అర్ధరాత్రి హైవేపై ప్రమాదం
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:56 PM
దేవాది గ్రామం జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నేషన్ హైవే సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా నుంచి విశాఖ వైపు వెళ్తున్న భారీ ట్రక్కు (లారీ) ను టీ తాగేందుకు హైవే పక్కనే డ్రైవర్ నిలుపుదల చేశారు.
లారీ కేబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్
సురక్షితంగా బయటకు తీసిన అంబులెన్స్ సిబ్బంది
నరసన్నపేట, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): దేవాది గ్రామం జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నేషన్ హైవే సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా నుంచి విశాఖ వైపు వెళ్తున్న భారీ ట్రక్కు (లారీ) ను టీ తాగేందుకు హైవే పక్కనే డ్రైవర్ నిలుపుదల చేశారు. అదే కంపెనీకి చెందిన మరో భారీ ట్రక్కు వెనుక నుంచి వస్తూ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టా డు. ఈ ప్రమాదంలో ఢీకొన్న ట్రక్కు డ్రైవర్ బబుల్ సింగ్ స్టీరింగ్ మధ్య కేబిన్‌లో ఇరుక్కొని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా.. ముందు ట్రక్కు డ్రైవర్ నేషనల్ హైవే సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే హైవే సిబ్బంది అక్కడికి చేరుకొని స్టీరింగ్ మధ్యలో ఇరుక్కున్న డ్రైవర్‌ను మరికొంతమంది లారీ డ్రైవర్ల సాయంతో బయటకు తీశారు. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. హైవే అంబులెన్స్ సిబ్బంది సకాలంలో చేరడంతో డ్రైవర్‌ను ప్రాణాలతో కాపాడడం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
దసరా సెలవులకు వచ్చి..
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఎచ్చెర్ల, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): దసరా సెలవుల కోసం వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గు రై మృతి చెందిన ఘటన పొన్నాడ బ్రిడ్జి రోడ్డులో శుక్ర వారం అర్ధరాత్రి సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆమదాలవలస మండలం కలి వరం పంచాయతీ ముద్దాడపేటకి చెందిన నవీన్(19) గతే డాది పాలిటెక్నిక్ పూర్తిచేశాడు. ప్రస్తుతం విశాఖపట్నంలో నవీన్ పార్ట్‌టైమ్ జాబ్ చేసుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. దసరా సెలవుల కోసం విశాఖ నుంచి ఇంటికి వచ్చిన నవీన్ తన స్నేహితుడి బైక్ తీసుకుని ఎచ్చెర్ల మం డలం పొన్నాడ వైపు వచ్చాడు. రాత్రి 12 గంటల సమయంలో పొన్నాడ నుంచి శ్రీకాకుళం వైపు అతివేగంగా వస్తుండగా బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. నవీన్ తండ్రి సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్ తెలిపా రు. సత్యంకు ఉన్న ఇద్దరు పిల్లలు కాగా కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరిలో కుమారుడు మృతి చెందడంతో వారు లబోదిబోమంటున్నారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
నరసన్నపేట, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): స్నానం చేసుకునేందుకు చెరువుకి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవ శాత్తు జారిపడి మృతి చెందిన ఘటన శనివారం కామేశ్వరిపేట గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. శనివారం ఉదయం స్నానం కోసం కనుగుల దామోదరరావు (37) గ్రామ సమీపంలో గల చెరువుకి వెళ్లాడు. స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు జారీపడి లోతైన ప్రాంతంలోకి వెళ్లిపోయాడు. అతడికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. స్థానికులు గుర్తించి వెంటనే అతడిని బయటకు తీసి సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. దామోదరరావు తల్లి రాములమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు..
రణస్థలం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): కోష్ఠ గ్రామం వద్ద జాతీయ రహదారిపై గుర్తుతె లియని వాహనం ఢీకొని శ్రీ కాకుళం పట్టణానికి చెందిన డి.ప్రసాదరావు (68) మృతి చెందారు. జేఆర్ పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రసా దరావు కుమారుడు శ్రీనివాసరావు కోష్ఠలో పాన్‌షాప్ పెట్టుకుని జీవనం సాగిసు ్తన్నాడు. కుమారుడి ఇంటికి ప్రసాదరావు శనివారం వచ్చాడు. ఈక్రమంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన వివరాలు సోషల్ మీడి యాలో రావడంతో కుటుంబ సభ్యులు గుర్తించి జేఆర్ పురం ఎస్‌ఐ చిరంజీవిని కలిసి ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తర లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.