post office cracked: పోస్టాఫీసులో పెచ్చులూడిన శ్లాబు
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:53 PM
Post office has fallen into disrepair ఇచ్ఛాపురంలోని పోస్టాఫీసు శిథిలావస్థకు చేరుకుంది. శనివారం ఉదయం 10గంటల సమయంలో పోస్టాఫీసు కార్యాలయం శ్లాబు పెచ్చులూడి పడ్డాయి. ఆ సమయంలో అక్కడ కుర్చీలో కూర్చొన్న వీకే పేటకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు బాబూరావుపై ఆ పెచ్చులు పడడంతో స్వల్పంగా గాయపడ్డారు.
ఇచ్ఛాపురంలో ఘటన.. ఒకరికి గాయాలు
యాభై సంవత్సరాల క్రితంనాటి భవనం
బిక్కుబిక్కుమంటూ సిబ్బంది విధులు
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురంలోని పోస్టాఫీసు శిథిలావస్థకు చేరుకుంది. శనివారం ఉదయం 10గంటల సమయంలో పోస్టాఫీసు కార్యాలయం శ్లాబు పెచ్చులూడి పడ్డాయి. ఆ సమయంలో అక్కడ కుర్చీలో కూర్చొన్న వీకే పేటకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు బాబూరావుపై ఆ పెచ్చులు పడడంతో స్వల్పంగా గాయపడ్డారు. పెచ్చులూడిన శబ్దం విని అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాబూరావును ఆస్పత్రికి తరలించారు. కాగా నిత్యం ఇక్కడ ఇదే పరిస్థితి ఎదురవుతోందని కార్యాలయం సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. శిథిలావస్థకు చేరుకోవడంతో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నామని వాపోతున్నారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు.
ఐదు దశాబ్దాల కిందట భవనం..
జిల్లాలో పోస్టల్‌శాఖ ప్రధాన కార్యాలయాల్లో ఇచ్ఛాపురం ఒకటి. ఇక్కడ వందలాది మంది ఖాతాదారులు ఉన్నారు. పైగా ఆధార్ వంటి పౌరసేవలు, బ్యాంకింగ్ సేవల కోసం నిత్యం సుమారు 200 మంది ఖాతాదారులు వస్తుంటారు. వారంతా శిథిల భవనంతో ఇబ్బందులు పడుతున్నారు. తరచూ శ్లాబ్ పెచ్చులూడి పడుతుండంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. ఇచ్ఛాపురం పోస్టాఫీసు కార్యాలయాన్ని ఐదు దశాబ్దాల కిందట నిర్మించారు. 2013లో భవనానికి మరమ్మతులు చేపట్టారు. మళ్లీ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకోవడంతో పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు ఈ భవనం ఆధునికీకరణకు రూ.30లక్షలు మంజూరు చేశారు. టెండర్ల ప్రక్రియలో ఉంది. వీలైనంత త్వరగా పనులు చేపట్టి భవనాన్ని ఆధునికీకరించాలని ఖాతాదారులు కోరుతున్నారు.
చర్యలు తీసుకోవాలి
రోజూ ఖాతాదారులతో పోస్టాఫీసు రద్దీగా ఉంటుంది. పెద్ద ప్రమాదం జరగకముందే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఖాతాదారులకు ఏ ప్రమాదం జరిగినా.. మా సిబ్బందిపై తిరగబడే అవకాశం ఉంది. శిథిల భవనంలో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నాం.
- సంతోష్, క్లర్క్, ఇచ్ఛాపురం పోస్టాఫీస్
ఉన్నతాధికారుల దృష్టికి..
పోస్టల్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈఏడాది జూన్‌లో కూడా పెచ్చులూడి పడడంతో సిబ్బందికి గాయాలయ్యాయి. శనివారం మరోసారి పెచ్చులూడిపడడంతో పోస్టాఫీస్ పని నిమిత్తం వచ్చిన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వీలైనంత త్వరగా టెండరు ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించాలని కోరాం. మరమ్మతులు కన్నా నూతన భవన నిర్మాణానికి ఉన్నతాధికారులు చర్యలు చేపడితే మంచిది.
- షణ్ముఖరావు, పోస్టల్ ప్రధాన అధికారి, ఇచ్ఛాపురం బ్రాంచ్