ఆమె అవలీలగా సృష్టించారు. పిల్లల కోసం నిర్వహించిన యూట్యూబ్‌ ఛానల్‌, వ్యక్తిగత కంటెంట్‌, టీఎల్‌ఎం, క్రాఫ్ట్‌లను 2,29,589 మంది వీక్షించారు. పాఠశాలలో చేరిన వారి కోసం నిర్వహించిన సామాజిక ప్రేరణ కార్యక్రమాలు, పీటీఏ సమావేశాలు, ఏఎంసీ, పీఎంసీ ప్రత్యేక డ్రైవ్‌లో కీలకపాత్ర పోషించారు. 2023లో మ్యాజిక్‌ ఆఫ్‌ రికార్డు డ్యూ ఢిల్లీ నుంచి గౌరవ డాక్టరేట్‌, 2023లో విశాఖపట్నం సెయింట్‌ పాల్‌ విశ్వవిద్యాలయంలో అవార్డు సొంతం చేసుకున్నారు. 2023లో గుంటూరులో తెలుగు బాలోత్సవ్‌లో పాల్గొన్నారు. 2024లో విజయవాడలో రాష్ట్రస్థాయి కేఆర్‌పీగా వ్యవహరించారు. జిల్లా ఎఫ్‌ఎల్‌ఎన్‌లో శిక్షకులు, వివిధ ఎన్జీవోల నుంచి అవార్డులు పొందారు. పాఠశాల విద్యార్థులతో కలిసి రాష్ట్రస్థాయి సంకలనంలో 3వ స్థానంలో నిలిచారు. ఈమెకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడంపై ఎంఈవోలు అరసాడ రవి, మొండి శ్రీనివాసరావుతో పాటు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

సంతోషంగా ఉంది.

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డుకి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. గతంలో జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిలలో వివిధ అంశాలపై పలు అవార్డులను, డాక్టరేట్లను పొందాను. విద్యార్థులలో చదువుపై ఆసక్తిని పెంచడానికి చిత్రలేఖనం, పుస్తకపఠనం, పుస్తక సమీక్షలు చేయిస్తున్నాం. సీతాకోకచిలుక ఆకారంలో లైబ్రరీ పుస్తకాలను ఏర్పాటు చేసి ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌, పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నాం. టీఎల్‌ఎం కార్నర్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు ఆకర్షణీయమైన బోధనోపకరణాలు ఏర్పాటు చేశాం.

- కూర్మాన అరుణకుమారి, ప్రధానోపాధ్యాయురాలు, బూటుపేట

...............................

సులభ పద్ధతిలో హిందీ

ఇదీ తిమ్మరాజు నీరజ ఘనత

శ్రీకాకుళం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆమె పేరు తెలియనివారు లేరు. ఇప్పటికే ఆమె చాలా రికార్డులను సొంతం చేసుకున్నారు. గిన్నీస్‌బుక్‌లో కూడా చోటు సంపాదించారు. కూచిపూడి నృత్యంలో అద్భుత ప్రతిభ చూపుతూనే.. ఉపాధ్యాయురాలిగా కూడా రాణిస్తున్నారు. విద్యార్థులకు హిందీని సులభ పద్ధతిలో బోధిస్తూ.. శతశాతం ఫలితాల సాధనలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదీ శ్రీకాకుళం నగరంలోని అంధవరపు వరం మునిసిపల్‌ ఉన్నత పాఠశాల(ఏవీఎన్‌ ఎంహెచ్‌)లో హిందీ పండితురాలు తిమ్మరాజు నీరజ ఘనత. ఈమె జిల్లావాసులకు నీరజా సుబ్రహ్మణ్యంగా సుపరిచుతురాలు. శ్రీకాకుళం నగరానికి చెందిన ఈమె 2002 డీఎస్సీలో గ్రేడ్‌2 హిందీ పండిట్‌గా కొలువు సాధించి.. ప్రియాగ్రహారంలో విధుల్లో చేరారు. 2007లో శ్రీకాకుళం మునిసిపల్‌ పరిధి పాఠశాలకు బదిలీపై వచ్చారు. 2012లో స్కూల్‌ అసిస్టెంట్‌గా ప్రమోషన్‌ పొందారు. 2007 నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు టీపీఎంహెచ్‌ స్కూల్‌లో పనిచేశారు. ప్రస్తుతం ఏవీఎన్‌ ఎంహెచ్‌ స్కూల్‌లో విధులు నిర్వరిస్తున్నారు. విద్యార్థులకు హిందీ భాషపై భయాన్ని పోగొట్టేటా వినూత్నంగా పాఠాలను నేర్పించారు. హిందీ భాషను సులభంగా నేర్చుకునేలా తరగతి గదిలో పాఠాలను ఇన్నోవేటివ్‌గా వివరించడం ఆమె ప్రత్యేకం. పాటల రూపంలోనూ.. నృత్యాల రూపంలోనూ.. అంత్యాక్షరి వంటి ఆటల రూపంలో సృజనాత్మకంగా హిందీ భాషను విద్యార్థులో మెదడులోకి ఎక్కించి.. శతశాతం ఫలితాలు వచ్చేలా కృషి చేశారు. ఆమె 2004లో విధులు నిర్వహిస్తున్న చోట శతశాతం ఉత్తీర్ణత లభించడంతో జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకున్నారు. ఏటా హిందీ సబ్జెక్ట్‌లో నూరుశాతం ఫలితం సాధించడమన్నది.. ఆమె ఉపాధ్యాయ వృత్తి పట్ల నిబద్ధతను తెలియజేస్తోంది. ఈమెకు కూచిపూడి నృత్యం అంటే మక్కువ. అందులో అద్భుత ప్రతిభ చాటారు. సొంతంగా శిష్య బృందాన్ని తీర్చిదిద్ది.. దేశ, రాష్ట్రస్థాయిల్లో ప్రదర్శనలు ఇచ్చి.. గిన్నీస్‌ బుక్‌లో కూడా చోటు సాధించారు. తాజాగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భాషపై మక్కువతో నేర్పించా..

విద్యార్థులకు ముందుగా హిందీపై భయాన్ని తొలగించి.. భాషపై పట్టు పెరిగేలా.. ఆసక్తి కలిగేలా కొంత సృజన్మాతకత జోడించాను. కేవలం బోర్డుపై పాఠాల మాదిరిగానే కాకుండా.. బొమ్మల రూపంలోనూ.. ఆటల్లో.. పాటల్లో పిల్లలకు నేర్పించాను. దీంతో ఇతర సబ్జెక్టుల మాదిరిగానే హిందీలో కూడా శతశాతం ఉత్తీర్ణత సాధించగలిగారు. ఉత్తమ ఉపాధ్యాయరాలిగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది.

- తిమ్మరాజు నీరజ, హిందీ పండితురాలు, శ్రీకాకుళం

.................................

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

ప్రాజెక్టులతో ఆసక్తి పెంచిన విజయభారతి

మెళియాపుట్టి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీయడంలో ఆమె కృషి ఎనలేనిది. చదువులో వెనుకబడిన విద్యార్థులను ముందుకు తీసుకువచ్చేలా వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌(టీఎల్‌ఎం)ను వినియోగించి కొత్త విషయాలపై అవగాహన కల్పించేలా బోధన సాగిస్తున్నారు. ఫిజిక్స్‌ అంటే విద్యార్థులకు భయం పోగొట్టి.. ఆసక్తి పెంచేలా ప్రాజెక్టుల ద్వారా బోధన చేపడుతున్నారు. ఇదీ మెళియాపుట్టి మండలం నేలబొంతు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బూరవల్లి విజయభారతి ప్రత్యేకత. ఈమె 2001లో మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురంలోని గిరిజన సంక్షేమశాఖ బాలుర పాఠశాలలో సైన్స్‌ ఉపాధ్యాయురాలిగా చేరారు. ప్రస్తుతం నేలబొంతు ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నారు. గిరిజన విద్యార్థులకు అండగా నిలుస్తూ.. వారి అవసరాలు తీరుస్తున్నారు. వారికి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. డ్రాపౌట్స్‌ విద్యార్థులను ఆశ్రమ పాఠశాలలో చేర్పించేందుకు తనవంతు కృషి చేశారు. విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలు కల్పిస్తున్నారు. 9వ తరగతి సైన్స్‌ టెక్ట్స్‌బుక్‌లో పాఠ్యాంశం రాయడంలో కీలకపాత్ర పోషించారు. విద్యార్థులతో ప్రాజెక్టులు రూపొందించి.. వాటి ద్వారా మెరుగైన బోధన చేపడుతున్నారు. ఈ క్రమంలో గత రెండేళ్ల నుంచి ఈ పాఠశాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థినులు ట్రిపుల్‌ ఐటీకి ఎంపికయ్యారు.

నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను

నా ఉద్యోగ బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. ఏనాడు అవార్డుల కోసం బోధన చేపట్టలేదు. విద్యార్థుల ఉన్నతి కోసం పనిచేశాను. పస్తుతం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. మా నాన్న త్రినాథరావు డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. మా తల్లి పద్మావతి కూడా ఉన్నత విద్యావంతురాలు. చిన్నప్పటి నుంచీ క్రమశిక్షణ అలవాటైంది. గతేడాది జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికే కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు చేతులమీదుగా అవార్డు అందుకున్నాను.

- విజయభారతి, ప్రధానోపాధ్యాయురాలు, నేలబొంతు

Updated Date - Sep 05 , 2025 | 12:31 AM