cashew: ఆరంభం అ‘ధర’హో
ABN , Publish Date - May 02 , 2025 | 11:42 PM
increasing price జీడి పిక్కల ఆరంభంలోనే ధర ఆశించినంతగా పెరగడంతో అమ్మకాలు జోరందుకున్నాయి. సాధారణంగా జీడి పిక్కల సీజను ప్రారంభంలో ధర నామమాత్రంగా ఉండి.. తర్వాత మార్కెట్‌కు అనుగుణంగా పెరుగుతుంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం ప్రారంభంలోనే 80 కిలోల జీడి బస్తా రూ.13,500గా నమోదై రికార్డు సృష్టించింది.
బస్తా జీడి పిక్కలు రూ.13,500
ఆశించిన స్థాయిలో రేటు పెరగడంతో రైతుల్లో హర్షం
పలాస, మే 2(ఆంధ్రజ్యోతి): జీడి పిక్కల ఆరంభంలోనే ధర ఆశించినంతగా పెరగడంతో అమ్మకాలు జోరందుకున్నాయి. సాధారణంగా జీడి పిక్కల సీజను ప్రారంభంలో ధర నామమాత్రంగా ఉండి.. తర్వాత మార్కెట్‌కు అనుగుణంగా పెరుగుతుంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం ప్రారంభంలోనే 80 కిలోల జీడి బస్తా రూ.13,500గా నమోదై రికార్డు సృష్టించింది. ఏప్రిల్ నుంచి మూడు నెలలపాటు జీడి పిక్కల సీజను ఉంటుంది. జీడి బస్తా రూ.16వేలు కనీస మద్దతు ధర పెంచాలని, మార్క్‌ఫెడ్ ద్వారా జీడి గింజలు కొనుగోలు చేసి వ్యాపారులకు నేరుగా ప్రభుత్వమే అమ్మకాలు సాగించాలని జీడి పిక్కల పోరాట కమిటీ కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం.. మార్కెట్‌లో లభించిన ధరకు అదనంగా రూ.వెయ్యి మద్దతు ధర ఇస్తామని ప్రకటించింది. కానీ, ఒక్క రైతుకు కూడా ఆ డబ్బులు చెల్లించలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో జీడిపప్పు ధరలు పెరగడంతో పిక్కల ధర కూడా అదేస్థాయిలో పెరిగింది. గతేడాది రూ.10వేలు ఉండగా.. ఈ ఏడాది రూ.13,500 వరకూ పలుకుతోంది. ఇప్పటికే వ్యాపారులు బ్రోకర్ల సహాయంతో జీడి గింజలు కొనుగోలు చేస్తున్నారు. విదేశీ జీడిపిక్కలు మార్కెట్‌లో లభిస్తున్నా, రూ.12వేలకు మించి అమ్ముడు కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. దేశీయంగా లభించే జీడిపిక్కలకు మంచి మార్కెట్ ఉండడంతో గ్రామాల్లో రైతుల నుంచి వాటిని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో 35వేల హెక్టార్లులో జీడి పంట సాగవుతోంది. 2018 తితలీ తుఫానులో మొత్తం జీడి పంట నాశనం కాగా.. 2019లో నామమాత్రంగా జీడి పిక్కలు లభించాయి. దీంతో విదేశాల నుంచి జీడి పిక్కలు భారీస్థాయిలో రప్పించి పీలింగ్ చేశారు. ప్రస్తుతం పాడయిన పంట తిరిగి పుంజుకోవడంతో అనేక ప్రాంతాల్లో పంట ఆశించిన స్థాయిలో ఉండడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానం ప్రాంతంలో జీడి పంట ఎకరాకు సరాసరి 4 నుంచి ఆరు బస్తాల వరకూ పండుతుంది. దీని ప్రకారం రైతులకు ఎకరాకు రూ.54 వేలు నుంచి రూ.81వేల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కొన్ని గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న ధర కంటే పెరిగే అవకాశం ఉండడంతో రైతులు వాటిని నిల్వ చేస్తున్నారు. రెండు నెలల తరువాత జీడి పిక్కల ధరలు పెరిగితే అమ్ముకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు.