అలల తాకిడికి కొట్టుకుపోయిన బోటు
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:11 AM
మండలంలోని లక్కివలస పంచాయతీ గెద్దలపాడు సముద్ర తీరంలో బుధవారం బోటు కొట్టుకుపోయింది.

-రూ.15లక్షల ఆస్తి నష్టం
సంతబొమ్మాళి,ఏప్రిల్9(ఆంధ్రజ్యోతి): మండలంలోని లక్కివలస పంచాయతీ గెద్దలపాడు సముద్ర తీరంలో బుధవారం బోటు కొట్టుకుపోయింది. దీంతో రూ.15లక్షల ఆస్తినష్టం సంభవించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో అలలు తాకిడి ఎక్కువగా ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా మంగళవారం ఉదయం తమ బోట్లను తీరంలో లంగరు వేశారు. బుధవారం ఉదయం తమ బోట్లు, వలలు చూసేందుకు వారు తీరానికి వెళ్లగా ఓ బోటు కనిపించలేదు. సముద్రంలోకి కొట్టుకుపోయినట్లు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. తాడుతో బోటును ఒడ్డుకు చేర్చారు. అప్పటికే బోటు సగం విరిగిపోగా, మోటారు, తదితర సామగ్రి ధ్వంసమయ్యాయి. వలలు కొట్టుకుపోయాయి. సుమారు రూ.15లక్షల వరకు నష్టం వాటిల్లిందని బోటు యజమాని శ్రీరంగం వీరస్వామి తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే భావనపాడు మెరైన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బోటు ప్రమాద వివరాలను రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి మాజీ సర్పంచ్ శ్రీరంగం రాజులు తీసుకువెళ్లారు. వలలు కొట్టుకుపోయాయని, బోటు పాడైయిందని తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత మత్స్యకారుడు ప్రభుత్వాన్ని కోరారు.