అప్రమత్తతే మందు
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:07 AM
The number of diabetes patients is increasing జిల్లాలో మధుమేహం(డయాబెటిస్) రోగుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి తదితర కారణాలతో డయాబెటిస్ రోగులు పెరుగుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
జిల్లాలో పెరుగుతున్న మధుమేహం రోగుల సంఖ్య
మారుతున్న జీవనశైలి, ఆపై నిద్రలేమి కారణం
టైపు - 2 బాధితులు అధికం..
నేడు వరల్డ్ డయాబెటిస్ డే
శ్రీకాకుళం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మధుమేహం(డయాబెటిస్) రోగుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి తదితర కారణాలతో డయాబెటిస్ రోగులు పెరుగుతున్నారని వైద్యులు చెబుతున్నారు. షుగర్ వచ్చిందని భయపడొద్దని, ముందు జాగ్రత్త పాటిస్తే మేలని స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం ‘వరల్డ్ డయాబెటిస్ డే’ సందర్భంగా జిల్లాలో మధుమేహం లక్షణాలు, నివారణ చర్యలు.. వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో గతేడాది టైప్ -2 డయాబెటిస్ 1,17,906 మందికి ఉన్నట్టు నిర్ధారణ అయింది. 10,343 మందికి టైప్-1 డయాబెటిస్ ఉన్నట్టు తేలింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు టైప్ -2 కేసులు 97,795 నమోదు కాగా, టైప్ -1 కేసులు 8,315 ఉన్నాయి.
డయాబెటిస్ అంటే...
శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్ లెవెల్స్) ఎక్కువగా ఉంటే డయాబెటిస్ వస్తుంది. మన శరీరంలో ఇన్సులిన్ అనే పదార్థం మన ఆహారంలో ఉన్న చక్కెరను శరీరానికి అవసరమైన శక్తిగా మార్చుతుంది. అది తగ్గిపోయినా లేదా పనిచేయకపోయినా చక్కెర రక్తంలో చేరి ఎక్కువ అవుతుంది. దానినే ‘డయాబెటిస్’ అంటారు. శరీరంలో ఇన్సులిన్ లేకపోవడం టైప్-1గా, ఇన్సులిన్ ఉన్నా పనిచేయకపోవడాన్ని టైప్-2 డయాబెటిస్‌గా గుర్తిస్తారు.
టైప్-1 డయాబెటిస్ : ఇది సాధారణంగా పిల్లల్లో, యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం పూర్తిగా ఆపేస్తుంది. కాబట్టి ఈ రకం రోగులు రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. ఇది ఎక్కువ హెరిడటరీ కారణంగా వస్తుంది. దీన్ని ‘ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్’ అంటారు.
టైప్ 2 డయాబెటీస్: ఇది పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్సులిన్ శరీరంలో తయారవుతుంది. కానీ జీవనశైల్లిలో మార్పులు కారణంగా అది సరిగ్గా పనిచేయదు. ప్రధాన కారణాలు ఏమిటంటే.. ఆహారంలో ఎక్కువ చక్కెర, కొవ్వు ఉండడం, వ్యాయామం లేకపోవడం, బరువు ఎక్కువగా ఉండటం, ఒత్తిడి, నిద్రలేమి. దీనిని ‘నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్’ అంటారు.
లక్షణాలివీ..
తరచూ మూత్రానికి వెళ్లడం. ఎక్కువ దాహం వేయడం. బరువు తగ్గడం. అలసట, నిద్రలేమి, చిన్నగాయాలు త్వరగా మానకపోవడం, చూపు మసకబారడం.. వంటివి డయాబెటిస్ లక్షణాలు. వారసత్వంగా కూడా కొందరికి డయాబెటిస్ వస్తుంది. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే రక్తంలో చక్కెర స్థాయి పరీక్ష (బ్లడ్ షుగర్ టెస్ట్) చేయించుకోవాలి.
ఉదయం ఆహారం తినకముందు ఎఫ్‌బీఎస్(ఫాస్టింగ్ బ్లడ్ షుగర్) పరీక్ష చేయించుకోవాలి. ఇది సాధారణంగా 100 ఎంజీ/డీఎల్ లోపు ఉండాలి.
భోజనం చేసిన రెండు గంటల తర్వాత పీపీబీఎస్(పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్) పరీక్ష చేయించాలి. 100-125 ఎంజీ/డీఎల్‌గా ఉంటే ప్రీ డయాబెటిస్.
గత మూడు నెలల్లో రక్తంలోని సగటు చక్కెర స్థాయిలు తెలుసుకోవడానికి హెచ్‌బీఏ1సీ పరీక్ష చేయించాలి. ఇది 126 ఎంజీ/డీఎల్ పైగా ఉంటే డయాబెటిస్ అని భావిస్తారు
డయాబెటిస్ ఉన్నవారు రోజుకి కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. ధ్యానం, స్లో బ్రీతింగ్(దీర్ఘంగా శ్వాస తీసుకోవడం) మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. నెలకోసారి బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. మందులు వాడాలి. కళ్లు, కాళ్లు, హృదయం.. ఇవి షుగర్ వల్ల ఎక్కువ ప్రభావితమవుతాయి. అందుకే సమయానికి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
నిర్లక్ష్యం చేయొద్దు
షుగర్ వస్తే జీవితం ఆగిపోదు. మనలో మార్పు తెచ్చుకుంటే చాలు. షుగర్ అంటే వ్యాధి కాదు.. జీవనశైలిని మార్చుకోవాల్సిన సూచన. భయపడొద్దు.. కానీ నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి రోజూ కొంచెం నడక, మంచి ఆహారం, నిద్ర, ఒత్తిడి లేకుండా ఉంటే షుగర్ నియంత్రణలో ఉంటుంది. రోజుకు మూడు పూటలా భోజనంలో తెల్ల అన్నాన్ని తగ్గించి.. గోధుమ, రాగి, జొన్న పిండి వంటలు వాడండి. చక్కెర, స్వీట్లు, కూల్‌డ్రింక్స్ తగ్గించాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. భోజనం తర్వాత తప్పనిసరిగా కొద్దిసేపు నడవాలి. ఆల్కాహాల్ జోలికి వెళ్లకూడదు.
- డా.కింజరాపు షర్మిల, ఎండోక్రైనాలజిస్ట్, శ్రీకాకుళం