Share News

సువిశాల తీరం.. ఏదీ ప్రయోజనం?

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:59 PM

Today is World Fisheries Day రాష్ట్రంలో అత్యధిక తీరప్రాంతం ఉండే జిల్లా శ్రీకాకుళం. ఏకంగా 193 కిలోమీటర్లు తీరప్రాంతం కలిగిఉంది. ఇక్కడి మత్స్యకారులు సముద్రం, నదులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో సముద్రం, చెరువుల నుంచి 132 రకాల మత్స్య సంపద లభిస్తుంది. విశాఖపట్నం మాదిరిగా హార్బర్‌ అందుబాటులో లేకపోవడం, జెట్టీలు పూర్తి కాకపోవడంతో మత్స్యకారులు మోటారు బోట్లతో వేట సాగిస్తున్నారు.

సువిశాల తీరం.. ఏదీ ప్రయోజనం?

  • జిల్లాలో 132 రకాల మత్స్య సంపద లభ్యం

  • మోటరైజ్జ్‌ బోట్లతోనే సముద్రంలో వేట

  • సౌకర్యాలు మెరుగుపడితే మరింతగా లాభం

  • ఆ మూడు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తేనే..

  • శ్రీకాకుళం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అత్యధిక తీరప్రాంతం ఉండే జిల్లా శ్రీకాకుళం. ఏకంగా 193 కిలోమీటర్లు తీరప్రాంతం కలిగిఉంది. ఇక్కడి మత్స్యకారులు సముద్రం, నదులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో సముద్రం, చెరువుల నుంచి 132 రకాల మత్స్య సంపద లభిస్తుంది. విశాఖపట్నం మాదిరిగా హార్బర్‌ అందుబాటులో లేకపోవడం, జెట్టీలు పూర్తి కాకపోవడంతో మత్స్యకారులు మోటారు బోట్లతో వేట సాగిస్తున్నారు. ఏడాదికి సముద్రం నుంచి సుమారు 810 టన్నుల చేపలు, రొయ్యలు సేకరించి.. విక్రయిస్తున్నారు. అలాగే రొయ్యల ఉత్పత్తిని పరిశీలిస్తే.. మంచినీటి చెరువులు, ఉప్పునీటి చెరువుల్లో ఏడాదికి 1,52,137 టన్నుల ఉత్పత్తి ఉంది. మంచినీటి చెరువుల్లో చేపలు, రొయ్యలు కలిపి.. 9,212 టన్నుల ఉత్పత్తి ఏడాదికి లభిస్తుంది. వీటి విలువ రూ.153 కోట్లు పైబడి ఉంది. సముద్రపు, మంచినీటి చెరువుల ద్వారాను.. మొత్తం రూ. 500 కోట్ల మేర విక్రయాలు సాగుతున్నాయి. హార్బర్లు, జెట్టీలు అందుబాటులో లేకపోవడంతో.. మోటారు బోట్లతోనే సముద్రంలో ఎనిమిది కిలోమీటర్ల మేర వేటకు వెళ్తున్నారు. ఇక్కడి నుంచి విశాఖపట్నం వరకే ఎగుమతి అవుతున్నాయి. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.

  • సముద్ర తీరం పొడవు : 193 కిలోమీటర్లు

  • తీర ప్రాంత మండలాలు : 11

  • కోస్టల్‌ తీరప్రాంత గ్రామాలు : 104

  • తీరప్రాంత మత్స్యకారుల జనాభా : 1,12,456

  • మొత్తం ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌లు : 60

  • మోటరైజ్డ్‌ బోట్లు : 1,623

  • మత్స్యకార గ్రామాలు : 164

  • సంప్రదాయ మత్స్యకారులు : 42,565

  • ఇన్‌ల్యాండ్‌ యాక్టివ్‌ ఫిషర్‌మెన్‌ : 11,273

  • మంచినీటి చెరువులు : 183

  • లభిస్తున్న చేపల రకాలు.. ధరలు

  • మత్స్యలేశం, కళింగపట్టణం, నువ్వులరేవు, భావనపాడు, బారువ తీరాల్లో చేపలవేట సాగిస్తున్నారు. జిల్లాలో 132 రకాల మత్స్య సంపద.. (చందువ, పట్టుసావళ్లు, నత్తళ్లు, కోనేం, గురివింద, వంజరం, పండుగప్ప, వోలు కనస, కవ్వళ్లు, రొయ్యలు, పీతలు.. అలాగే మంచినీటి చెరువుల్లో.. నదుల నుంచి రోయ, బొచ్చు, గడ్డిచేపలు, కొర్రమీను) లభిస్తోంది. మంచినీటి చెరువుల్లో లభించే చేపల ధరలు పరిశీలిస్తే.. గడ్డి చేప టన్ను రూ. 90000, బంగారుపాప(గోల్డెన్‌ఫిష్‌) రూ.1,30,000, కేట్‌ ఫిష్‌ రూ. 1,00,000, కొర్రమీను(సవడ) రూ. 1,50,000, ఎర్రమైలు, రోయ, బొచ్చు చేపలు రూ. 1,10,000.. పలుకుతున్నాయి. కిలో చొప్పున రూ. 90 నుంచి రూ. 150 వరకు లభిస్తున్నాయి. మంచినీటి చేపలు ఎక్కువగా ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు ఎగమతి అవుతున్నాయి. రొయ్యలు టన్ను ధర.. రకాలను బట్టి రూ.5లక్షల వరకు ఉంది. ఇక సముద్ర చేపల ధరలు పరిశీలిస్తే.. కోనేం కిలో రూ. 400, పండుగప్ప రూ. 250, గురివిందలు రూ. 200, చందువ రూ. 150, రొయ్యలు కిలో రూ. 500, వంజరం రూ. 500కు లభిస్తున్నాయి.

  • మరింతగా లభించాలంటే..

  • ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌, మంచినీళ్ల పేట వద్ద జెట్టీ నిర్మాణం పూర్తి కావాలి. ప్రస్తుతం పనులు జోరందుకున్నాయి. మూలపేట పోర్టు దాదాపు పూర్తిఅయినట్లే. ఇక మత్స్యకారులు.. చేపలు నిల్వచేసుకునేందుకు అవసరమైన కోల్డ్‌స్టోరేజీలు జిల్లాలో లేవు. అలాగే మెకనైజ్డ్‌ బోట్లు కూడా ఎవరికీ లేవు. ఉన్నవన్నీ.. మోటరైజ్డ్‌ బోట్లు మాత్రమే. దీంతో ఆశించిన స్థాయిలో వేట సాగడంలేదు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై) కింద 15 తీర గ్రామాలను ఎంపిక చేశారు. పెద్దగనగళ్లవానిపేట, ఇద్దివానిపాలెం, దేవునల్తాడ ప్రాంతాల్లో రూ.2 కోట్లతో వలలు భద్రపరుచుకునేందుకు భవనాల కోసం మంజూరు చేశారు. కానీ ఇంకా పనులు పూర్తికాలేదు. అలాగే సంప్రదాయ మత్స్యకారుల విషయానికొస్తే.. స్థానికంగా పంచాయతీల్లో వేలంపాట ద్వారాను.. సొసైటీల ద్వారాను చెరువులను లీజుకు తీసుకుంటున్నారు. చెరువుల లీజులు.. భారీగా ఉంటున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా పంచాయతీ కమిటీలు వేరుగా నిర్ణయిస్తున్నాయి. దీంతో చేపల పెంపకం ఖర్చు గణనీయంగా పెరిగిపోయింది.

  • తీరప్రాంత మత్స్యకారులకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలి:

  • తీర ప్రాంత మత్స్యకారులకు మెకనైజ్డ్‌ బోట్లు లేవు. అవి ఉంటే సముద్రంలో కొన్నిరోజుల తరబడి వేట చేసుకునేందుకు వీలుంటుంది. అలాగే జెట్టీలు పూర్తిచేయాల్సిఉంది. తీరప్రాంత మత్స్యకారుల అవసరాల్ని గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రయోజనముంటుంది.

    -మైలపల్లి నర్శింగరావు, జిల్లా మాజీ మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు

  • నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం

  • శ్రీకాకుళంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో శుక్రవారం ప్రపంచ మత్స్య దినోత్సవం నిర్వహించ నున్నారు. రాష్ట్రస్థాయిలో జరగనున్న ఈ కార్యక్రమానికి మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మత్స్యశాఖ కమిషనర్‌ రామ్‌శంకర్‌ నాయక్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ హాజరుకానున్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌, అధికారులు, మత్స్యకార ప్రతినిధులు పాల్గొనున్నారు.

Updated Date - Nov 20 , 2025 | 11:59 PM