Share News

మేనత్త ఇంటికి వెళ్తుండగా..

ABN , Publish Date - Dec 13 , 2025 | 12:23 AM

మండల కేంద్రం లోని బలియాపుట్టుగ కాలనీకి చెందిన సాలిన గంగోత్రి (తనూజ) గురువారం సాయంత్రం రైలు ఢీకొని మృతి చెందింది.

మేనత్త ఇంటికి వెళ్తుండగా..

  • రైలు ఢీకొని విద్యార్థిని మృతి

కంచిలి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం లోని బలియాపుట్టుగ కాలనీకి చెందిన సాలిన గంగోత్రి (తనూజ) గురువారం సాయంత్రం రైలు ఢీకొని మృతి చెందింది. కుటుంబ సభ్యులు, పలాస జీఆర్పీ ఎస్‌ఐ మధుసూదన్‌ తెలిపిన వివరాల మేరకు.. పదో తరగతి చదువుతున్న గంగోత్రి సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో గొల్లకంచిలిలో ఉన్న తన మేనత్త ఇంటికి బీపీ కాలనీకి ఎదురుగా ఉన్న చర్చి వెనుకవైపు నుంచి వెళ్లింది. ఈ క్రమంలో రైల్వే ట్రాక్‌ దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. రాత్రయినా కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి పురుషోత్తం, కుటుంబ సభ్యులతో కలిసి వెతికినా ఫలితం లేకపోయింది. అర్ధరాత్రి రైల్వే పోలీసుల సమాచారంతో కుమార్తె మృతి చెందిన విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు. గంగోత్రికి ఇద్దరు సోదరిలున్నారు. ఈ ఘటనపై పలాస రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్య

జలుమూరు, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): యలమంచిలి గ్రామానికి చెందిన బొమ్మాళి ఎండువాడు (61) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎండువాడు మనస్తాపానికి గురై గురువారం గడ్డిమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఎండువాడు కుమారుడు వెంకటరమణమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బి.అశోక్‌బాబు తెలిపారు. ఎండువాడికి భార్య తవిటమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ఆరుగురికి జరిమానా

నందిగాం, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలో డ్రండెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఆరుగురికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించినట్టు ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ ఆలీ తెలిపారు. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన బంగారి జోగారావు, వాసుదేవరాజు, నర్సిపురం కామరాజు, ప్రకాశరావు, పాత్రో ధనుంజయరావు, అడప వెంకట్రావులను టెక్కలి మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి మాధురి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్టు తెలిపారు మద్యం తాగి నడుపుతూ ఎవరైనా పట్టుబడితే చట్టపరంగా శిక్ష తప్పదని హెచ్చరించారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

కోటబొమ్మాళి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి హరిశ్చంద్ర పురం ఫ్లై ఓవర్‌పై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరు.. టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న బమ్మిడి గణేష్‌, దీర్గాశి రాము, దీర్గాశి శ్రీను ఫ్లైఓవర్‌ పైకి వచ్చే సరికి రోడ్డు పనులు చేస్తున్న సిబ్బంది కోసం నిలిపిన వ్యాన్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘట నలో ఒప్పంగి గ్రామానికి చెందిన బమ్మిడి గణేష్‌కు రెండు కాళ్లు నుజ్జునుజ్జు య్యాయి. అతడిని 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌ తరలించారు. అలాగే గార మండలం సవిరిగాం గ్రామానికి చెందిన దీర్గాశి రాము, దీర్గాశి శ్రీనులను హైవే అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి.. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

Updated Date - Dec 13 , 2025 | 12:23 AM