Share News

విద్యార్థులకు ఆధార్‌ కష్టాలు!

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:29 AM

Aadhar problems విద్యార్థులకు ఆధార్‌ కష్టాలు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం వన్‌ నేషన్‌.. వన్‌ స్టూడెంట్‌ ఐడీ పేరిట ఆటోమేటేడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ర్టీ (అపార్‌) జారీ చేయాలని నిర్ణయించింది. ఆధార్‌ తరహాలో వచ్చే గుర్తింపుకార్డుతో విద్యార్థికి సంబంధించిన పూర్తివివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే ఆధార్‌లో తప్పిదాలు సరిచేస్తేనే వివరాలు నమోదవుతాయి. కానీ ఆధార్‌లో తప్పిదాలు సరిచేసేందుకు విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

విద్యార్థులకు ఆధార్‌ కష్టాలు!

  • అపార్‌లో నమోదుకు అడ్డంకిగా తప్పిదాలు

  • జిల్లాలోని కేంద్రాల్లో జనన ధ్రువీకరణ పత్రాల

  • తిరస్కరణ

  • విశాఖలో ప్రాంతీయ కార్యాలయానికి పరుగులు తీస్తున్న బాధితులు

  • రణస్థలం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి):

  • రణస్థలం మండల కేంద్రానికి చెందిన ఇజ్జరోతు గాయత్రి ఇంటర్‌ చదువుతోంది. ఆమె ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా నమోదైంది. కొద్దిరోజులుగా దానిని సరిచేసుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో జనన ధ్రువీకరణ పత్రం తీసుకుంది. జిల్లాలో ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళితే దరఖాస్తు తిరస్కరణకు గురైంది. చివరకు విశాఖపట్నంలోని ఆధార్‌ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి బుధవారం దరఖాస్తు చేసుకుంది. ఆధార్‌లో జన్మదినం సరికాకపోతే వచ్చే నెలలో జరిగే నీట్‌ పోటీ పరీక్షకు ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వేడుకుంటోంది.

  • రణస్థలం మండలంలో ఓ పాఠశాలకు చెందిన పదుల సంఖ్యలో విద్యార్థుల ఆధార్‌ కార్డుల్లో తప్పులు ఉన్నాయి. పేర్లు, పుట్టిన తేదీలు తప్పుగా ఉండడంతో వాటిని సవరించేందుకు ఇద్దరు ఉపాధ్యాయులు రణస్థలంలో ఆధార్‌ కేంద్రాలకు విద్యార్థులను తీసుకెళ్లారు. కానీ పని జరగకపోవడంతో నిరుత్సాహంగా తిరిగి వెళ్లారు.

  • విద్యార్థులకు ఆధార్‌ కష్టాలు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం వన్‌ నేషన్‌.. వన్‌ స్టూడెంట్‌ ఐడీ పేరిట ఆటోమేటేడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ర్టీ (అపార్‌) జారీ చేయాలని నిర్ణయించింది. ఆధార్‌ తరహాలో వచ్చే గుర్తింపుకార్డుతో విద్యార్థికి సంబంధించిన పూర్తివివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే ఆధార్‌లో తప్పిదాలు సరిచేస్తేనే వివరాలు నమోదవుతాయి. కానీ ఆధార్‌లో తప్పిదాలు సరిచేసేందుకు విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్‌ కేంద్రాలు అరకొరగా ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో లేకపోవడంతో నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదు.

  • తప్పని వ్యయప్రయాసలు..

  • జిల్లాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ 3.70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 45 వేల మంది ఆధార్‌ కార్డుల్లో పుట్టిన తేదీ తప్పుగా నమోదైంది. మరో 35 వేల మంది పేర్లు, అడ్రస్‌లో తప్పులు దొర్లాయి. వీటిని సరిచేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం జిల్లాలో 80 ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా ముందుగా పంచాయతీ కార్యదర్శి లేదా వీఆర్వో నుంచి నాన్‌ అవైలబుల్‌ పత్రం తీసుకొని నోటరీ చేయించాలి. ఆ రెండు పత్రాలతో వెళ్లి గ్రామ సచివాలయంలో వివరాలు నమోదు చేయించాలి. తహసీల్దారు పరీక్షించిన తరువాత ఆర్డీవోకు దరఖాస్తు చేరుతుంది. ఆ దశ దాటితేనే జనన ధ్రువీకరణపత్రాన్ని జారీ చేస్తున్నారు. జనన ధ్రువీకరణ పత్రం వచ్చిన తరువాత ఆధార్‌ కేంద్రాలకు వెళితేనే అప్‌డేట్‌ అవుతుంది. కానీ కేవలం ఆర్డీవో నుంచి వచ్చే జనన ధ్రువీకరణ పత్రాల కోసమే వేలాదిమంది ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

  • వాస్తవానికి పదో తరగతి సర్టిఫికెట్‌లో ఉన్న పుట్టిన తేదీతో ఆధార్‌ నమోదులో చేర్పులు, మార్పులు చేసుకోవచ్చు. కానీ 18 ఏళ్లు నిండితేనే ఆ ధ్రువీకరణ పత్రం ద్వారా తీసుకుంటోంది. ఆర్డీవోలు జారీ చేసిన జనన ధ్రువపత్రం, మునిసిపాల్టీలు ఇచ్చే ధ్రువపత్రం అప్‌లోడ్‌ చేస్తుంటే తిరస్కరణకు గురవుతోంది. మరోసారి దరఖాస్తు చేసుకుంటే ఆధార్‌ కేంద్రాల నిర్వాహకులకు జరిమానా పడుతున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మూడు జిల్లాలకు సంబంధించి ప్రాంతీయ ఆధార్‌ కేంద్రం విశాఖలో నడుస్తోంది. అక్కడకు వెళ్లి చాలామంది ఆధార్‌లో తప్పులు సరిచేసుకుంటున్నారు. అయితే ప్రాంతీయ ఆధార్‌ కేంద్రం గత నెల 26 నుంచి మూతపడింది. కార్యాలయంలో చేర్పులు మార్పుల కోసం మూసివేశారు. ఈ నెల 14 నుంచి మళ్లీ ఆధార్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రతిరోజు జిల్లా నుంచి వందలాది మంది అక్కడకు వెళ్తున్నారు. ఆధార్‌ మార్పునకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దీనిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు.

Updated Date - Dec 20 , 2025 | 12:29 AM