Share News

విశాఖ తరువాత మన జిల్లానే

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:20 AM

ఉత్తరాంధ్రలో కాలుష్యం పెరుగుతున్న జిల్లాల్లో విశాఖ తరువాత శ్రీకాకుళం ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

    విశాఖ తరువాత మన జిల్లానే
శ్రీకాకుళం వద్ద నాగావళి నదిలో కలుస్తున్న మురుగునీరు

ప్రమాదపుటంచున ప్రజారోగ్యం

పారిశ్రామికవాడల్లో ప్రమాదకరం

రణస్థలం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో కాలుష్యం పెరుగుతున్న జిల్లాల్లో విశాఖ తరువాత శ్రీకాకుళం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం 2017-18తో పోలిస్తే జిల్లాలో 14.5 శాతం కాలుష్యం పెరిగినట్టు స్పష్టమవుతోంది. జల కాలుష్యంతో పాటు వాయు కాలుష్యం అధికంగా ఉంది. ముఖ్యంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పైడిభీమవరం పారిశ్రామికవాడ, పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో జీడి పరిశ్రమలు, టెక్కలిలో గ్రానైట్‌ పరిశ్రమతో కాలుష్యం పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

పారిశ్రామికవాడ చుట్టూ...

పైడిభీమవరంలో 450 ఎకరాల్లో ఉన్న భారీ పారిశ్రామికవాడ కాలుష్యానికి కేరాప్‌గా మారుతోంది. ఇక్కడ 275 ఎకరాల్లో రసాయనిక జోన్‌ ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 13 రసాయన పరిశ్రమలు కొనసాగుతున్నాయి. పారిశ్రామికవాడ నుంచి వెలువడే రసాయన వ్యర్థాలతో సమీపంలోని కందివలస గెడ్డ పూర్తిగా కలుషితమైంది. ఆ నీరు సాగుకు, పశువులు తాగేందుకు పనికిరాదు. భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. పరిసర గ్రామాల ప్రజలు అనేక రుగ్మతల బారిన పడుతున్నారు.

కాలం చెల్లిన వాహనాలతో..

జిల్లా మీదుగా సుదీర్ఘ జాతీయ రహదారి ఉంది. పైడిభీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకూ 197 కిలోమీటర్ల పాటు విస్తరించి ఉంది. ఆపై అంతర్‌ రాష్ట్ర, జిల్లా రహదారులు ఉన్నాయి. దీంతో వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. జిల్లాలో 20 లక్షల వరకూ వాహనాలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందులో ఐదు లక్షలకుపైగా కాలం చెల్లినవే. దీంతో వాటి నుంచి వెలువడే పొగతో వాయుకాలుష్యం పెరుగుతోంది.

మొక్కలు నాటడమే ఉత్తమం

జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, ఆమదాలవలస మునిసిపాలిటీలు ఉన్నాయి. ఆపై పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. ఆయా చోట్ల విరివిగా చెట్లు నాటితే చాలా మంచిది. అలాగే వాహనాల వినియోగాన్ని తగ్గించాలి. ప్రజారవాణాకు సంబంధించి గ్రీన్‌ ఎనర్జీ వెహికల్స్‌ను మాత్రమే వినియోగించడం ఉత్తమం. కాలం చెల్లిన వాహనాలను నిర్వీర్యం చేయాలి. ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించాలి. నీటిని పొదుపుగా వాడడం ద్వారా జల కాలుష్యాన్ని తగ్గించవచ్చు.

అందరి బాధ్యత

కాలుష్యం నియంత్రణ అనేది అందరి బాధ్యత. ప్రతిఒక్కరూ, ప్రతి సంస్థ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించాలి. మా శాఖపరంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నాం.

-బి.కరుణశ్రీ, ఈఈ, కాలుష్య నియంత్రణ శాఖ, శ్రీకాకుళం

Updated Date - Dec 02 , 2025 | 12:20 AM