ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:33 PM
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని వ్యవసా యశాఖ టెక్కలి సహాయ సంచాలకుడు కె జగన్మోహన రావు అన్నారు.
-ఏడీలు జగన్మోహనరావు, రామారావు
పాతపట్నం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని వ్యవసా యశాఖ టెక్కలి సహాయ సంచాలకుడు కె జగన్మోహన రావు అన్నారు. మేజర్ పంచాయతీ పాతప ట్నంలోని పలు ఎరువుల దుకాణాల్లో బుధవారం ఆయన తనిఖీలు నిర్వహించారు. ఆ షాపుల్లో 200వరకూ యూరియా బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయన వెంట ఏవో కిరణ్‌వాణి, ఏఈవో టి.భారతి తదితరులు ఉన్నారు. సీది, తామర గ్రామాల్లో బుధవారం వ్య వసాయ అధికారులు బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసంద ర్భంగా ఏడీ జగన్మోహనరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం వరిలో యూరియా, పొటాషియం లోపం ఎక్కువగా ఉంద న్నారు. పొటాష్ ఎకరాకు 15కేజీలు, యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను ఎకరాకు అర లీటరు చొప్పున పది రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలన్నారు. దీనివల్ల అధిక దిగుబడు లు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు బండి రవివర్మ, తదితరులు పాల్గొన్నారు.
మందసలో..
మందస,ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే చర్యలు తప్పవని పలాస సబ్‌డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకుడు ఎం.రామారావు, మందస మండల వ్యవసాయాధికారి జి.నాగరాజు అన్నారు. మందసలో పలు ఎరువుల దుకాణాలను బుధవారం వారు తనిఖీ చేశారు. లైసెన్స్, రికార్డులు, ధరల పట్టికలను పరిశీలించారు. దుకాణదా రులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు అందిన మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
మోతాదుకు మించి యూరియా వాడొద్దు
నరసన్నపేట, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): వరిలో రైతులు ఎరువుల యాజమాన్యం పాటించాలని, మోతాదుకు మించి యూరియా వినియోగించవద్దని వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త కె.మధుకుమార్, ఆమదావలస వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎం.శ్రీనివాస్, బి. స్వాతి అన్నారు. బుధవారం మాకివలస గ్రామంలో పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా వరి సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం ఏవో వై. సురేష్, ఏవో సూర్యకుమారి, శిమ్మ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సస్య రక్షణతోనే అధిక దిగుబడులు
హరిపురం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): వరి సాగులో సస్యరక్షణ చర్యలు చేపడితేనే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ పలాస ఏడీ ఎం.రామారావు అన్నారు. మందస మండలం కొత్తపల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించారు. రసాయన ఎరువులు వాడకం తగ్గించి, భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట, సేంద్రియ ఎరువులు వినియోగించాలని సూచించారు. సాగుభారం తగ్గించేందుకు ప్రతి రైతు యాంత్రీకరణ వైపు మొగ్గు చూపాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పరికారాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏవో నాగరాజు, ఏఈవో ఉదయ్, జ్యోత్స్న, రైతులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి
ప్రకృతి వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా అడిషనల్ డీపీఎం ధనుంజయ్ సిబ్బందికి సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నరసన్నపేట, జలుమూరు, పోలాకి, సారవకోట ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. కూరగాయలు, వాణిజ్య పంటలను ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసేందుకు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.