Share News

Hepatitis : హెపటైటిస్‌పై అప్రమత్తం

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:48 PM

Health alert .. World Hepatitis Day జిల్లాలో హెపటైటిస్‌(కాలేయం వాపు) బాధితుల సంఖ్య ఏటా పెరుగుతోంది. కొంతమంది మద్యం అతిగా తాగడం, మరికొందరు మరిగే నూనెను మళ్లీమళ్లీ వినియోగించి ఆహార పదార్థాలు తీసుకోవడంతో ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

Hepatitis : హెపటైటిస్‌పై అప్రమత్తం

  • వ్యాధి తీవ్రమైతే లివర్‌ మార్పిడియే శరణ్యం

  • అవగాహన లేమితో అనారోగ్యం

  • నేడు ప్రపంచ హెపటైటిస్‌ దినం

  • నరసన్నపేటకు చెందిన ఒక వ్యక్తి మద్యం అతిగా తాగడంతో లివర్‌ దెబ్బతిని మూడు నెలల కిందట మృతిచెందాడు. ముందుగా హెపటైటిస్‌(కాలేయం వాపు), పచ్చకామెర్లను గుర్తిస్తే.. ఈ ప్రమాదం తప్పిదేనని వైద్యులు తెలిపారు. హెపటైటిస్‌పై అప్రమత్తంగా ఉండాలని మృతుడి కుటుంబ సభ్యులకు సూచించారు.

  • నరసన్నపేట, జూలై 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో హెపటైటిస్‌(కాలేయం వాపు) బాధితుల సంఖ్య ఏటా పెరుగుతోంది. కొంతమంది మద్యం అతిగా తాగడం, మరికొందరు మరిగే నూనెను మళ్లీమళ్లీ వినియోగించి ఆహార పదార్థాలు తీసుకోవడంతో ఈ వ్యాధి బారిన పడుతున్నారు. శరీరంలో చేరే మద్యాన్ని విసర్జించే క్రమంలో కాలేయం ఎక్కువ శ్రమకు గురై.. దెబ్బతింటుంది. ఫలితంగా ఆల్కహాలిక్‌ సిర్రోసిస్‌ వ్యాధులు వస్తాయి. ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌ డిసీజ్‌లో కాలేయం కణాల్లో కొవ్వు పేరుకుపోయి వాపు కనిపిస్తుంది. దీన్నే ఆల్కహాలిక్‌ హెపటైటీస్‌ అంటారు. ఈ వ్యాఽఽధితో కాలేయం పనితీరు క్రమంగా అదపు తప్పుతుంది. అలాగే కలుషిత నీరు తాగడం, అపరిశ్రుభమైన వాతావరణం నడుమ జీవనం సాగించేవారు కూడా హెపటైటిస్‌ వ్యాధి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హెపటైటిస్‌పై అప్రతమత్తంగా ఉండాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వ్యాధి తీవ్రమైతే లివర్‌ మార్పిడే శరణ్యమని, ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స అందజేస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. ‘వ్యాధిగ్రస్థుడు ఏటా వైద్యపరీక్షలు చేసుకోవాలి. హెపటైటిస్‌ టీకా, వారానికి ఒక ఇంట్రఫిరాన్‌ ఇంజక్షన్‌ వేయించుకోవాలి. మాత్రల ద్వారా కూడా నియంత్రణ చేయవచ్చు’ అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

  • హెపటైటిస్‌ -ఏ: వికారం, వాంతులు, కామెర్లతో ఇది బయట పడుతోంది. ఇది దీర్ఘకాలిక వ్యాధికాదు. చాలామందిలో దానంతట అదే తగ్గిపోతుంది. రక్త పరీక్షల ఆధారంగా వ్యాధిని నయం చేయవచ్చు. ఈ వ్యాధి రాకుండా వ్యాక్సిన్‌ కూడా అందుబాటులో ఉంది.

  • హెపటైటిస్‌ -బీ: ఇది అత్యంత ప్రమాదకరమైనది. హెచ్‌ఐవీతో పోలిస్తే ఈ వ్యాధి 50 నుంచి 100 రెట్లు వేగంగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన 30నుంచి 180రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. ఈ వైరస్‌ దీర్ఘకాలంగా కాలేయంపై ప్రభావం చూపి కేన్సర్‌కు దారితీస్తుంది.

  • హెపటైటిస్‌ -సీ: ఇది ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. సరిగా స్టెరిలైజ్‌ చేయకుండా వాడే వైద్య పరికరాలతో, ఒకరికి వాడే ఇంజెక్షన్‌ సూదులను మరొకరికి వాడడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్‌ సోకిన రెండు నుంచి ఆరు వారాల్లో వ్యాధి బయట పడుతోంది. మూత్రం పచ్చగా రావడం, కడుపునొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ కూడా అందుబాటులో ఉంది.

  • హెపటైటిస్‌ - డి: దీనివల్ల లివర్‌ చెడిపోతుంది. కేన్సర్‌కు కూడా దారితీస్తోంది. హెపటైటిస్‌-బి వ్యాపించే అన్ని మార్గాల్లో ఇది కూడా వ్యాపిస్తోంది. డ్రగ్స్‌ వాడే వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. దీన్ని నివారించే మందులు అందుబాటులో ఉన్నాయి.

  • హెపటైటిస్‌ - ఈ: కలుషిత నీరు, ఆహారం వల్ల ఈ వైరస్‌ సోకుతుంది. సాధారణంగా నాలుగు నుంచి ఆరు వారాల్లో ఇది తగ్గుతుంది. కొందరిలో లివర్‌ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. రక్తం మార్పిడి, గర్భవతికి ఇన్ఫెక్షన్‌ ఉంటే బిడ్డకు కూడా సోకే అవకాశం ఉంది. దీనికి ఆసుపత్రిలో ఉండి చికిత్స చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

  • అశ్రద్ధ చేయొద్దు

  • హెపటైటిస్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. అశ్రద్ధ చేయకుండా వ్యాధిగ్రస్థుడు జీవితాంతం మందులు వాడాల్సిందే. ముందుగా హైపటైటిస్‌ టీకా వేయించుకుంటే వ్యాధి వచ్చే అవకాశం లేదు. వ్యాధి ముదిరితే కాలేయం మార్పిడి చేసుకోవాలి.

    - కింజరాపు శ్రీనివాస రవిశంకర్‌, లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జన్‌, శ్రీకాకుళం

  • చాలా ప్రమాదకరమైనది

  • హెపటైటిస్‌ వ్యాధులు ప్రమాదకరమైనవి. ఇందులో హెపటైటిస్‌ బీ, సీలు అత్యంత ప్రమాదరమైనవిగా గుర్తించాలి. అందుకే రక్తపరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే చికిత్స పొందాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.

    - పొన్నాడ గణేష్‌, సూపరింటెండెంట్‌, సామాజిక ఆసుపత్రి, కోటబొమ్మాళి

Updated Date - Jul 27 , 2025 | 11:48 PM