వారసత్వ భూములు.. రూ.100కే రిజిస్ట్రేషన్
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:58 PM
lands.. Registrations రైతులకు వారసత్వంగా సంక్రమించే వ్యవసాయ భూముల విషయమై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకం ఒప్పందాల రిజిస్ర్టేషన్ చార్జీల విషయంలో మార్పులు చేస్తూ ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది.
రైతులకు భారం లేకుండా హక్కుల బదిలీకి ప్రభుత్వ నిర్ణయం
జిల్లాలో 3.75 లక్షల కుటుంబాలకు లబ్ధి
కోటబొమ్మాళి/ నరసన్నపేట, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): రైతులకు వారసత్వంగా సంక్రమించే వ్యవసాయ భూముల విషయమై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకం ఒప్పందాల రిజిస్ర్టేషన్ చార్జీల విషయంలో మార్పులు చేస్తూ ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. తల్లి లేదా తండ్రి మృతి చెందితే వారసత్వంగా వ్యవసాయ భూముల హక్కుల కోసం ఇకపై రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయనవసరం లేదు. మార్కెట్ విలువ రూ.10లక్షల లోపు ఉన్న భూములకు కేవలం రూ.100 స్టాంపు డ్యూటీతో రిజిస్ట్రేషన్ చేసి వారసత్వ హక్కులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూమి విలువ రూ.10లక్షలు దాటితే రూ.1000 రుసుముగా రిజిస్ర్టేషన్ చార్జీ వసూలు చేయనుంది. దీంతో వారసత్వంగా సంక్రమించే రైతులకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు చార్జీల భారం తగ్గనుంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
గతంలో సమస్యలెన్నో..
వారసత్వంగా సంక్రమించే వ్యవసాయ భూముల వివరాలకు సంబంధించి ఇప్పటివరకు ఇంటి యజమాని మృతి చెందితే ఆయన కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రంతో భూ వివరాలు మార్పిడి (మ్యూటేషన్)కి సచివాలయాల్లో దరఖాస్తు చేసేవారు. కుటుంబ సభ్యుల నుంచి వీఆర్వో స్టేట్‌మెంట్ నమోదు చేసి ఆర్‌ఐ ద్వారా తహసీల్దార్‌కు నివేదించేవారు. తర్వాత వారసత్వ వాటాలను పంపిణీ ప్రకారం వెబ్‌ల్యాండ్‌లో రైతుల పేర్లు నమోదు చేసేవారు. ఈ తతంగం నిర్వహించేందుకు రెవెన్యూశాఖ అధికారులకు రూ.వేలల్లో ముడుపులు చెల్లించాల్సి వచ్చేది.
తల్లిదండ్రులు మరణించిన తరువాత వారసులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసినప్పటికీ యాజమాన్య మార్పులు సకాలంలో జరగకపోవడంతో రికార్డుల్లో అస్పష్టత ఏర్పడింది. పట్టాదారు పాసుపుస్తకాలు అందక రైతులు అనేక సమస్యలకు గురయ్యేవారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ రుసుము ఎక్కువ కావడంతో ఆసక్తి చూపేవారు కాదు. ఉదాహరణకు సుమారు రూ.15లక్షల విలువైన భూమిని ముగ్గురు కుటుంబ సభ్యులు పంచుకుంటే ఒకరికే మినహాయింపు ఉండేది. మిగిలిన ఇద్దరిపై ఒకశాతం రిజిస్ర్టేషన్ రుసుం ఒక శాతం విధించేవారు. ఎవరికైనా ఎక్కువ భాగం వచ్చినప్పుడు మూడు శాతం వరకు స్టాంపు రుసుం చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఇది గ్రామాల్లో పెద్ద భారమయ్యేది. కార్యాలయాల వద్ద జాప్యం, కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతి వంటి సమస్యలు వేలాది పిటిషన్లను తెచ్చాయి. దీంతో చాలామంది రైతులు కేవలం రూ.100స్టాంపు పత్రాలపై ఒప్పందాలు చేసుకుని భూములను తమతమ భాగాలుగా పంచుకున్నారు. కానీ ఈ విధానం చట్టబద్దం కాకపోవడంతో రికార్డుల్లో మార్పులు జరగకపోవడం, భూములను విక్రయించే సమయంలో కుటుంబ సభ్యులందరి సంతకాలు అవసరమవడంతోపాటు పలు పత్రాలు జత చేయాల్సి వచ్చేది. ఈక్రమంలో సివిల్ వివాదాలకు దారి తీసేది. రైతు తన సొంత భూమిని అమ్మాలన్నా, పూచీకత్తు పెట్టాలన్నా, రికార్డులు సరిగా లేక ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
కొత్త మార్గదర్శికాల ప్రకారం..
ప్రభుత్వ తాజా మార్గదర్శకాల మేరకు.. ఇంటి యాజమాని మృతి చెందితే వారసత్వంగా లభించే వ్యవసాయ భూములపై హక్కులు పొందేందుకు కుటంబ సభ్యులంతా అఫిడవిట్(లీగల్ ఇయిర్) ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పత్రం ఆధారంగా వారసత్వ హక్కులను పొందేందుకు రిజస్ట్రేషన్‌కు చేసుకోవచ్చును. వారసత్వ వ్యవసాయ భూములను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే యాజమాన్యం కొత్తవారసుల పేర్లలోకి మారుతుంది. రికార్డులు ఆటోమేటిక్‌గా సవరించబడతాయి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అవుతాయి. దీంతో భూమిపై చట్టబద్దమైన హక్కులు తమవేనని రైతులు నిర్ధారించుకోగలరు. వారు భూమిని అమ్మాలన్నా, పూచీకత్తుగా పెట్టి అప్పు తీసుకోవాలన్నా ఎటువంటి అవరోధం ఉండదు. ఎటువంటి కోర్టు కేసులు, అదనపు రుసుములు అవసరం ఉండదు, ఈ విధానం చిన్న రైతులు, అట్టడుగు వర్గాల కుటుంబాల్లో పెద్ద ఉపశమనం కలిగించనుంది. గ్రామాల్లో తరచుగా తలె త్తే భూమి వివాదాలు కూడా ఈ విధానంతో తగ్గే అవకాశముంది. ముఖ్యంగా సర్వే రికార్డులు సరిగా ఉండటం వల్ల పంటలపై అందించే సాయం, భూసంబంధిత ధ్రువపత్రాలు జారీ, పంటనష్ట పరిహారాలు వంటి అంశాలు సులభతరం అవుతాయి. ఈ విధానం వ్యవసాయ భూములకే మాత్రం వర్తిస్తుందని కోటబొమ్మాళి తహసీల్దార్ ఆర్.అప్పలరాజు తెలిపారు. ఇల్లు స్థలాలు, భవనాలు, వాణిజ్య ఆస్తులకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేశారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో 13 సబ్‌రిజిస్ర్టేషన్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో కుటుంబ ఆస్తులకు సరాసరి రోజుకు 5 లేదా 6 రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. వ్యవసాయ భూములతోపాటు ఇతర స్థిరాస్తులు కూడా కలిపి ఇప్పటివరకు ఒకే దస్తావేజులో రాసుకుంటున్నారు. తాజా మార్గదర్శికాలతో వ్యవసాయ భూమికి మాత్రమే ఫీజుల భారం తగ్గించారు. ప్రస్తుతం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లకు ఆస్తి విలువపై ఒకశాతం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలి. వారతస్వంగా సంక్రమించిన వ్యవసాయ భూముల ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.10లక్షల్లోపు ఉంటే స్టాంప్‌డ్యూటీ రూ.100 చెల్లించాలి. రూ.10లక్షలకుపైగాఉంటే రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. రిజిస్ర్టేషన్‌తో పట్టాదారు పాసుపుస్తకాలతో పూర్తి హక్కులు వారసులకు రానున్నాయి. జిల్లాలో సుమారు 3.5 లక్షల రైతు కుటుంబాలకు ఈ విధానంతో లబ్ధి చేకూరనుంది.
వ్యవసాయ భూములకే మినహాయింపు
వారసత్వంగా సంక్రమించే వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు మార్పు చేసింది. లీగల్ ఇయిర్, ఆస్తి ఎవరి పేరు మీద ఉందో ఆయన మృతిచెందినట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. లీగల్ ఇయిర్‌లో నమోదు ఆధారంగానే వారసులకు హక్కులు లభిస్తాయి. రిజిస్ట్రేషన్ విలువ రూ.10లక్షల లోపు ఉంటే స్టాంప్ డ్యూటీ రూ.100 మాత్రమే.
- బసవేశ్వరరావు, సబ్‌రిజిసా్ట్రర్, నరసన్నపేట