Share News

Kidney: కిడ్నీ బాధితులకు మరిన్ని సేవలు

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:21 AM

Kidney patients పద్మనాభపురం కిడ్నీ పరిశోధన కేంద్రం-200 పడకల ఆసుపత్రిలో శనివారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఐదు డయాలసిస్‌ యూనిట్లు ప్రారంభించారు.

Kidney: కిడ్నీ బాధితులకు మరిన్ని సేవలు
డయాలసిస్‌ యూనిట్‌ను ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

  • ఐదు డయాలసిస్‌ యూనిట్లు ప్రారంభం

  • గ్లో సంస్థ చొరవతో ఎన్‌ఆర్‌ఐ, ఐఓసీ, కలెక్టర్‌ నిధులు

  • ఎంతమంది వైద్యులు వస్తామన్నా అవకాశం కల్పిస్తాం: మంత్రి అచ్చెన్న

  • పలాస, మార్చి 15(ఆంధ్రజ్యోతి): పద్మనాభపురం కిడ్నీ పరిశోధన కేంద్రం-200 పడకల ఆసుపత్రిలో శనివారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఐదు డయాలసిస్‌ యూనిట్లు ప్రారంభించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘పలాస కిడ్నీ ఆసుపత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వేలమంది కిడ్నీ రోగులకు ఇక్కడ చికిత్స అందించాల్సి ఉంది. ఆసుపత్రిలో నెఫ్రాలజిస్ట్‌లు ఒక్కరే ఉన్నారు. ఎంతమంది పనిచేయాలనుకున్నా వారందరికి ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా’మని తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశించారు.

  • ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో 16 డయాలసిస్‌ యూనిట్లు ఉండగా.. కిడ్నీ బాధితులకు సేవలందించేందుకు అవి చాలడం లేదు. దీంతో చాలామంది విశాఖపట్నం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. దీన్ని గుర్తించిన పలాస ఎమ్మెల్యే శిరీష.. గౌతులచ్చన్న బలహీనవర్గాల సంస్థ(గ్లో) సంస్థ ద్వారా మరో పది యూనిట్ల ఏర్పాటుకు కృషి చేశారు. ‘ఆంధ్రామెడికల్‌ కళాశాలలో విద్యనభ్యసించి అమెరికాలో స్థిరపడిన వైద్యబృందం రెండు యూనిట్లు, కలెక్టర్‌ స్వప్నిల్‌దినకర్‌ పుండ్కర్‌ నిధులతో మూడు యూనిట్లు, ఇండియన్‌ ఆయల్‌ కంపెనీ నిర్వాహకుల నుంచి ఐదు యూనిట్లు మంజూరయ్యాయి. అందులో ఐదు యూనిట్లు ఆస్పత్రికి చేరుకున్నాయి. మరో ఐదు డయాలసిస్‌ యూనిట్లు రానున్నాయ’ని గ్లో సంస్థ ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ వెంకన్నచౌదరి తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఆధునిక యంత్రాలు తీసుకువచ్చి కిడ్నీ బాధితులకు వ్యాధి నయం చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందానికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రోగులకు అందిస్తున్న సేవలు, కిడ్నీ ప్రభావిత గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితిని వైద్యులు వివరించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అల్లు పద్మజ, ఐఓసీ ఈడీ సుధాకరరావు, ఎఎంసీఏఎంఏ ప్రతినిధులు, ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ రవిరాజ్‌, డాక్టర్‌ నవీన్‌, ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ ఎం.మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 12:21 AM