ఆక్వాపై తుఫాన్ దెబ్బ!
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:15 AM
Aqwa loss మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉంది అక్వా రైతుల పరిస్థితి. ఒకవైపు సుంకాల బెడద.. మరోవైపు మొంథా తుఫాన్ మిగిల్చిన నష్టంతో వారు విలవిల్లాడుతున్నారు. ఇటీవల తుఫాన్ ప్రభావంతో చేపల చెరువుల్లోకి వర్షపునీరు చేరింది. దీంతో ఉప్పునీటి శాతం తగ్గి రొయ్యలు, చేపల ఎదుగుదల లేకుండా పోతోంది. తమకు మరింత నష్టం వాటిల్లుతోందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘మొంథా’తో తీరని నష్టం
చెరువుల్లో నీరుచేరి తగ్గిన ఉప్పుశాతం
చేపలను వెంటాడుతున్న తెగుళ్లు
ఆందోళనలో రైతులు
ఇచ్ఛాపురం, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉంది అక్వా రైతుల పరిస్థితి. ఒకవైపు సుంకాల బెడద.. మరోవైపు మొంథా తుఫాన్ మిగిల్చిన నష్టంతో వారు విలవిల్లాడుతున్నారు. ఇటీవల తుఫాన్ ప్రభావంతో చేపల చెరువుల్లోకి వర్షపునీరు చేరింది. దీంతో ఉప్పునీటి శాతం తగ్గి రొయ్యలు, చేపల ఎదుగుదల లేకుండా పోతోంది. తమకు మరింత నష్టం వాటిల్లుతోందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 11 తీర మండలాల్లో 4 వేల హెక్టార్లలో ఆక్వా సాగవుతోంది. 1500 మంది చేపల చెరువులను నిర్వహిస్తున్నారు. వాటిలో 10వేల మంది వరకూ పని చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో రణస్థలం, ఎచ్చెర్ల, గార, సంతబొమ్మాళి, సోంపేట, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, పోలాకి మండలాల్లో ఆక్వాలో భాగంగా చేపల చెరువులు సాగు చేస్తున్నారు. ఇచ్ఛాపురం మండలానికి సంబంధించి బూర్జపాడు పంచాయతీ పరిధిలోని డొంకూరు, శివకృష్ణాపురం, చిన్న లక్ష్మీపురం, పెద్దలక్ష్మీపురం గ్రామాల్లో దాదాపు 100 ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయి. జిల్లాలో ఏడాదికి రూ.200 కోట్ల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. ప్రధానంగా విదేశీ ఎగుమతికి అవకాశం ఉండే రొయ్యలు సాగు చేస్తుంటారు. దేశీయంగా కూడా మన జిల్లాలో సాగుచేసే చేపలకు మార్కెట్ ఉంది. కానీ అమెరికాలో ట్రంప్ సుంకాల బెడద వెంటాడుతోంది. మరోవైపు ఇటీవల మొంథా తుఫాన్ తీవ్రత తీర ప్రాంతాలపై పడింది. ఫలితంగా ఆక్వా రంగం దెబ్బతింది. వర్షాలకు చెరువుల్లో నీరు చేరి ఉప్పునీటి శాతం తగ్గిపోయింది. ఆపై చలి పెరిగి.. పగటి ఉష్ణోగ్రతలు సైతం తగ్గుముఖం పట్టాయి. చెరువుల్లో చేప పిల్లలు ఒత్తిడికి గురై మేత తీసుకోవడం లేదు. నిరంతరాయంగా ఏరియేటర్లు తిప్పుతున్నామని ఆక్వా రైతులు చెబుతున్నారు. ఇటీవల భారీ వర్షాలకు రొయ్యలు తెగుళ్లబారిన పడ్డాయని, వాతావరణ మార్పులకు తట్టుకోలేక సగానికిపైగా చనిపోతున్నాయని పేర్కొంటున్నారు. వ్యాధుల కారణంగా 15 నుంచి 20 గ్రాముల మధ్యలోనే రొయ్య ఎదుగుదల ఆగిపోతోంది. సాధారణంగా ఎకరా ఆక్వా సాగుకు రూ.4 లక్షలు ఖర్చవుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు రాకపోగా నష్టాలు మిగులుతున్నాయని రైతులు వాపోతున్నారు. అమెరికాలో సుంకాల సాకు చూపి రొయ్యలు, చేపలను వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతున్నారని పేర్కొంటున్నారు.
వైసీపీ హయాంలో ఆక్వారంగం పూర్తిగా నీరసించింది. జగన్ సర్కారు కనీస ప్రోత్సహ చర్యలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం ప్రోత్సహించేందుకు చాలారకాల మినహాయింపులు ఇచ్చింది. ఎటువంటి నిబంధనలు విధించకుండా చెరువులు సాగుచేసే వారికి రాయితీ విద్యుత్ అందించాలని నిర్ణయించింది. రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ను అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లాలో చేపల చెరువులు పెరిగాయి. కానీ ఇంతలోనే అమెరికా పన్నులు, మొంథా తుఫాను ఆక్వా రైతులను దెబ్బతీసింది.
తుఫాన్‌తో నష్టం
మొంథా తుఫాన్ మా బతుకులను దెబ్బతీసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక చేపలకు ఎదుగుదల లేకుండా పోయింది. వైసీపీ పాలనలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాం. కూటమి ప్రభుత్వం విద్యుత్ రాయితీ ప్రకటించింది. ఆహార ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. దీంతో భవిష్యత్ బాగుంటుందని ఆశించాం. కానీ ఇప్పుడు చేపలకు తెగుళ్లు దెబ్బ తీస్తున్నాయి.
- దున్న కేశవరావు, రొయ్యల చెరువు నిర్వాహకుడు, బూర్జపాడు