ఓదార్పే మిగిలింది
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:22 PM
వారివి నిరుపేద కుటుంబాలు. గ్రామ దేవత సంబరాల సమయంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో తమ వారిని కోల్పోయారు.
- ఎలాంటి పరిహారం అందలేదు
- నాలుగు నెలలుగా ఎదురుచూపు
- ఇదీ సామంతపుట్టుగ విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబాల పరిస్థితి
- ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు
కంచిలి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వారివి నిరుపేద కుటుంబాలు. గ్రామ దేవత సంబరాల సమయంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో తమ వారిని కోల్పోయారు. ఆ సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి ఆ కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూసామని హామీ ఇచ్చారు. కానీ, నాలుగు నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా వారికి అందలేదు. ఓదార్పు తప్ప తమకు పరిహారం అందలేదని ఆ కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. తలతంపర పంచాయతీ సామంతపుట్టుగ (చిల్లొపుట్టుగ)లో ఈ ఏడాది మే 26న జరిగిన గ్రామ దేవత సంబరాల్లో విద్యుత్ ప్రమాదం సంభవించి చిల్లొ ఈశ్వరరావు (28), బహడపల్లి నందిని (12), నొళియా కృష్ణ (3) అక్కడికక్కడే మృతి చెందారు. అదే గ్రామానికే చెందిన పొడియా మనోజ్ అనే రెండేళ్ల బాలుడితోపాటు జన్ని కుమారి, చిల్లో తరిణి అనే మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధిత కుటుంబాలను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పరామర్శించి, ఆదుకుంటామని హామీలైతే ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి ఫలితం కనిపించలేదు.
ప్రభుత్వం సాయం అందలేదంటున్న ఈశ్వరరావు తల్లిదండ్రులు కామాక్షి, మధు
ఈ ప్రమాదంలో తమ కుమారుడు ఈశ్వరరావును కోల్పోయిన తల్లిదండ్రులు కామాక్షి, మధు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ‘గ్రామ దేవత సంబరాలు పూర్తయిన వెంటనే ముహూర్తాలు తీసి మా కుమారుడికి పెళ్లి చేద్దామని అనుకున్నాం. పిల్లను కూడా ఖాయం చేసుకున్నాం. రెక్కల కష్టంతో సంపాదించిన సొమ్ముతో పాటు కొంత అప్పు చేసి ఇల్లు కూడా కట్టాడు. సంబరాలకు వచ్చిన మేనల్లుడు నొళియా కృష్ణను విద్యుత్ ప్రమాదం నుంచి కాపాడేందుకు ప్రయత్నించాడు. మా బిడ్డత పాటు కృష్ణ కూడా మృతి చెందాడు. ప్రమాదం తరువాత అందరూ వచ్చి, సానుభూతి తెలిపారు. ఆదుకుంటామన్నారు కానీ ఇంతవరకు ఎటువంటి సాయం అందలేదు. చేతికి అందివచ్చిన కొడుకు, చివరి దశలో తోడు అవుతాడనుకుంటే ప్రమాద రూపంలో మృత్యువుకు బలయ్యాడు. ఇప్పుడు ఈ దశలో మాకు ఆసరా ఎవరంటూ’ కన్నీళ్లపర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆదుకుంటే మా జీవితాలు సాఫీగా సాగుతాయని, కానీ ఎవరిని వెళ్లి అడగాలో తెలియక, ఎదురుచూపులు చూస్తున్నామని వాపోతున్నారు.
ఎవరూ పట్టించుకోవడం లేదంటున్న నందిని తల్లి రాజేశ్వరీ
ఇదే ప్రమాదంలో మృతి చెందిన కంచిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని బాహడపల్లి నందిని తల్లి రాజేశ్వరి మాట్లాడుతూ.. ‘కుమార్తె మృతిని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాం. సంబరాల కోసం అమ్మమ్మ ఇంటికి వెళ్లిన మా కుమార్తె అందని లోకాలకు వెళ్లిపోయింది. ప్రమాదం జరిగిన తరువాత అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు వచ్చి ఓదార్పు మాటలు చెప్పారు. కానీ ఎటువంటి సాయం అందించలేదు. నా భర్త దీనబంధు కుటుంబ పోషణ కోసం బయట ప్రాంతాలకు వెళ్లిపోయాడు. నేను తల్లితో కలిసి గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలి.’అని వేడుకుంటోంది.