మత్స్యకారులకు స్వర్ణయుగం
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:09 AM
Pension for fishermen at the age of fifty ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలోనే మత్స్యకారులకు స్వర్ణయుగం సాధ్యమైందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియలో ప్రపంచ మత్స్య దినోత్సవం నిర్వహించారు.
యాభై ఏళ్లకే పింఛన్ ఇచ్చిన ఘనత ప్రభుత్వానిది
ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే సంక్షేమం
పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తాం
మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలోనే మత్స్యకారులకు స్వర్ణయుగం సాధ్యమైందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియలో ప్రపంచ మత్స్య దినోత్సవం నిర్వహించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ ‘మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్నివిధాలా కట్టుబడి ఉంది. దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉపాధి కోసం వెళ్లేవారిలో శ్రీకాకుళం మత్స్యకారులు ఉంటున్నారు. వారి తలరాతను మార్చే దిశగా మా ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశ పెడుతోంది. మత్స్యకారులకు యాభై ఏళ్లకే పింఛన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదే. హుద్‌హుద్, తితలీ, మొంథా తుపాను వంటి విపత్తుల్లో మా ప్రభుత్వమే అండగా నిలిచింద’ని తెలిపారు. గత ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర పేరుతో దోపిడీ చేసిందని ఆరోపించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను అభినందిస్తూ.. తీర ప్రాంతాల్లో రోడ్లు, సౌర వీధి లైట్లు ఆయన కృషి ఫలితమేనని తెలిపారు. మూలపేటలో పోర్టు త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు. త్వరలో రెండు కొత్త హార్బర్లు, కొత్త జెట్టీలు తీసుకువస్తున్నామని తెలిపారు. రాబోయే నలభై..యాభై ఏళ్లకు సరిపడా మౌలిక వసతులను ముందే ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యకారులు పాతపద్ధతులు వదిలి పరిస్థితులకు తగ్గట్టు సాంకేతిక సంస్కరణల వైపు వెళ్లాలని సూచించారు. ప్రతి మత్స్యకారుడు తన కుటుంబ సభ్యుడితో సమానమని పేర్కొన్నారు. అనంతరం గతంలో చేపలవేట సమయాల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన 31మంది మత్స్యకార కుటుంబాలకు చెక్కులను అందించారు. వివిధ పథకాల కింద పలు ఉపకరణాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, నడుకుదిటి ఈశ్వరరావు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్, ఆర్డీవో సాయిప్రత్యూష, మత్స్యకార సొసైటీల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.