matruvandanam: మళ్లీ మాతృ వందనం
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:04 PM
Government steps to implement Matru Vandanam ఆరోగ్యకర ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రధానమంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై)ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు ఆర్థిక సాయం అందించేది.
అమలుకు ప్రభుత్వం చర్యలు
ఐదేళ్లూ వదిలేసిన వైసీపీ సర్కారు
టెక్కలి రూరల్, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యకర ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రధానమంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై)ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు ఆర్థిక సాయం అందించేది. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసింది. కేంద్రం నుంచి వచ్చిన నిధులను వివిధ కార్పొరేషన్లకు దారి మళ్లించింది. దీంతో ఈ పథకం ఉన్నట్లు దాదాపు ప్రజలు మరచిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ మాతృ వందనం పథకాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. గతంలో వైద్యఆరోగ్య శాఖ ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతను చూసేది. ఇప్పుడు ఆ బాధ్యతను మహిళాశిశు సంక్షేమ శాఖకు బదలాయించారు. ప్రస్తుతం జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేయడానికి అంగన్‌వాడీ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు.
తల్లుల ఖాతాల్లోకి..
జిల్లాలో 3,562 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణులు 9,206 మంది, బాలింతలు 7,292 మంది ఉన్నారు. వీరందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న కుటుంబాల్లోని గర్భిణులకు సరైన పోషకాహారం అందక ప్రసవం సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రసవం తరువాత బిడ్డలకు కూడా పోషకాహారం అందించలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది బాలింతలు తమ పిల్లలకు టీకాలు వేయించేందుకు అప్పు సైతం చేయాల్సి వస్తుంది. ఇటువంటి వారికి మాతృ వందనం పథకం ఎంతో ఉపయోగపడనుంది. ఇందులో రూ.11వేల వరకు సాయం అందిస్తారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రత్యేక లాగిన్ కేటాయించారు. అందులో లబ్ధిదారుల వివరాలు నమోదు చేసేందుకు అధికారులు వారికి అవగాహన కల్పిస్తున్నారు. తెలుపురేషన్ కార్డు ఉన్నవారు అర్హులు. గర్భం దాల్చిన తరువాత రూ.1000 ఇస్తారు. ప్రసవం అనంతరం రూ.2వేలు, ఏడాదిలో బిడ్డకు టీకాలు పూర్తయిన తరువాత మరో రూ.2వేలు నేరుగా లబ్ధిదారు ఖాతాలో జమవుతుంది. రెండో కాన్పుల్లో ఆడపిల్ల జన్మిస్తే రూ.2వేల చొప్పున మూడు విడతల్లో జమవుతుంది. రెండు కాన్పుల్లో కుమారుడు, కుమార్తె జన్మిస్తే మొత్తం రూ.11 వేలు లబ్ధిచేకూరుతుంది. ఈ విషయమై మెళియాపుట్టి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అమరావతిని వివరణ కోరగా.. ‘మాతృ వందనం పథకం కోసం కార్యాచరణ ప్రారంభమైంది. అంగన్‌వాడీ కార్యకర్తలకు లాగిన్ ఇచ్చి గర్భిణులు, బాలింతల వివరాలు నమోదు చేయడంపై అవగాహన కల్పిస్తాం. తరువాత తల్లుల బ్యాంకు ఖాతాల్లో విడతల వారీగా పీఎంఎంవీవై నిధులు జమవుతాయ’ని తెలిపారు.