వైభవంగా బాలియాత్ర
ABN , Publish Date - Nov 09 , 2025 | 10:50 PM
శ్రీముఖలింగేశ్వరాలయంలో ఆదివారం సాయంత్రం బాలియాత్ర వైభవంగా జరిగింది.
- వంశధార నదిలో తెప్పోత్సవం
- దీపాలు విడిచిపెట్టిన ఎమ్మెల్యేలు
జలుమూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగేశ్వరాలయంలో ఆదివారం సాయంత్రం బాలియాత్ర వైభవంగా జరిగింది. శ్రీముఖలింగేశ్వరాలయం నుంచి వంశధార నది వరకు ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, కూన రవికుమార్, బెందాళం అశోక్‌తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు బాలియాత్ర నిర్వహించారు. వంశధార తీరంలో తెపోత్సవం నిర్వహించారు. అరటి తెప్పల్లో దీపాలు వెలిగించి నదిలో విడిచిపెట్టారు. ముందుగా శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణమూర్తి మాట్లాడుతూ.. బాలియాత్ర తెప్పోత్సవంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఐదు వేల సంవత్సరాల తరువాత, రాజులు కాలం నాటి బాలియాత్రను మళ్లీ నిర్వహించడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడిందన్నారు. దీనికి కృషిచేసిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాశీబుగ్గ డీఎస్పీ డి.లక్ష్మణరావు ఆధ్వర్యంలో నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో జలుమూరు ఎస్‌ఐ బి.అశోక్‌బాబు గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ యాత్రలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, జడ్పీ చైర్మన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, తహసీల్దారు జె.రామారావు, ఎంపీడీవో బి.చిన్నమ్మడు, డిప్యూటీ ఎంపీడీవో ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.