Booklet : జవాబులన్నీ.. ఒకే పుస్తకంలో..
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:57 PM
Formative-1 from today విద్యావ్యవస్థలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ పరీక్షలు నిర్వహించేలా.. విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేలా నూతన విధానానికి శ్రీకారం చుట్టింది.
- ప్రైవేటుకు ధీటుగా.. ప్రభుత్వ పాఠశాలలో పరీక్షలు
- విద్యార్థులకు అసెస్‌మెంట్ బుక్‌లెట్‌లు
- నేటి నుంచి ఫార్మెటివ్-1
హరిపురం/ నరసన్నపేట, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): విద్యావ్యవస్థలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ పరీక్షలు నిర్వహించేలా.. విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేలా నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఒకటి నుంచి 10వ తరగతి వరకు సమ్మెటివ్, ఫార్మెటివ్ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రశ్నాపత్రాలతోపాటు జవాబులు రాసేందుకు తెల్లకాగితాలు ఇచ్చేవారు. ఇకపై ఈ ఏడాది నుంచి అన్ని పరీక్షల జవాబులు ఒకే బుక్‌లో రాసేలా.. విద్యార్థులకు అసెస్‌మెంట్ బుక్‌లెట్‌లను ప్రభుత్వం సరఫరా చేసింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు సుమారు 1..5 లక్షల మంది చదువుతున్నారు. ఒకటి, రెండు తరగతులకు మూడు సబ్జెక్టులు, 3,4,5 తరగతులకు నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి. అలాగే ఆరు, ఏడు తరగతులకు ఆరు సబ్జెక్టులు, ఎనిమిది నుంచి పదోతరగతి వరకు విద్యార్థులకు ఏడు సబ్జెక్టులు బోధిస్తున్నారు. ఏడాదికి నాలుగు సంగ్రహాణాత్మక, రెండు నిర్మాణాత్మక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు విద్యార్థులందరికీ ఉచితంగా అసెస్‌మెంట్ బుక్‌లెట్‌లు అందజేయనున్నారు. ఒక్కో బుక్‌లెట్‌లో 80 నుంచి 120 పేజీలు కేటాయించారు. గ్రూపులు దీనిలోనే పొందుపరిచారు. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలకు జవాబులు గుర్తించేందుకు ఓఎంఆర్ పత్రాలను జతచేశారు. జవాబులు దిద్దిన తర్వాత మార్కులను ప్రాగ్రెస్ రిపోర్టులో నమోదు చేస్తారు. ఓక్కో సబ్జెక్టుకు ఓక్కో పుస్తకాన్ని ఇవ్వనున్నారు. బుక్‌లెట్‌పై విద్యార్థి వివరాలు, అపార్ నెంబరు నమోదు చేస్తారు. బుక్‌లెట్లన్నీ ఎమ్మార్సీలకు, పాఠశాలలకు ఇప్పటికే చేరాయి. విద్యార్థి రాసిన జవాబులన్నీ బుక్‌లెట్‌లో ఉండటం వల్ల వారి సామర్థ్యాలను అంచనా వేసే వీలుంటుంది. ప్రతీ విద్యార్థి యెక్క ప్రగతి విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి చివర వరకు ఏవిధంగా అభివృద్ధి చెందిదో తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ఈ నెల 11 నుంచి 14 వరకు ఫార్మెటివ్ అసెస్‌మెట్-1 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల నుంచే అసెస్‌మెంట్ బుక్‌లెట్‌ను ఉపయోగించనున్నారు.
సమగ్ర మూల్యాంకనం కోసం..
బుక్‌లెట్ విధానంలో అన్ని జవాబులు ఒకే చోట ఉంటాయి. మూల్యాంకనంలో విలువ, విశ్వసనీయత పెరుగుతాయి. సమగ్ర మూల్యంకనానికి వీలుంటుంది. పుస్తక సమీక్షలు, ప్రాజెక్టు పనులు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. పాఠశాలలకు తెల్ల కాగితాలు స్టేషనరీ ఖర్చు తగ్గుతుంది. ప్రణాళికాబద్ధంగా పుస్తకాల్లో రాయటం విద్యార్థులకు అలవాటవుతుంది. పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో బుక్‌లెట్ విధానమే వాడుతున్నారు. దీనికి అనుగుణంగా ప్రవేశపెట్టిన బుక్‌లెట్ విధానంతో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం.
- ఎం.లక్ష్మణరావు, ఎంఈవో, మందస