రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:14 AM
పాత జాతీయ రహదారి సరియాపల్లి గ్రామ కూడలి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామానికి చెందిన టి.వెంకట రమణ(35) అనే వ్యక్తి మృతి చెందాడు.
పలాస, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పాత జాతీయ రహదారి సరియాపల్లి గ్రామ కూడలి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామానికి చెందిన టి.వెంకట రమణ(35) అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి దాన్ని ఢీకొనడంతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. 108 సిబ్బంది ఆయన్ను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. ఆయనకు భార్య నోములమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీలకు అప్పగించారు. ఈ మేరకు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో స్నానానికి దిగిన రైతు..
ఎచ్చెర్ల, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన రైతు చల్ల రాజు (44) శుక్రవారం చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. రాజు తన పొలానికి పురుగుల మందు పిచికారీ చేసి తిరిగి వస్తూ దారిలోని లంకెల కోనేరులో స్నానానికి దిగాడు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండా నీరు చేరింది. స్నానానికి దిగిన రాజు గోతిలో జారిపోయి బయటకు రాలేక మునిగిపోయాడు. అదే సమయంలో కొద్ది దూరంలో స్నానం చేస్తున్న కొంతమంది రాజు బయటకు రాకపోవడాన్ని గమనించారు. ఆయన బయటకు తీయగా అప్పటికే మృతిచెందాడు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. రైతుకు భార్య భారతి, కుమార్తె రమ్య, కుమారుడు ఢిల్లీశ్వరరావు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి..
ఆమదాలవలస, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘం పరిధిలో గల తొమ్మిదో వార్డు మెట్టక్కివలసకు చెందిన బరాటం తాతయ్య (51) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పట్టణంలోని 12వ వార్డు పరిధిలోని శ్రీదేవి థియేటర్ సమీపంలోని లక్ష్మీనగర్ శ్మశాన వాటిక విశ్రాంతి భననంలో ఆయన మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ బాలరాజు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుప త్రికి తరలించారు. ఈ ఘటనపై తాతయ్య భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఎస్‌ఐ బాలరాజు దర్యాప్తు చేస్తున్నారు.
అతిగా మద్యం తాగి ఒకరు..
హిరమండలం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): హిరమండలం గాంధీనగర్ వీధికి చెందిన లోపింటి అప్పారావు గురువారం అతిగా మద్యం తాగడంతో మృతిచెందాడు. ఎస్‌ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం అప్పారావు డప్పులు వాయిస్తూ... కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. రోజూ మద్యం తాగి ఇంటికి వెళ్లేవాడు. గురువారం రాత్రి మద్యం తాగి తన ఇంటి సమీపంలోని నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడీ భవనంలో పడిఉన్నాడు. కుమారుడు లోపింటి సింహాచలం శుక్రవారం ఉదయం తండ్రి అప్పారావును నిద్రలేపేందుకు ప్రయత్నించగా లేవలేదు. దీంతో 108 వాహనంలో స్థానిక పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. విషమంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడు సింహాచలం ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంక టేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.