వ్యసనాలకు బానిసై.. దొంగలుగా మారి
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:15 AM
Three arrested for theft ఆ ముగ్గురు యువకులు చెడు వ్యసనాలకు బానిసై.. వేర్వేరుగా చోరీల బాట పట్టారు. ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసుల్లో అరెస్టు అయి జైలుకెళ్లారు. అక్కడ ముగ్గురూ స్నేహితులయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారి బుద్ధి మారలేదు. కొన్నాళ్లుగా ముగ్గురూ కలిసి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతూ.. శ్రీకాకుళం రూరల్ పోలీసులకు చిక్కారు.
8 ఆలయాల్లో చోరీకి పాల్పడిన ముగ్గురి అరెస్టు
వెండి, ఇత్తడి వస్తువుల రికవరీ
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఆ ముగ్గురు యువకులు చెడు వ్యసనాలకు బానిసై.. వేర్వేరుగా చోరీల బాట పట్టారు. ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసుల్లో అరెస్టు అయి జైలుకెళ్లారు. అక్కడ ముగ్గురూ స్నేహితులయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారి బుద్ధి మారలేదు. కొన్నాళ్లుగా ముగ్గురూ కలిసి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతూ.. శ్రీకాకుళం రూరల్ పోలీసులకు చిక్కారు. శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఆ ముగ్గురు నిందితులను తన కార్యాలయంలో గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టి.. వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం మండలం కళ్లేపల్లి గ్రామానికి చెందిన ఎర్రబెల్లి అశోక్, గార మండలం బలరాంపురానికి చెందిన చోడిపల్లి వంశీ, పాలకొండ మండలం తోటవాడకు చెందిన బెండి శివప్రసాద్ గతంలో ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసులో పట్టుబడి 45 రోజులపాటు జైలు శిక్ష అనుభవించారు. కొన్నాళ్ల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన ఆ ముగ్గురు యువకులు చెడు వ్యసనాలకు అలవాటుపడి రాత్రివేళల్లో ఆలయాల్లో కూడా చోరీలకు పాల్పడ్డారు. ఇటీవల శ్రీకాకుళం మండలంలోని మూడు ఆలయాల్లో, గార మండలంలో మూడు ఆలయాల్లో, శ్రీకాకుళం నగరం, నందిగాం ప్రాంతాల్లో ఒక్కో ఆలయాల్లో వెండి, ఇత్తడి వస్తువులు చోరీ చేశారు. కాగా.. బుధవారం ఆ ముగ్గురూ పాత్రునివలస వద్ద ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో రూరల్ ఎస్‌ఐ రాము వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వారు 8 ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్టు విచారణలో తేలింది. ఆ ముగ్గురిని అరెస్టు చేసి.. వారి నుంచి సుమారు రూ.1.71 లక్షల విలువైన వెండి, ఇత్తడి వస్తువులను రికవరీ చేశామని డీఎస్పీ వివేకానంద తెలిపారు. సమావేశంలో శ్రీకాకుళం రూరల్ సీఐ పైడిపు నాయుడు, ఎస్‌ఐ రాము పాల్గొన్నారు.