మస్తర్ల మాయాజాలానికి చెక్
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:42 PM
E-KYC for updhi wage earners ఉపాధిహామీ పథకం అమలులో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మస్తర్ల మాయాజాలానికి చెక్‌పెట్టేలా ఉపాధిహామీ వేతనదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది.
ఉపాధిహామీ వేతనదారులకు ఈ-కేవైసీ
ఆధార్- జాబ్‌కార్డుల అనుసంధానం
క్షేత్రస్థాయిలో పనికి వెళితే వేతనం
నరసన్నపేట/ కోటబొమ్మాళి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకం అమలులో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మస్తర్ల మాయాజాలానికి చెక్‌పెట్టేలా ఉపాధిహామీ వేతనదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. వేతనదారులు తమ ఆధార్ కార్డును జాబ్‌కార్డుతో అనుసంధానం చేసుకుంటేనే ఉపాధిహామీ పని కల్పించాలని నిర్ణయించింది. ఉపాధిహామీ పఽథకం పనుల్లో పారదర్శకత కొరవడిందన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో కొంతమంది వేతనదారులు పనులకు రాకపోయినా.. ఉపాధిహామీ సహాయకులు వారు హాజరైనట్టు నమోదు చేస్తూ నిధులు స్వాహా చేసేవారు. సామాజిక తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడేది. చాలా గ్రామాల్లో మస్తర్ల మాయాజాలంలో ప్రతిరోజూ పనిచేసే కూలీలకు సగటు వేతనం రూ.310 దక్కడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అవకతవలపై ఉన్నతాధికారులకు వేతనదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో నరేగా పద్దు దుర్వినియోగం కాకుండా ఉండాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధిహమీ పథకం అమలులో నూతన మార్గదర్శికాల అమలుకు శ్రీకారం చుట్టింది. బోగస్ మస్తర్లకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో అవినీతికి పాల్పడకుండా జాబ్‌కార్డులు పొందిన కార్మికుల కుటుంబసభ్యులతో కచ్చితంగా ధ్రువీకరణ(ఈ-కేవైసీ) చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న వేతనదారులకు అధికారులు, సిబ్బంది ఈ-కేవైసీ నమోదు చేస్తున్నారు.
జిల్లాలో మొత్తం 7,49,268 మంది జాబ్‌కార్డు కలిగిన వేతనదారులు ఉన్నారు. వీరిలో గురువారం నాటికి 3,88,334 మంది వేతనదారులకు సంబంధించి అధికారులు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిచేశారు. జాతీయ మస్టరు పర్యవేక్షణ వ్యవస్థ(ఎన్‌ఎంఎంఎస్) యాప్‌లో వేతనదారుల వివరాలు నమోదు చేశారు. వేతనదారుల జాబ్‌కార్డులను, ఆధార్ కార్డులను అనుసంధానం చేస్తున్నారు. అలాగే వేతనదారుల కనుపాప (ఐరీష్) కూడా నమోదు చేస్తున్నారు. దీనివల్ల ఒకరికి బదులుగా మరొకరు పనికి వచ్చే అవకాశం ఉండదు. మృతుల పేర్లు నమోదు చేసే వీలు కుదరదు. దీంతో ఉపాధి హమీ బోగస్ హాజరుకు చెక్ పడనుంది. క్షేత్రస్థాయిలో పనికి వెళితేనే వేతనం అందనుంది.
వారంలో పూర్తిచేయాలి
జిల్లాలో ఉపాధిహామీ పథకం వేతనదారుల ఈ-కేవైసీ నమోదు ప్రక్రియను వారంలోగా పూర్తిచేయాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. అర్హులందరికీ ఉపాధిహామీ పథకం ద్వారా పనులు కల్పిస్తాం. నకిలీ మస్తర్లకు తావులేకుండా వేతనదారులకు వంద రోజులు పని కల్పించేందుకు కృషి చేస్తాం.
- బి.సుధాకర్, పీడీ, డ్వామా