Share News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Dec 31 , 2025 | 11:30 PM

దన్నానపేట సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన ఆర్‌.నరేంద్ర శర్మ (52) మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రణస్థలం, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): దన్నానపేట సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన ఆర్‌.నరేంద్ర శర్మ (52) మృతి చెందారు. జేఆర్‌ పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పైడిభీమ వరంలోని ఒక పరిశ్రమలో సెక్యూర్టీ గార్డుగా పనిచేస్తున్న నరేంద్రశర్మ విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై రణస్థలం వస్తుండగా.. వెనుక నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడి క్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. నరేంద్రశర్మ భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

యువకుడికి గాయాలు

నందిగాం, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): స్థానిక పాతబస్టాండ్‌ సమీపాన జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి పల్లివీధికి చెందిన యశ్వంత్‌ ద్విచక్ర వాహనంపై టెక్కలి వైపు వెళ్తుండగా అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. యశ్వంత్‌ కాళ్లు విరిగిపోయాయి. చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ ఆలీ కేసు నమోదు చేశారు.

చోరీ కేసుల్లో ముగ్గురు అరెస్టు

నరసన్నపేట/పోలాకి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడిన ముగ్గురుని పోలాకి ఎస్‌ఐ రంజిత్‌ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం స్థానిక గొట్టిపల్లి జంక్షన్‌ వద్ద పట్టుకున్నారు. సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని పోలాకి మండల పరిధిలో ఐదు చోట్ల, నరసన్నపేట, సారవకోట, సంతబొమ్మాళి, నౌపడ, కాశీబుగ్గలో ఒక్కో ఆలయంలో చోరీకి పాల్పడిన నరసన్నపేట మండలం గొట్టిపల్లి చెరువు గట్టుపై నివసిస్తున్న చెరుకూరి శేఖర్‌, మద్దె జీవరత్నం, చింతాడ మధులను అరెస్టు చేసినట్టు తెలిపారు. వీరు ప్లాస్టిక్‌ సామగ్రి కొనుగోలు చేస్తూ శివారు ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను గుర్తించి రాత్రి పూట చోరీలకు పాల్పడుతున్నారు. ఈనెల 26న పోలాకి మండలం తెల్లవానిపేట ఆలయంలో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో భాగంగా వీరిని సీసీ ఫుటేజీల్లో గుర్తించడంతో ఈ తతాంగం అంతా బయటపడింది. 28 గ్రాముల బరువైన 28 బంగారం శతమానాలు, వెండి కిరీటం, పంచపాత్ర తోపాటు 175 గ్రాములు వెండి ఆభరణాలతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు.

తప్పిపోయిన బాలిక అప్పగింత

పలాస, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ఫిర్యాదు చేసిన రెండు గంటల వ్యవధిలోనే తప్పిపోయిన బాలికను పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగిం చిన ఘటన కాశీబుగ్గలో చోటుచేసుకుంది. సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. కాశీబుగ్గకు చెందిన అనీషా నాయక్‌ అనే మహిళ పో లీసు స్టేషన్‌కు చేరుకొని ఆరో తరగతి చదువుతున్న తన కుమార్తె లల్లి ప్రియా నాయక్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించడం లేదని బుధ వారం ఫిర్యాదు చేసింది. తక్షణం స్పందించిన సీఐ సిబ్బందిని రెండు బృందాలుగా ఏర్పాటు చేసి పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలు, ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌, పారిశ్రామికవాడ తదితర ప్రాంతాల్లో గాలించారు. చివరకు రెండు గంటల్లో బాలిక ఆచూకీ కనిపెట్టి ఆమెను పట్టుకున్నా రు. బిస్కెట్లు, చాక్లెట్లు ఇచ్చి మచ్చిక చేసుకొని పోలీసు స్టేషన్‌కు తీసు కువచ్చి... ఆమె తల్లికి అప్పగించారు. స్కూల్‌కు టైమ్‌కు వెళ్లాలని తల్లి మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిందని సీఐ వివరించారు.

మద్యం మత్తులో దాడి.. కేసు నమోదు

జలుమూరు, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో వ్యక్తిపై దాడి చేసి గాయపరచిన ఘటన సైరిగాం గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాదుకు చెందిన అఖిల్‌ తన స్నేహితుడు సైరిగాం గ్రామానికి చెందిన చీడిపూడి సింహాచలం ఇంటికి వచ్చాడు. వీరిద్దరూ అదే గ్రామానికి చెందిన చెరుకుపల్లి సంజయ్‌తో కలిసి పూటుగా మద్యం తాగారు. అఖిల్‌, సంజయ్‌ గొడవపడ్డారు. అఖిల్‌పై సంజయ్‌ కర్రతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. సింహాచలం బుధవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ బి.అశోక్‌బాబు తెలిపారు.

Updated Date - Dec 31 , 2025 | 11:30 PM