ఆదాయశాఖల్లో దూకుడు
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:05 AM
cm-Collectors' Conference ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో రెండోరోజు వెల్లడైన గణాంకాలు జిల్లాకు సంబంధించి స్పష్టమైన రెండు ముఖచిత్రాలను చూపిస్తున్నాయి. ఆదాయాన్ని తెచ్చే శాఖల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో మెరిసిపోతుంటే.. ప్రజలకు నేరుగా సంబంధించిన భూ సమస్యలు, పన్నుల వసూలు, గ్రామీణ సర్వేలు, నైపుణ్య పరీక్షల హాజరులో మాత్రం వెనుకడగు స్పష్టంగా కనిపిస్తోంది.
భూ సమస్యల విషయంలో ప్రజల అసంతృప్తి
‘కౌశలం’ నైపుణ్య పరీక్షల విషయంలో వెనుకబాటు
రెండోరోజు కలెక్టర్ల సదస్సులో వెల్లడైన కీలక అంశాలు
శ్రీకాకుళం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో రెండోరోజు వెల్లడైన గణాంకాలు జిల్లాకు సంబంధించి స్పష్టమైన రెండు ముఖచిత్రాలను చూపిస్తున్నాయి. ఆదాయాన్ని తెచ్చే శాఖల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో మెరిసిపోతుంటే.. ప్రజలకు నేరుగా సంబంధించిన భూ సమస్యలు, పన్నుల వసూలు, గ్రామీణ సర్వేలు, నైపుణ్య పరీక్షల హాజరులో మాత్రం వెనుకడగు స్పష్టంగా కనిపిస్తోంది. విజయవాడలో నిర్వహించిన ఈ సదస్సులో జిల్లా నుంచి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ప్రతి ఒక్క విషయాన్ని సమీక్షించారు. సమీక్ష నివేదిక ప్రకారం గనులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల విభాగాల్లో జిల్లా ముందంజలో నిలిచింది. గనులు, భూగర్భ శాఖలో ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబరు నాటికి రూ.99 కోట్ల లక్ష్యానికి గాను రూ.142 కోట్లు వసూలు చేసి 143 శాతం సాధన నమోదు చేసింది. రాష్ట్ర గనుల ఆదాయంలో జిల్లాకు 6.1 శాతం వాటా దక్కడం విశేషం. రిజిస్ట్రేషన్లు స్టాంపులు విభాగంలో ఈ ఏడాది ఏప్రిల్-నవంబరు మధ్య రూ.144.78కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే 20.55 శాతం వృద్ధి నమోదైంది. రవాణా శాఖ ఆదాయం పరంగా పెద్దది కాకపోయినా ‘‘హై గ్రోత్’’ జిల్లాల జాబితాలో చోటు దక్కించుకుంది. జీఎస్టీ వసూళ్లు కూడా జిల్లాకు ఊపునిచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబరు నాటికి రూ.186.62 కోట్లు వసూలు చేసి 7.77 శాతం వృద్ధి సాధించింది.
ఉచిత ఇసుక విధానంపై ప్రజల అసంతృప్తి అక్టోబరులో 68 శాతం ఉండగా.. డిసెంబరు నాటికి 78 శాతానికి పెరిగింది. మైనర్ మినరల్స్ అనుమతుల విషయంలో 130 దరఖాస్తులకు గాను 72(55 శాతం) పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నిలిచిపోతోంది.
భూ సమస్యలపై అసంతృప్తి
ఆదాయంలో మెరుపులు ఉన్నా.. భూ సమస్యల పరిష్కారంలో జిల్లా తీవ్ర ఒత్తిడిలో ఉంది. భూ వర్గీకరణ మార్పుల అర్జీల్లో రాష్ట్రంలో మూడో స్థానం. మొత్తం 7,294 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. జాయింట్ ఎల్‌పీఎం పిటిషన్లలో జిల్లా రెండో స్థానం. ఏకంగా 25,415 దరఖాస్తులు వచ్చాయి. పీజీఆర్‌ఎస్ (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చే ప్రజావినతుల పరిష్కారంలో గడువు మించిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 3.45శాతం కేసులు ఎస్‌ఎల్‌ఏ దాటి పరిష్కారమవుతున్నాయి. భూ సమస్యలే జిల్లాలో ప్రజల అసంతృప్తికి ప్రధాన కారణంగా మారుతున్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి.
ఉపాధి ఉంది... హాజరు లేదు...
ఉద్యోగ కల్పనలో సంఖ్యలు ఆశాజనకంగా ఉన్నా యువత భాగస్వామ్యంలో లోటు స్పష్టంగా కనిపిస్తోంది. జాబ్‌మేళాలు ద్వారా లక్ష్యాన్ని 100 శాతం పూర్తిచేసి 5,620 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఒక్కో నియోజకవర్గానికి సగటున 703 ఉద్యోగాలు రావడం విశేషం. పరిశ్రమల స్థాపన ద్వారా జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 9,140 మందికి ఉపాధి లభించింది. మరో 8 కొత్త కంపెనీలతో రూ.62కోట్ల పెట్టుబడి.. 3,600 ఉద్యోగాల అంచనా ఉంది. కానీ ‘కౌశలం’ నైపుణ్య పరీక్షల విషయంలో జిల్లా వెనుకబడింది. 22,798 మందికి స్లాట్లు ఇచ్చినా కేవలం 3,479 మంది(15 శాతం) మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రంలోనే అతి తక్కువ హాజరు శాతాల్లో ఇది ఒకటి.
పట్టణ-గ్రామీణాభివృద్ధిలో నెమ్మదింపు..
మునిసిపల్ ఆస్తి పన్నులు డిసెంబరు నాటికి లక్ష్యంలో కేవలం 48.88శాతం (రూ.22.11కోట్లు) మాత్రమే వసూలయ్యాయి. పంచాయతీ పన్నులు స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా 17 శాతం (రూ. 5.46 కోట్లు) మాత్రమే సాధించి జిల్లా రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. స్వామిత్వ సర్వే 500 గ్రామాలకు గాను 244 గ్రామాల్లో (48.8 శాతం) మాత్రమే పూర్తయింది. ఈ విషయంలో జిల్లా రాష్ట్రంలో బాటమ్-10లో ఉంది. బీపీఎస్ క్రమబద్ధీకరణలో 984 అక్రమ కట్టడాలు గుర్తించగా.. 9.04శాతం మాత్రమే పరిష్కారమయ్యాయి. సుడా భూముల వినియోగంలో 117.79 ఎకరాల 6 స్థలాలు గుర్తించినా, ఇప్పటివరకు టెండర్లు పిలవలేదు.
పీఎం సూర్యఘర్ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ లక్ష్యాలు భారీగా ఉన్నాయి. పీఎం కుసుమ్ పథకం ద్వారా 20.76 మెగావాట్ల సోలార్ పంపుసెట్లకు పపనులు కేటాయించారు. ఎక్సైజ్‌శాఖ పరంగా.. ఒడిశా సరిహద్దు అక్రమ మద్యం కేసులు గణనీయంగా తగ్గడం ఊరటనిచ్చే అంశం. ‘ఆదాయంలో దూకుడు.. ప్రజాసేవలో దృష్టి’ అనే సమతుల్యత సాధిస్తేనే జిల్లా నిజమైన సమగ్ర అభివృద్ధి దిశగా ముందడుగు వేయగలదన్నది ఈ నివేదికల సారాంశం.