MTS Teachers: ఎంటీఎస్ ఉపాధ్యాయులకు సర్దుబాటు
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:46 PM
MTS teachers Staff allocation కాంట్రాక్ట్ విధానంలో మినిమం టైంస్కేల్ (ఎంటీఎస్)తో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. అవసర ప్రాతిపదికన వీరిని పాఠశాలలకు కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
గురువులు లేని పాఠశాలలకు ప్రాధాన్యం
మిగిలిన వారిని క్లస్టరు టీచర్లుగా కేటాయింపు
సీనియార్టీ జాబితాను విడుదల
జిల్లాలో 371 మందికి స్థానచలనం
నరసన్నపేట, జూన్ 20(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్ట్ విధానంలో మినిమం టైంస్కేల్ (ఎంటీఎస్)తో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. అవసర ప్రాతిపదికన వీరిని పాఠశాలలకు కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను ఈ విద్యాసంవత్సరానికి కొనసాగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల్లో కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు బదిలీ అయినా, రిలీవర్ రాక కొందరు ఉపాధ్యాయులు ఆ పాఠశాలల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి పాఠశాలల్లో ఎంటీఎస్ ఉపాధ్యాయులను మొదటి ప్రాధాన్యతగా నియమించనున్నారు. జిల్లాలో 371 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను విడుదల చేశారు.
జిల్లాలో 2008, 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులను గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు. అప్పట్లో 400 మందికిపైగా ఉపాధ్యాయులకు కొలువు దక్కగా.. వారిలో ఇప్పటికే కొందరు పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 371 ఎంటీఎస్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరందరికీ స్థానచలనం కలిగే అవకాశం ఉంది. రెగ్యులర్ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలు పూర్తయి కొత్తస్థానాల్లో చేరారు. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లోని ఎంటీఎస్ ఉపాధ్యాయులను అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలని డీఈవోలకు కమిషనర్ ఆదేశించారు. ఈనెల 20 నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కాగా.. విశాఖలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమానికి పీఎం నరేంద్రమోదీ హాజరకానున్నారు. ఆ కార్యక్రమం ఏర్పాట్లలో విద్యాశాఖ నిమగ్నమైంది. దీంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంటీఎస్ ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ఈనెల 25 నాటికి పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు.
ఎంటీఎస్ ఉపాధ్యాయులు సర్దుబాటులో 2008 డీఎస్సీ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యమిస్తారు. తర్వాత 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఇస్తారు. అసలు టీచర్ లేని పాఠశాలలకు ముందుగా కేటాయిస్తారు. ఏకోపాధ్యాయ పాఠశాలలకు రెండో ప్రాధాన్యమిస్తారు. రెండు లేక అంతకంటే ఎక్కువ ఎస్జీటీ పోస్టులు మంజూరై ప్రస్తుతం ఒక టీచర్‌తో నడుస్తున్న స్కూళ్లకు కేటాయించనున్నారు. మోడల్ ప్రైమరీ స్కూళ్లకు ఒక పీఎస్ హెచ్‌ఎం, నాలుగు ఎస్జీటీ పోస్టులు మంజూరై ప్రస్తుతం ఒక ఎస్జీటీ మాత్రమే పనిచేస్తుంటే ఆ పాఠశాలలకు ఇద్దరు ఎంటీఎస్ ఉపాధ్యాయులను కేటాయిస్తారు. ఇలా మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో సర్దుబాటు చేసిన తరువాత ఇంకా మిగిలిన వారిని క్లస్టర్ టీచర్లుగా నియమించనున్నారు. కేటరిగి 4 నుంచి 1 వరకు దామాషా ప్రకారం వీరిని క్లస్టర్‌కు కేటాయించనున్నారు.