Share News

మద్యం మత్తు.. జీవితం చిత్తు

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:03 PM

మద్యం మత్తులో యువత చిత్తు అవుతున్నారు. తమతో పాటు ఇతరుల జీవితాలను కూడా పణంగా పెడుతున్నారు.

మద్యం మత్తు.. జీవితం చిత్తు

- డ్రంకెన్‌ డ్రైవ్‌తో అధిక రోడ్డు ప్రమాదాలు

- గత రెండేళ్లలో 579 మంది మృతి

- క్షతగాత్రులైన 236 మంది

- మద్యం, మాదక ద్రవ్యాల బారిన యువత

- జరిమానా, జైలు శిక్ష విధిస్తున్నా మారని తీరు

- గత నెల 7న శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడుపుతూ డేఅండ్‌నైట్‌ జంక్షన్‌ వద్ద హల్‌చల్‌ చేశాడు. పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టగా వారిపై విరుచుకుపడ్డాడు. అప్పటికే పూటుగా మద్యం సేవించినట్టు తేలడంతో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి ఆ యువకుడికి 45 రోజుల పాటు జైలు శిక్ష విధించారు.

శ్రీకాకుళం క్రైం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో యువత చిత్తు అవుతున్నారు. తమతో పాటు ఇతరుల జీవితాలను కూడా పణంగా పెడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం డ్రంకెన్‌ డ్రైవ్‌ వల్లే జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని నివారణా చర్యలు చేపడుతున్నా కొందరు మందుబాబులు తీరు మారడం లేదు. 25 ఏళ్లలోపు యువకులే మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

గత రెండేళ్లలో పరిస్థితి..

జిల్లాలో గత రెండేళ్లలో 554 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 579 మంది చనిపోయారు. 236 మంది క్షతగాత్రులయ్యారు. వీటిలో అధికశాతం ప్రమాదాలకు కారణం మద్యం తాగి వాహనాలు నడపడమేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. గత రెండేళ్లలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన 77,292 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో ఒక వ్యక్తికి నెల రోజుల పాటు జైలుశిక్ష కూడా పడింది. కొన్నాళ్లుగా పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడుతున్నారు. మద్యం తాగి వాహనం నడిపేవారి వాహనాలను సీజ్‌ చేసి జరిమానా విధించేవారు. దీనివల్ల మందుబాబుల తీరులో ఎటువంటి మార్పు రాకపోవడంతో పోలీసులు తమ పంథా మార్చారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన వారికి జరిమానా విధించి వదిలేయకుండా కోర్టులో హాజరుపరుస్తున్నారు. కోర్టు విచారణ జరిపి మొదటిసారి పట్టుబడిన వారికి రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు జరిమానా విధిస్తుంది. రెండోసారి పట్టుబడితే జైలు శిక్ష విధిస్తుంది. అయినా మందుబాబుల తీరులో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదు.

30 శాతం మంది మైనర్లే...

మద్యం, మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిలో 30 శాతం మంది మైనర్లే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 18 నుంచి 30 మధ్య వయసున్న వారు 50 శాతం, 30-60 మధ్య వయసున్న వారు పది శాతం, 60 ఏళ్లు దాటిన వారు పది శాతం మద్యం, మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పిల్లలు తప్పటడుగులు వేస్తే తల్లిదండ్రులే పూర్తి బాధ్యత వహించాలి. మైనర్లపై కేసు నమోదైతే వారి భవిష్యత్‌కు ఇబ్బందులు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కౌన్సెలింగ్‌ ద్వారా వారిలో మార్పు తీసుకురావడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.

కఠిన చర్యలకు ఉపక్రమించినా...

ట్రాఫిక్‌ పోలీసులు రహదారి భద్రతా వారోత్సవాలు, మాసోత్సవాలు నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకున్న వారి వివరాలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పెట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తున్నారు. తాగిన మత్తులో రోడ్డు ప్రమాదాలు చేసి ఇతరుల మృతికి కారణమైన వారిపై 304 పార్ట్‌-2 ఐపీసీ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా, ఎన్ని జరిమానాలు విధిస్తున్నా చాలా మందిలో మార్పు రావడం లేదు.

పిల్లలపై శ్రద్ధ అవసరం

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రతిరోజూ డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడుతున్నాం. తనిఖీల్లో పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరుస్తున్నాం. కొంతమందికి జైలు శిక్ష కూడా పడుతుంది. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి.

-వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం

Updated Date - Nov 09 , 2025 | 11:03 PM