Share News

పెద్ద పరీక్షే!

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:31 AM

రాష్ట్ర ప్రభుత్వం విద్యారం గంలో సంస్కరణలు తీసుకొస్తుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి వివిధ మార్పులకు శ్రీకారం చుట్టిం ది.

పెద్ద పరీక్షే!
పాతపట్నం ఉన్నత పాఠశాలలోపరీక్షలు రాస్తున్న విద్యార్థులు(ఫైల్‌)

- నూతన విధానంలో విద్యార్థులకు పరీక్షలు

- తెల్లపేపర్లకు బదులు బుక్‌లెట్‌లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

- రాసేందుకు తంటాలు పడుతున్న విద్యార్థులు

- భద్రపరచడంలో ఉపాధ్యాయులకు కష్టాలు

పాతపట్నం, ఆగస్టు 18(ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యారం గంలో సంస్కరణలు తీసుకొస్తుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి వివిధ మార్పులకు శ్రీకారం చుట్టిం ది. పేపర్లకు బదులు బుక్‌లెట్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే, ఈ విధానంలో పరీక్షలు రాసేందుకు ఇటు విద్యార్థులు, వాటి నిర్వహణకు అటు ఉపాధ్యాయులు తంటాలు పడుతున్నారు. గతంలో 1 నుంచి 10వ తరగతి వరకు యూనిట్‌ టెస్టు లు, క్వార్టర్లీ, ఆఫ్‌ ఇయర్లి, ఫైనల్‌ పరీక్షలు జరిగేవి. ఉపాధ్యాయులు విద్యార్థులకు తెల్లపేపర్లు ఇచ్చి వాటిపై పరీక్షలు రాయించేవారు. ఆ పేపర్లకు మూల్యాంకనం చేసి మార్కులు చెప్పేవారు. అయితే, ఈ విద్యాసంవత్సరం పరీక్షల నిర్వహ ణలో ప్రభుత్వం మార్పులు తీసుకొ చ్చింది. ప్రతీవిద్యార్థి నాలుగు ఫార్మే టివ్‌ (నిర్మాణాత్మక), రెండు సమ్మే టివ్‌ (సంగ్రహణాత్మక) పరీక్షలు రాయాల్సి ఉంటుంది. దీనికోసం బుక్‌లెట్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పరీక్షలన్నీ ఈ బుక్‌లెట్‌లోనే విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. సమాధానాలన్నీ అదే బుక్‌లెట్‌లో ఉంటాయి. తరగతుల వారీగా ఒక్కో విద్యార్థికి ఒక్కో బుక్‌లెట్‌ రూపంలో అసెస్‌మెంట్‌ ఆన్షర్‌ షీటు ఉంటుంది. రిఫ్లక్షన్‌(ప్రతిస్పందన)- 5మార్కులు, హోమ్‌వర్క్‌(రాతఅంశాలు)కు -5మార్కులు, ప్రాజెక్ట్‌ వర్క్‌కు 5మార్కులు, రాతపరీక్షకు 35మార్కులు కేటాయించారు. పరీక్ష రాయడానికి గంట సమయమిచ్చారు.

సరిపోని సమయం..

బుక్‌లెట్‌ ఓఎంఆర్‌ షీట్‌లో ఇచ్చిన నిబంధనల మేరకు పరీక్షలు రాయడానికి ఇచ్చే గంట సమయం విద్యార్థులకు సరిపోదని ఉపాధ్యాయులు అంటున్నారు. ఎఫ్‌ఏ-1 పరీక్షల నిర్వాహణకు ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పరీక్షలు మొదలు కాగానే బుక్‌లెట్‌ అందుకున్న విద్యార్థి అందులో తన పేరు, క్లాస్‌, సెక్షన్‌, రోల్‌ నెంబర్‌, స్కూల్‌ నేమ్‌, పెన్‌ఐడీ,యు డైస్‌కోడ్‌ రాయాలి. ప్రశ్నాపత్రంలో మల్టిబుల్‌ చాయిస్‌ టిక్‌ పెట్టుకొని బుక్‌లెట్‌లో జవాబులు రాసే ప్రక్రియ మొదలుపెట్టాలి. ఓఎంఆర్‌ షీట్‌లో పెన్‌ఐడీ ఎక్జామ్‌కోడ్‌ రాసిన తరువాతనే బబ్లింగ్‌ చేయాలి. ఆ తరువాతనే విద్యార్థులు బుక్‌లెట్‌లో ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఈ తతాంగమంతా విద్యాశాఖ ఇచ్చిన నిబంధనల మేరకు ఓ గంటలో ముగించాలి. దీంతో అన్ని సమాధానాలు రాయలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

- ఉపాధ్యాయులు మూల్యాంకనం వెంటనే జరిపి విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఓఎంఆర్‌ షీట్‌తో పాటు బుక్‌లెట్‌, లీప్‌యాప్‌లో మార్కులు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈప్రక్రియంతా పాఠశాలలోనే చేపట్టాలి. గతంలో పరీక్షలు జరిగిన వెంటనే ఉపాధ్యాయులు జవాబు పత్రాలను తమ ఇళ్లకు తీసుకువెళ్లి, మూల్యాంకనం చేసి మార్కులను యాప్‌లో అప్‌లోడ్‌ చేసేవారు. ఇప్పుడు కొత్తవిధానంతో ఉపాధ్యాయులు హడలెత్తుతున్నారు.

బుక్‌లెట్‌లు భద్రపరచడం కష్టం

మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన తరువాత బుక్‌లెట్‌లను భద్రపరచడం కష్టం అవుతుంది. కొత్త విధానమైతే బాగుంది గానీ, మరికొన్ని మార్పులు తీసుకురావాల్సి ఉంది.

-ఎస్‌.వైకుంఠరావు, హెచ్‌ఎం, ప్రభుత్వ ఉన్నతపాఠశాల, పాతపట్నం

ప్రయోజనకరం

బుక్‌లెట్‌లో విద్యార్థి పూర్తి చరిత్ర ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన విధానం దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థుల విద్యా ప్రమాణాలు అభివృద్ధి పరిచేందుకు వీలుంటుంది.

-సీహెచ్‌ తిరుమలరావు, ఎంఈవో-1, పాతపట్నం

Updated Date - Aug 19 , 2025 | 12:31 AM