Share News

ఆదిత్యా.. సమస్యలు తీరేనా?

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:05 AM

Few facilities in Arasavalli అరసవల్లిలో శ్రీసూర్యనారాయణస్వామి దర్శనానికి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఆదివారం నాడు భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఆలయంలో సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు.

ఆదిత్యా.. సమస్యలు తీరేనా?
ఆదిత్యుడి ఆలయంలోని క్యూలో కిక్కిరిసిన భక్తులు

అరసవల్లిలో అరకొర సదుపాయాలు

క్యూలైన్లలో తోపులాటలు

అపరిశుభ్ర వాతావరణంలో అన్నదానం

కానరాని ప్లాస్టిక్‌ నిషేధం

రథసప్తమికి పరిస్థితిలో మార్పు వచ్చేనా?

శ్రీకాకుళం రూరల్‌, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలో శ్రీసూర్యనారాయణస్వామి దర్శనానికి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఆదివారం నాడు భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఆలయంలో సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. ముఖ్యంగా క్యూలైన్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తోపులాటలు జరుగుతున్నాయి. కొందరు భక్తులు మొబైల్‌ ఫోన్లతో లోపలకు ప్రవేశిస్తున్నారు. అన్నదానం ప్రాంతంలో అపరిశుభ్రత నెలకొంది. నిత్యం ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. ఇలా అనేక సమస్యలు వేధిస్తున్నాయి. వచ్చే నెలలో రథసప్తమి వేడుకలను వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ తరుణంలో క్షేత్రస్థాయిలో భక్తులు పడుతున్న ఇబ్బందులను అధికారులు గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ చూపాల్సిన ఆవశ్యకత ఉంది.

క్యూలైన్లలో తోపులాట..

మార్గశిర మాసం ఆదివారం కావడంతో భక్తులు స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉచిత దర్శనం క్యూలైన్‌ భక్తులతో కిటకిటలాడింది. మొత్తం ఆరు లైన్లలో ఎక్కడా కూడా సెక్యూరిటీ సిబ్బంది కానీ, పోలీసులు కానీ లేరు. దీంతో క్యూలైన్లలో తోపులాటలు జరగ్గా భక్తులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అవస్థలు పడ్డారు. ఆలయం లోపలకు సెల్‌ఫోన్లు తీసుకెళ్లడం నిషేధం. కానీ క్యూలైన్లలో తనిఖీలు అంతంత మాత్రంగానే ఉండడంతో పలువురు భక్తులు సెల్‌ఫోన్లతో ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకోవడం కనిపించింది. దీంతో ఆలయ భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెల్‌ఫోన్ల స్థానంలో మారణాయుధాలు ఉంటే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అంతా అక్కడే..

స్వామి ఉచిత అన్నదాన శిబిరాన్ని అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్నారు. భక్తులు భోజనాలు చేసిన తరువాత ఆ పక్కనే తాగడానికి వినియోగించే నీటితో చేతులను శుభ్రపరుచుకోవడం, అక్కడే తిన్నకంచాలు పడేయడంతో ఆ ప్రాంతంలో అపరిశుభ్రత నెలకొంటోంది. మరుగుదొడ్లు కిలోమీటరు దూరంలో ఉండడంతో అన్నదానం సమీపంలో ఉన్న తెర వెనుకనే భక్తులు ఈ అవసరాలు తీర్చుకోవల్సిన పరిస్థితి నెలకొంది.

దేవస్థానం ఆవరణలో ప్లాస్టిక్‌ నిషేధం కేవలం ప్రకటనలకే పరిమితమైంది. పూజా సామగ్రి విక్రయిస్తున్న ప్రతి వర్తకుడు వద్ద ప్లాస్టిక్‌ కవర్లు ఇబ్బడి ముబ్బడిగా దర్శనమిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆలయ పరిసరాలు ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోతున్నాయి.

పుష్కరిణి ఒడ్డున ఉన్న దేవతామూర్తుల విగ్రహాల వద్ద భక్తులు దీపారాధన చేసి నైవేద్యం పెడుతుంటారు. ఒకపక్క వాళ్లు పూజలు చేస్తుండగానే, మరోపక్క పారిశుధ్య సిబ్బంది వచ్చి పూజా ద్రవ్యాల్ని తీసేసి చెత్తబుట్టలోకి పడేయడంపై భక్తులు ఆవేదన చెందుతున్నారు.

యూపీఐ సౌకర్యం కల్పించాలి...

ఆలయంలోని కౌంటర్ల వద్ద యూపీఐ సౌకర్యం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దర్శనాలు, ప్రసాదం, కేశఖండన టిక్కెట్లను తీసుకునే కౌంటర్లతో పాటు మొబైల్‌ ఫోన్లు, బ్యాగులను భద్రపరచుకునే కౌంటర్ల వద్ద నగదు రహిత లావాదేవీలకు అనుమతించడం లేదు. అన్ని కౌంటర్ల వద్ద నగదునే ఇవ్వాల్సి రావడంతో పాటు సరిపడినంత చిల్లర లేకపోవడంతో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. అలాగే సింహద్వారం వద్ద ట్రాఫిక్‌ సమస్య తరచూ సంభవించి గంటల తరబడి వాహనాలు రోడ్డు మీదే ఉండిపోతున్నాయి. ఆలయ సమీపంలో ఇదే పరిస్థితి నెలకొంటోంది. ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Dec 08 , 2025 | 12:05 AM