Share News

Adulterated liquor : కల్తీ మద్యం కలకలం

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:01 AM

Cheap liquor among premium brands జిల్లాలో కల్తీ మద్యం విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 158 ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. చాలా ప్రాంతాల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. గతంలో కల్తీ మద్యంలో ఆరితేరిన వారు షాపుల్లో దర్శనమిస్తుండడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి.

Adulterated liquor : కల్తీ మద్యం కలకలం
అవలంగిలో పట్టుబడిన కల్తీ మద్యం

  • అవలంగిలో ఇటీవల భారీగా పట్టుబడిన వైనం

  • ప్రీమియం బ్రాండ్లలో చీప్‌లిక్కర్‌

  • మద్యంలో ఒడిశా సారా కలిపి విక్రయాలు

  • ఈ నెల 3న సారవకోట మండలం అవలంగిలో కల్తీ మద్యం గుట్టు రట్టయింది. ఎక్సైజ్‌ అధికారుల తనిఖీల్లో 212 లీటర్ల కల్తీ మద్యం, 1700 ఖాళీ సీసాలు, మూతలు, లేబుల్స్‌ పట్టుబడ్డాయి. మద్యంసాసీలకు సీల్‌ తీసి తక్కువ ఖరీదు మద్యాన్ని కలిపేసి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచినట్టు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. బ్రాండెడ్‌ మద్యం కల్తీ చేసే పరికరాలతోపాటు కొంత సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

  • రణస్థలం, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కల్తీ మద్యం విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 158 ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. చాలా ప్రాంతాల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. గతంలో కల్తీ మద్యంలో ఆరితేరిన వారు షాపుల్లో దర్శనమిస్తుండడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. వైసీపీ హయాంలో మద్యం విధానం అస్తవ్యస్తంగా ఉండేది. అప్పట్లో ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపేది. నాసిరకం మద్యం అమ్మకాలు జరిగేవి. దీంతో జిల్లాలో పొరుగు మద్యం ఎక్కువగా చలామణిలో ఉండేది. ఇదే అదునుగా కల్తీ మద్యం సైతం రాజ్యమేలేది. ఆమదాలవలసలో అప్పట్లో భారీ డంప్‌ లభ్యమైంది. జిల్లా మీదుగా ఒడిశా మద్యం తరలింపు, తెలంగాణ నుంచి మద్యం దిగుమతి.. ఇలా రకరకాల ఘటనలు వెలుగుచూశాయి. మరోవైపు జే బ్రాండ్‌ మద్యం అమ్మకాలతో ప్రజారోగ్యం సైతం క్షీణించింది. ఆపై మద్య నిషేధం చేస్తామన్న జగన్‌ హామీ అటకెక్కింది. ఏడాదికి 25శాతం షాపులు మూసివేయిస్తానన్న హామీ కూడా కార్యరూపం దాల్చలేదు. ఇలా వైసీపీ హయాంలో మద్యం పాలసీ అబాసుపాలైంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే పాత ప్రీమియం బ్రాండ్లన్నీ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు కూడా కల్తీ మద్యం వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల సారవకోట మండలం అవలంగిలో పెద్దఎత్తున కల్తీ మద్యం పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో కోటబొమ్మాళి ప్రభుత్వ మద్యం దుకాణంలో కల్తీ జరిగింది. కోర్టులో నడుస్తున్న ఆ కేసులో సూత్రధారిగా ఉన్న అప్పటి సూపర్‌వైజర్‌.. తాజాగా అవలంగిలో కల్తీ మద్యంతో పట్టుబడడం గమనార్హం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మేల్కొనకపోతే మాత్రం వైసీపీ మరక అంటడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు.

  • అలా కలిపేస్తున్నారు..

  • జిల్లాలో చాలా ప్రాంతాల్లో మద్యం అడల్ర్టేషన్‌, కార్కింగ్‌ జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రీమియం బ్రాండ్‌ మద్యం సీసాల్లో చీప్‌లిక్కర్‌ మద్యాన్ని కలపడం, చీప్‌ లిక్కర్‌లో నీరు వేయడం వంటివి చేసి విక్రయిస్తున్నారు. అవలంగిలో ప్రధానంగా ఆఫీసర్‌ చాయ్స్‌ (ఓసీ), ఏపీ బ్లాక్‌, సిల్వర్‌ స్టిక్‌ బ్రాండ్లతో ప్రీమియం బ్రాండ్లను కల్తీ చేస్తున్నట్టు బయటపడింది. ఎక్సైజ్‌ అధికారులు ఆ గ్రామానికి దగ్గర్లో ఉన్న దుర్గా వైన్‌షాపును తనిఖీ చేయగా 54 కల్తీ మద్యం బాటిళ్లు దొరికాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రతి సీసాపై ఏపీ బేవరజేస్‌ కార్పొరేషన్‌కు సంబంధించి లేబుల్‌ ఉంటుంది. సీల్‌ ఏమాత్రం తెగకుండా సీసామూతను ఓ యంత్రంతో లేపుతారు. వాటిలో మద్యాన్ని కల్తీ చేసి అనుమానం రాకుండా సీల్‌తో కూడిన మూతను మళ్లీ వేస్తారు. జిల్లావ్యాప్తంగా కల్తీమద్యంపై ఫిర్యాదులు వస్తున్నా.. మామ్మూళ్ల మత్తులో ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

  • ఇప్పటికీ ఒడిశాలో సారా చలామణిలో ఉంది. అక్కడ అధికారికంగానే అమ్ముతున్నారు. సరిహద్దు ప్రాంతాల నుంచి సారా తక్కువ ధరకు తెచ్చి ఇక్కడి మద్యంలో కల్తీ చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో సైతం కన్జ్యూమబుల్‌ అనే ఆల్కాహాల్‌ దొరుకుతుంది. తక్కువ ధర ఆపై ఎక్కువ నిషా ఉండడంతో అక్కడి నుంచి దీనిని తెచ్చి మద్యంలో కలిపేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కల్తీ మద్యంపై దృష్టిపెట్టకపోతే మాత్రం జిల్లాలో సైతం పాత పరిస్థితులే పునరావృతం అవుతాయి. అందుకే మద్యం షాపుల్లో తనిఖీలు, అంతర్‌ రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టులు కట్టుదిట్టం చేయడం, ఈగల్‌ టీమ్‌ను మరింత బలోపేతం చేస్తేనే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • ప్రత్యేక దృష్టి..

  • జిల్లాలో కల్తీమద్యం నివారణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. తనిఖీలు ముమ్మరం చేశాం. అవలంగిలో స్ర్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి పట్టుకున్నాం. నిబంధనల మేరకు మద్యం వ్యాపారం నిర్వహించాలని యజమానులకు ఆదేశాలిచ్చాం. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. ఎక్కడైనా మద్యం కల్తీ జరుగుతున్నట్టు అనుమానాలు వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి.

    - సీహెచ్‌ తిరుపతినాయుడు, జిల్లా ఎక్సైజ్‌ అధికారి, శ్రీకాకుళం

Updated Date - Sep 14 , 2025 | 12:01 AM