మృత్యువులోనూ వీడని బంధం
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:21 AM
భారీ వర్షాలకు ఇంటి గోడ కూలడంతో గిరిజన వృద్ధ దంపతులు మృతి చెందారు. ఈ ఘటన మందస మండలం హంసరాలి పంచాయతీ సవర టుబ్బూరులో చోటుచేసుకుంది.
- ఇంటి గోడ కూలి వృద్ధ దంపతుల మృతి
- సవర టుబ్బూరులో ఘటన
హరిపురం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలకు ఇంటి గోడ కూలడంతో గిరిజన వృద్ధ దంపతులు మృతి చెందారు. ఈ ఘటన మందస మండలం హంసరాలి పంచాయతీ సవర టుబ్బూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సవర బుద్ధయ్య (64), రూపమ్మ(60) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు మోహనరావు, నాగేశ్వరరావు, ఇద్దరు కుమార్తెలు సావిత్రి, ఈశ్వరి ఉన్నారు. మోహనరావుకు వివాహం కాలేదు. హైదరాబాద్‌లో పని చేసుకుంటూ స్వగ్రామంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ బాధ్యతను చూస్తున్నాడు. నాగేశ్వరరావు వివాహం చేసుకొని పక్క గ్రామంలో ఉంటున్నాడు. కుమార్తెలకు పెళ్లిళ్లు జరిగి వారి అత్తవారి గ్రామాల్లో ఉంటున్నారు. అయితే, సాఫీగా సాగిపోతున్న బుద్ధయ్య, రూపమ్మ జీవితాన్ని చూసి విధికి కన్ను కుట్టిందేమో వర్షం రూపంలో వారి ప్రాణాలను బలితీసుకుంది. గురువారం రాత్రి భోజనం చేసిన అనంతరం బుద్ధయ్య, రూపమ్మ నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి దాటిన తరువాత వారి ఇంటి మట్టిగోడ కూలడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గ్రామ యువకులు జలంద్ర, నాగేంద్ర, బాబూరావులు గ్రామస్థుల సహకారంతో ఆ దంపతులను హుటాహుటిన హరిపురం సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే బుద్ధయ్య మృతిచెందగా, రూపమ్మ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూసింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫవీరి దీనస్థితిని గ్రామ యువకులు టీడీపీ మండల అధ్యక్షుడు బావన దుర్యోధన, మాజీ సర్పంచ్ తమిరి భాస్కరరావుతో కలసి ఎమ్మెల్యే శిరీష దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిన ఎమ్మెల్యే.. వృద్ధ దంపతులకు ఒక్కొక్కరికి రూ.4లక్షలు చొప్పున రూ.8లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. చెక్కులను శనివారం అందజేయనున్నట్లు చెప్పారు.