arasavalli : ఆదిత్యా.. వీరి నిర్లక్ష్యం చూసితివా?
ABN , Publish Date - May 06 , 2025 | 11:36 PM
Administrative Failure in arasavalli ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఆదిత్యాలయంలో గత రెండేళ్లలో నలుగురు ఈవోలు మారారు. దినసరి వేతన సిబ్బంది మూడు గ్రూపులుగా ఏర్పడ్డారు. రెగ్యులర్ సిబ్బందికి కంప్యూటర్ పరిజ్ఞానం లేక పోవడంతో ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా ఉన్నాయి.
పరిపాలన శూన్యతతో ఎక్కడి పనులు అక్కడే
అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం
పర్యవేక్షణ లోపంతోనే గ్రూపులుగా ఉద్యోగులు
ఆలయంలో భక్తులకు కానరాని సౌకర్యాలు
అరసవల్లి, మే 6(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఆదిత్యాలయంలో గత రెండేళ్లలో నలుగురు ఈవోలు మారారు. దినసరి వేతన సిబ్బంది మూడు గ్రూపులుగా ఏర్పడ్డారు. రెగ్యులర్ సిబ్బందికి కంప్యూటర్ పరిజ్ఞానం లేక పోవడంతో ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా ఉన్నాయి. అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయలోపంతో పరిపాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయానికి వచ్చే భక్తుల ఇబ్బందులు పట్టించుకునే నాథులు కరువయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దినసరి ఉద్యోగులకు విధుల కేటాయింపుతోపాటు అభివృద్ధి పనుల పర్యవేక్షణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఆలయానికి దాతలు ఇచ్చే విరాళాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయని పేర్కొంటున్నారు.
పనిచేయని ఆర్వో ప్లాంటు
ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల సహాయంతో తాగునీరందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటు రెండు నెలలుగా పని చేయడం లేదు. దీంతో భక్తులకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో ఆలయ అధికారుల చొరవతో ప్రతీ ఆదివారం మజ్జిగ, మంచినీరు, బిస్కెట్లను భక్తులకు పంపిణీ చేసేవారు. ఇప్పుడు పర్యవేక్షణ లేక తాగునీటికి కూడా గతిలేని దుస్థితి నెలకొందని భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రథసప్తమి ఏర్పాట్లలో భాగంగా పలు భవనాలను కూల్చివేయడంతో స్నానాలు గదులు, మరుగుదొడ్ల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇటీవల తాత్కాలికంగా నిర్మించిన మరుగుదొడ్లు, స్నానాల గదులు సరిగా లేవని పేర్కొంటున్నారు.
అన్నప్రసాదం గంటసేపు మాత్రమే..
భక్తులు స్వామి ఉచిత అన్నప్రసాదాన్ని ఎంతో భక్తితో స్వీకరిస్తుంటారు. గతంలో భక్తులకు మధ్యాహ్నం 2.30 గంటల వరకు అన్నప్రసాదాన్ని అందించేవారు. కానీ కొన్ని రోజులుగా భోజనాలు ప్రారంభమైన గంటలోనే అన్నప్రసాదం పూర్తయిపోయిందని చెబుతున్నారు. దీంతో చాలామంది భక్తులు నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. లడ్డూ ప్రసాదం విక్రయాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వైశాఖమాసం ఆదివారం వేళ.. వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. కాగా ఆ రోజు ఉదయం 10 గంటలకే లడ్డూ ప్రసాదం అయిపోయిందని చెప్పడంతో భక్తులు అసంతృప్తి చెందారు. కౌంటర్లలో టోకెన్లు ఇవ్వకుండానే కొంతమంది భక్తులకు ప్రసాదాల విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అన్నప్రసాదం, లడ్డూలు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. అలాగే ఆలయానికి పర్వదినాల్లో భక్తులు వేలాదిగా వస్తుంటారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఎవరైనా తప్పిపోయినా, లేదా వారి వస్తువులు పోగొట్టుకున్నా, మరేదైనా అవసరం ఉన్నా మైక్ ద్వారా అనౌన్స్ చేయాలి. గతంలో ఉన్న ఈ సదుపాయం నేడు మాయమైంది. సమాచార కేంద్రంలో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
ఫిట్‌నెస్ ధ్రువపత్రం లేకుండానే ఫుట్‌బ్రిడ్జి
ఆలయానికి ముందు భక్తుల కోసం కొత్తగా ఫుట్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారుల నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలి. కానీ అదేమీ లేకుండానే దీనిని నిర్మించారు. భూమిలో ఎటువంటి క్లాంప్‌లు బిగించకుండా, సిమెంటింగ్ చేయకుండా స్తంభాలను ఏర్పాటు చేశారు. దీంతో భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో బ్రిడ్జి పటిష్ఠతకు సంబంధించిన సర్టిఫికెట్ తక్షణమే అందజేయాలని ఈవో ఆదేశించారు. అలాగే సోమవారం విశాఖపట్నంలోని కనకమహాలక్ష్మి ఆలయ ఈఈ సీహెచ్ రమణ, ఏఈ చందన, తదితర దేవదాయశాఖ ఇంజనీరు ఈ బ్రిడ్జి నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు.
బిల్లులు రిలీజ్ కావాలంటే కమీషన్ ఇవ్వాలా?
ఆలయానికి సంబంధించి, సరుకులు సరఫరా, సేవలకు సంబంధించిన బిల్లులు రిలీజ్ కావాలంటే కమీషన్ చెల్లించాల్సిందేనని, లేదంటే అవి పెండింగ్‌లో ఉండిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పెట్టిన బిల్లులు రిలీజ్ చేస్తున్నారు తప్ప.. ఏడాది కిందట బిల్లులను పట్టించుకోవడం లేదనే ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆలయ అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. అలాగే గోశాలలో పశువుల దాణాకు సంబంధించి నకిలీ బిల్లులతో రూ.20వేలకు పైగా స్వాహా చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఆలయానికి సంబంధించిన చాలా కీలకమైన విషయాల్లో దినసరి వేతనదారులే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరిపై అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో మూడు గ్రూపులుగా ఏర్పడి, ఆలయంలో వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఈవో శోభారాణి.. ఆలయంలో పరిస్థితులు చక్కదిద్దేలా చర్యలు చేపట్టాలని భక్తలు కోరుతున్నారు.