Share News

ప్రాణం తీసిన నీటిగుంత

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:25 PM

Two students die after drowning in mud సెలవు దినం వేళ.. రెండిళ్లలో విషాదం నెలకొంది. తోటి స్నేహితులతో సరదాగా గోరింటాకు కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు కొంతసేపటి తర్వాత బహిర్భూమికి వెళ్లగా.. నీటిగుంత రూపంలో మృత్యువు వారిని వెంటాడింది. స్నానానికిగాను నీటిగుంటలో దిగిన ఆ ఇద్దరు విద్యార్థులు ఊబిలో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

ప్రాణం తీసిన నీటిగుంత
అవినాష్‌, సుధీర్‌ మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

ఊబిలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి

పందిగుంట గ్రామంలో విషాదం

కోటబొమ్మాళి(సంతబొమ్మాళి), నవంబరు 16(ఆంధ్రజ్యోతి): సెలవు దినం వేళ.. రెండిళ్లలో విషాదం నెలకొంది. తోటి స్నేహితులతో సరదాగా గోరింటాకు కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు కొంతసేపటి తర్వాత బహిర్భూమికి వెళ్లగా.. నీటిగుంత రూపంలో మృత్యువు వారిని వెంటాడింది. స్నానానికిగాను నీటిగుంటలో దిగిన ఆ ఇద్దరు విద్యార్థులు ఊబిలో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. తోటి స్నేహితులు చూసి.. వారిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సంతబొమ్మాళి మండలం నర్సాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ముద్ద అవినాష్‌(9), పిల్లల సుధీర్‌(9) ఆదివారం సాయంత్రం నీటి గుంతలో మునిగి మృతి చెందారు. వీరిద్దరూ పందిగుంట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో సాయంత్రం సమీపంలో ఉన్న చెరువు గట్టు మీద గోరింటాకు కోసం మరో ఇద్దరి స్నేహితులతో కలిసి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత అవినాష్‌, సుధీర్‌ బహిర్భూమి కోసం దగ్గరలో ఉన్న నీటి గుంత వద్దకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకున్నారు. తర్వాత నీటిగుంతలో స్నానానికి దిగారు. నీటిగుంతలో ఊబి ఉండడంతో బయటకు రాలేక మునిగిపోయారు. గోరింటాకు కోసం వారితోపాటు వచ్చిన మరో ఇద్దరు చిన్నారులు ఈ ఘటన చూసి కేకలు వేశారు. ఆ దారి గుండా పోతున్న ఓ వ్యక్తికి విషయం చెప్పారు. ఆయన వచ్చి ఆ ఇద్దరి చిన్నారులను నీటిగుంత నుంచి బయటకు తీశారు. అప్పటికే వారిద్దరూ మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు ముద్ద పాపారావు, అనురాధ, పిల్లల రాము, పుష్పలతతోపాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సుధీర్‌ అన్నయ్య రమాకాంత్‌ 6వ తరగతి, అవినాష్‌ అన్నయ్య తిరుపతి 7వ తరగతి కోటబొమ్మాళి జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదువుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. దీంతో ఉదయాన్నే పనులకు వెళ్ళిపోయారు. కుమారుల మరణవార్త తెలుసుకొని లబోదిబోమంటూ సంఘట స్థలానికి చేరుకున్నారు. సంతబొమ్మాళి ఎస్‌ఐ వై.సింహాచలం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై ఆరా తీశారు.

Updated Date - Nov 16 , 2025 | 11:25 PM