no tourism: సువిశాల తీరం.. పర్యాటకం లేదాయె!
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:58 PM
Unseen amenities on the beaches of the district జిల్లాలో పర్యాటకాభివృద్ధికి అడుగులు పడడం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో(2014-2019 మధ్య) పర్యాటక రంగానికి ప్రాధాన్యమిచ్చారు. జిల్లాకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టారు. కాగా.. వైసీపీ హయాంలో పర్యాటక రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.
ఒడిశాతో పోల్చుకుంటే చాలా వెనుబాటు
జిల్లాలోని బీచ్‌ల్లో కానరాని వసతులు
పర్యాటకులకు తప్పని అవస్థలు
జిల్లాను పర్యాటక హబ్‌గా మారుస్తాం. బారువ బీచ్‌ను మినీ గోవాగా తీర్చదిద్దుతాం. ఏటా బీచ్ ఫెస్టివల్ నిర్వహించి తీర ప్రాంత అందాలను బాహ్య ప్రపంచానికి చూపుతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలో తీర ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిద్దుతాం.
- ఇదీ ఈ ఏడాది ఏప్రిల్ 20న బారువ బీచ్ ఫెస్టివల్‌లో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రకటన
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పర్యాటకాభివృద్ధికి అడుగులు పడడం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో(2014-2019 మధ్య) పర్యాటక రంగానికి ప్రాధాన్యమిచ్చారు. జిల్లాకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టారు. కాగా.. వైసీపీ హయాంలో పర్యాటక రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కూటమి అధికారంలోకి రావడంతో పర్యాటకం ఊపందుకుంటుందని అంతా భావించారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో పర్యాటకులకు అవస్థలు తప్పడం లేదు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో ఇచ్చాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. డొంకూరు, కవిటి, బారువ, అక్కుపల్లి, భావనపాడు, కళింగపట్నం, మొగదాలపాడు, కళ్లేపల్లి, గనగళ్లపేట, బందరువానిపేట తదితర తీరప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన వనరులు ఉన్నాయి. జిల్లా సరిహద్దున ఒడిశా రాష్ట్రంలో ఉన్న సోనాపూర్ బీచ్‌కు ఏమాత్రం తగ్గని విధంగా ఇక్కడ బీచ్‌లను ఎంతో అభివృద్ధి చేయవచ్చు. అలాగే తీరప్రాంతంలో కొబ్బరి, జీడి, ఇతర ఉద్యాన పంటలు కనువిందు చేస్తాయి. జిల్లాలో బాహుదా, మహేంద్ర తనయా, వంశధార, నాగావళి నదీ సంగమాలు ఉన్నాయి. తీరానికి దగ్గరగా పురాణ, చారిత్రక, ఇతిహాసాలతో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. విదేశాల నుంచి వేలాది కిలోమీటర్లు దాటుకుంటూ సైబీరియా పక్షులు ఇక్కడకు వస్తుంటాయి. పూండి, నౌపడ ఉప్పుగళ్లీలు, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఎర్రమట్టి దిబ్బలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటిని అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది.
పట్టించుకోనేవారేరీ?
టీడీపీ హయాంలో గార మండలం కళింగపట్నం బీచ్‌ను అభివృద్ధి చేశారు. భారీ ఒంటెలతో పాటు కొన్నిరకాల జంతువుల ఆకృతులను ఏర్పాటు చేశారు. పర్యాటకులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. పర్యాటక ఉత్సవాలు కూడా నిర్వహించారు. తీరం వరకూ రహదారులను సైతం ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ రిసార్ట్స్ సైతం నిర్మించారు. కానీ వైసీపీ పాలనలో ఈ బీచ్ పూర్తిగా నిర్వీర్యమైంది. నిర్వహణను గాలికొదిలేసిన జగన్ సర్కారు రిసార్ట్స్‌లో బార్‌ను మాత్రం నడిపించింది.
ఇచ్ఛాపురం మండలం డొంకూరు బీచ్‌కు కూతవేటు దూరంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన సోనాపూర్, గోపాల్‌పూర్ బీచ్‌లు ఉంటాయి. అక్కడ రిసార్ట్స్‌తోపాటు ఆహ్లాదకర నిర్మాణాలతో నిత్యం పర్యాటకుల తాకిడి ఉంటుంది. పుష్కలంగా వ్యాపారాలు జరుగుతుంటాయి. నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వానికి పర్యాటక శాఖ ద్వారా ఆదాయం కూడా సమకూరుతోంది. కాగా.. జిల్లాలోని ఏ బీచ్‌లోనూ కనీస సౌకర్యాలు లేవని పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాను పర్యాటక హబ్‌గా మారుస్తామన్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రకటించినా.. ఇంతవరకూ ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పర్యాటకాభివృద్ధిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
బాధాకరం
పేరుకే బీచ్‌లు. కానీ అక్కడ వసతులు లేవు. కేవలం సముద్రం చూసి రావడానికి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. కనీసం తీరంలో బెంచ్‌ల ఏర్పాటు కూడా లేదు. అదే పక్కనే ఒడిశాలోని సోనాపూర్ బీచ్ చూస్తే కళ్లు చెదిరిపోతాయి. మన బీచ్‌లపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాలి.
- చాట్ల లోహిదాస్‌రెడ్డి, ఇచ్ఛాపురం
అక్కడ బీచ్‌లే బెస్ట్..
కుటుంబంతో బీచ్‌కు వెళితే చక్కగా కూర్చోవడానికి వీలు లేకుండా పోతోంది. ఎండకు, వర్షానికి తలదాచుకుంటామంటే చెట్లే గతి అవుతున్నాయి. అందుకే జిల్లా నుంచి ప్రజలు సేద తీరేందుకు ఒడిశా బీచ్‌లకు వెళుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బీచ్‌లను అభివృద్ధి చేయాలి.
- కాళ్ల నరసింహమూర్తి, ఇచ్ఛాపురం
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లాలో తీర ప్రాంతాల పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించాం. ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, ఇతర ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు ఇచ్చారు. వాటిని ప్రత్యేక పరిగణగా తీసుకున్నాం. ఇచ్ఛాపురం మండలం నుంచి రణస్థలం మండలం వరకూ ఉన్న తీరంలో పర్యాటకాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించాం.
- నడిమింటి నారాయణరావు, జిల్లా పర్యాటకశాఖ అధికారి, శ్రీకాకుళం