Share News

చేస్తున్నవి చెప్పరేం!

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:50 PM

leaders and officials are dull రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు భారీ ప్రాజెక్టులను ప్రతిపాదించింది. పలాస నియోజకవర్గంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి, ఆమదాలవలస నియోజకవర్గంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. ఈ రెండు పూర్తయితే అభివృద్ధి పరంగా జిల్లా రూపురేఖలు మారిపోతాయి. వీటిపై ప్రచారం.. ప్రజల నమ్మకాన్ని చూరగొనడం అత్యంత ముఖ్యమైన విషయం. కానీ.. ఈ విషయంలో కూటమి నాయకులు, అధికారులు కాస్త వెనుకబడి ఉన్నారు.

చేస్తున్నవి చెప్పరేం!
సరుబుజ్జిలి మండలం లక్ష్మీపురం సమీపంలో పవర్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలం

  • ఇటు ఎయిర్‌పోర్టు.. అటు థర్మల్‌ ప్రాజెక్టు..

  • రెండు అంశాలు ప్రజలకు చేరువకాని వైనం

  • అప్పుడప్పుడు సమావేశాలు.. ప్రకటనలతో సరి

  • గ్రామాలకు వెళ్లి చైతన్యం తెస్తేనే ఫలితం

  • నిస్తేజంగా ప్రజాప్రతినిధులు, అధికారులు

  • అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్రకు చాలా చేస్తున్నాం. అయినా వాటిని చెప్పుకోవడంలో విఫలమవుతున్నాం. చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అధికారులతో మంచిగా పని చేయించుకోవాల్సిన బాధ్యత మంత్రులదే. మీ శాఖలో జరిగే మంచిని ప్రచారం చేసుకోకపోతే నష్టపోయేది మీరే.

  • - ఇదీ శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

  • శ్రీకాకుళం, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు భారీ ప్రాజెక్టులను ప్రతిపాదించింది. పలాస నియోజకవర్గంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి, ఆమదాలవలస నియోజకవర్గంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. ఈ రెండు పూర్తయితే అభివృద్ధి పరంగా జిల్లా రూపురేఖలు మారిపోతాయి. వీటిపై ప్రచారం.. ప్రజల నమ్మకాన్ని చూరగొనడం అత్యంత ముఖ్యమైన విషయం. కానీ.. ఈ విషయంలో కూటమి నాయకులు, అధికారులు కాస్త వెనుకబడి ఉన్నారు. చేస్తున్న పనులు కూడా ప్రజలకు చెప్పుకోలేకపోతే ఎలాగన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • పోర్టు సమీపంలో ఎయిర్‌పోర్టు

  • సంతబొమ్మాళి మండలం మూలపేట తీరంలో ఇప్పటికే పోర్టు దాదాపు పూర్తికావచ్చింది. అతిత్వరలో వినియోగంలోకి రానుంది. పోర్టుకు ఆనుకుని సువిశాల తీరప్రాంతం ఉండడంతో విదేశాల నుంచి సరుకుల రవాణాకు ఎంతో ఉపయోగపడనుంది. దీనికితోడుగా ఎయిర్‌పోర్టు నిర్మాణం కూడా చేపట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పలాస నియోజకవర్గం మందస మండలంలో సుమారు 1300 ఎకరాల భూమి సేకరించి.. ఎయిర్‌పోర్టును నిర్మించాలని భావిస్తోంది. కొంత ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించి ముందుకెళ్లాలని ఆలోచిస్తోంది. ప్రభుత్వం అధికారిక ప్రకటనతోపాటు... ఎయిర్‌పోర్టు ఏర్పాటయ్యే ప్రాంతాల ప్రజలతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశాలు నిర్వహించారు. ప్రజలకు మూకుమ్మడిగా తెలియజేశారు. కానీ.. ప్రజలకు అర్థమయ్యేలా, ప్రతిఒక్కరిని చైతన్యపరిచే విషయంలో కాస్త వెనుకడుగులో ఉన్నారు.

  • పోర్టు ఏర్పాటైతే ఊహించని రీతిలో అభివృద్ధి..

  • పోర్టు.. ఆపై ఎయిర్‌పోర్టు నిర్మాణం వల్ల జిల్లా అభివృద్ధి ఊహించని రీతిలో జరగనుంది. ఈ విషయాన్ని ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలదే. కానీ ఈ విషయంలో వెనుకడుగులో ఉన్నారు. కొద్దిరోజుల కిందట భారీ సమావేశాన్ని నిర్వహించి కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో ఈ విషయాన్ని తెలియజేశారు. కానీ అంతటితో కార్యక్రమం ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉద్యమకారుల పేరిట.. ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటూ వెనుకనుంచి వైసీపీ నాయకులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఉద్యమాలకు పిలుపునిచ్చేలా సమావేశాలను ప్రజాసంఘాల పేరిట నిర్వహిస్తున్నారు. ఎయిర్‌పోర్టు కోసం భూములు సేకరిస్తే ప్రజలకు అన్యాయం జరిగిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు కూటమి నాయకులు. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో అధికార పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారింది. ఎడతెరిపి లేకుండా అక్కడ సమావేశాలు నిర్వహించి.. ప్రజలను చైతన్యపరిచి ఎయిర్‌పోర్టు వల్ల లాభాలను ప్రజలతోనే అనుకూలంగా చెప్పించేలా సదస్సులు నిర్వహించాలి. మండలాల నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంలేదు. దీంతో ప్రజాసంఘాల నాయకులు వారంలో రెండు మూడు సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యమాన్ని చాపకింద నీరులా స్పీడు పెంచారు. ఇప్పటికైనా కూటమి నేతలు పరిస్థితి చేయిదాటకుండా.. పోర్టుల వల్ల జిల్లాకు కలిగే ప్రయోజనాలు, అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సి అవసరం ఉంది.

  • రూ.30వేల కోట్లతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం..

  • ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలంలో రూ. 30వేల కోట్ల వ్యయంతో 3,200 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఏపీ జెన్‌కో ప్రతిపాదన సిద్ధం చేసింది. ప్రస్తుతం సాంకేతిక అభివృద్ధిలో పరిస్థితుల దృష్ట్యా భద్రత పరంగా మరిన్ని చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. కానీ ఈ విషయంలో ప్రజాసంఘాలు.. ఉద్యమ నాయకులు.. అప్పుడే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వద్దంటూ గ్రామాల్లో సభలు పెట్టేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత నింపుతున్నారు. కాగా.. థర్మల్‌ ప్రాజెక్టు ఏర్పాటైతే కలిగే ప్రయోజనాలను వివరించడంలో అధికార పార్టీ నాయకులు.. ప్రభుత్వ పెద్దలూ వెనుకడుగులో ఉన్నారు. ‘థర్మల్‌’పై ప్రజల్లో భయాందోళనకు చెక్‌పెట్టేలా.. సందేహాల నివృత్తి చేసేలా సరైన కార్యక్రమాలు.. నిర్వహించలేకపోయారు. ఈ ప్రాంతంలో... విద్యుత్‌ కేంద్రం కార్యరూపం దాల్చాలనుకుంటే అధికారికంగా సమావేశాలు నిర్వహించి.. ప్రజలను ఒప్పించి.. వారికి భద్రతాపరంగా అన్ని అంశాలను తెలియజేసి.. ఉద్యమకారులు వారి వద్దకు వెళ్లకుండా చేయగలిగేలా పోటీగా సభలు.. సదస్సులు నిర్వహించాల్సి ఉంది. కానీ అలా చేయడంలేదు. దీనివల్ల అలాఅలా పరిస్థితి మారితే ఉద్యమం తీవ్రతరమైతే పోలీసుల సమక్షంలో సమావేశాలు నిర్వహించవచ్చు. కానీ అది నెగిటివ్‌గా ప్రజల్లోకి వెళ్లి.. ప్రభుత్వంపైనా ఓరకంగా ఇబ్బంది తెచ్చిపెడుతుంది. ఇటువంటి సున్నితమైన అంశాలపై మరింత జాగ్రత్తగా జిల్లా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సి ఉంది. ముప్పు లేకుండా జిల్లా అభివృద్ధి విషయంలో ప్రజలను భాగస్వామ్యం చేసేలా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Oct 11 , 2025 | 11:50 PM