విలాసాలకు అలవాటుపడి
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:54 PM
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ముగ్గురు యువకులు దొంగలుగా మారారు.
- ఖరీదైన బైక్‌ల దొంగతనం
- ముగ్గురు యువకుల అరెస్టు
- ఏడు వాహనాలు స్వాధీనం
శ్రీకాకుళం రూరల్, అక్టోబరు15 (ఆంధ్రజ్యోతి): విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ముగ్గురు యువకులు దొంగలుగా మారారు. ఖరీదైన బైక్‌లను చోరీచేసి వాటిని విక్రయించి జల్సాలు చేసేవారు. పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో వీరు పడ్డారు. ముగ్గురిని అరెస్టు చేసి వారినుంచి ఏడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను శ్రీకాకుళం రూరల్ పోలీసు స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు వెల్లడించారు. దండు రిషివర్థన్, రాయిపల్లి వినోద్, చిట్టి సంతోష్ అనే ముగ్గురు యువకులు రెండు బైక్‌లపై ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం వైపు వస్తుండగా దూసి కూడలి వద్ద రూరల్ ఎస్‌ఐ కె.రాము వారి వాహనాలను ఆపి తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో వాహనాలను దొంగతనం చేసినట్లు వారు చెప్పారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి తాము ఇటువంటి దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుంచి రూ.14 లక్షల విలువ గల ఏడు రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
నిందితులపై వివిధ కేసులు..
రిషి వర్థన్‌పై విశాఖపట్నం పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో ఒక హత్య కేసు, పార్వతీపురం రూరల్ పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదై ఉన్నాయి. వినోద్‌పై సాలూరు పోలీసు స్టేషన్‌లో ఐదు సారా కేసులు, సాలూరు ఎక్సైజ్ స్టేషన్‌లో ఒక సారా కేసు, గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు ఉంది. జైలులో వీరిద్దరికి ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి దొంగతనాలకు దారి తీసిందని పోలీసులు తెలిపారు. సంతోష్ కొత్తూరు పట్టణంలో సెకెండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ నిర్వహిస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను దొంగతనం చేసి, వాటి నెంబరు ప్లేట్లు మార్చి ఇతరులకు విక్రయించేవారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించేందుకు కృషి చేసిన శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పైడిపునాయుడు, ఎస్‌ఐ కె.రాము, నారాయణరావు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తిని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అభినందించారు.