Share News

Sujala Dhara: సుజలధారకు రూ.5.75 కోట్లు

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:35 AM

Water supply project ఉద్దానం ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లోని ఎన్టీఆర్‌ సుజలధార రక్షితనీటి పథకాల నిర్వహణకు సంబంధించి నిధులు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం రూ.5.75కోట్ల విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Sujala Dhara: సుజలధారకు రూ.5.75 కోట్లు
కంచిలి మండలం ఒరియా నారాయణపురం వద్ద ఎన్టీఆర్‌ సుజలధార రక్షితనీటి పథకం

  • నిధుల విడుదలకు కేబినెట్‌ ఆమోదం

  • ఉద్దానంలో తెరచుకోనున్న 135 కేంద్రాలు

  • ప్రజలకు అందనున్న శుద్ధజలాలు

  • ఇచ్ఛాపురం, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ఉద్దానం ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లోని ఎన్టీఆర్‌ సుజలధార రక్షితనీటి పథకాల నిర్వహణకు సంబంధించి నిధులు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం రూ.5.75కోట్ల విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో రెండు నియోజకవర్గాల్లో మూతపడిన సుజలధార రక్షిత నీటి పథకాలు అందుబాటులోకి రానున్నాయి. ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల వ్యాప్తికి తాగునీరు కలుషితం కావడం ఒక కారణమని అధ్యయనాలు తేల్చాయి. దీంతో టీడీపీ ప్రభుత్వం 2018లో ఎన్టీఆర్‌ సుజలధార పేరుతో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో రూ.14కోట్ల వ్యయంతో శుద్ధ జలాల ప్లాంట్లతోపాటు గ్రామాల్లో సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 20 లీటర్ల నీటిని రూ.2కే అందించేది. కొన్నాళ్ల పాటు ఇవి బాగానే పనిచేశాయి. ఉద్దానం ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేవి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి నిర్వహణను గాలికొదిలేసింది. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం అంటూ హడావుడి చేసి.. వీటిని పూర్తిగా విస్మరించింది. దీంతో కొన్ని రక్షితనీటి పథకాలు మూతపడ్డాయి. కొన్ని పథకాలు నిర్వహణ సక్రమంగా లేక ఉద్దానం వాసులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సుజలధార పథకాల నిర్వహణకు నిధులు విడుదల చేయనుండడంతో కేంద్రాలు తెరచుకోనున్నాయి. ఉద్దానం వాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి.

  • ప్రారంభం ఇలా..

  • ఎన్టీఆర్‌ సుజలధార పథకాన్ని 2018లో ప్రారంభించారు. అప్పట్లో ఎన్టీర్‌ సుజలధార పథకం కుప్పం నియోజకవర్గానికి కేటాయించాల్సి ఉంది. కానీ నాడు మంత్రి లోకేశ్‌ ప్రత్యేక చొరవతో ఉద్దానంలో ఈ ట్యాంకులను నెలకొల్పారు. పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురంలో మండలానికి ఒకటి చొప్పున మదర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఏడు మండలాల్లోని 135 గ్రామాల్లో సరఫరా కేంద్రాలను కూడా నెలకొల్పారు. మదర్‌ప్లాంట్ల నుంచి సరఫరా కేంద్రాలకు శుద్ధజలాలను తరలించేందుకు స్టీల్‌ కంటైనర్లతో ట్రాక్టర్‌ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. కానీ వైసీపీ హయాంలో నిర్వహణ లేక సగానికిపైగా సరఫరా కేంద్రాలు మూతపడ్డాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 20 లీటర్ల క్యాన్‌ ధర రూ.2 ఉండగా.. నిర్వహణ వ్యయం పేరిట వైసీపీ సర్కారు దానిని రూ.7కు పెంచింది. ప్రజలపై అదనపు భారం మోపింది. కుటుంబానికి రోజుకు సగటున మూడు క్యాన్లు అవసరం. అంటే తాగునీటికి రోజుకు రూ.21 ఖర్చు చేయాల్సి వచ్చింది. అయినా వాటి నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం విఫలమవడంతో ప్రజలకు శాపంగా మారింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంపై ఉద్దానం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • హర్షణీయం

  • టీడీపీ హయాంలో ఉద్దానంలో ఎన్టీఆర్‌ సుజలధార శుద్ధ జలాల ప్లాంట్ల సేవలు విస్తృతంగా అందించేవి. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా నిలిచిపోయాయి. నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. 20 లీటర్ల శుద్ధ జలాల క్యాన్‌ ధరను రూ.2 నుంచి రూ.7కు పెంచినా.. నిర్వహణ సక్రమంగా చేపట్టలేదు. తాజాగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం హర్షణీయం.

    - కాళ్ల దిలీప్‌, 22వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌, ఇచ్ఛాపురం

  • అన్ని కేంద్రాలు అందుబాటులోకి..

  • ఉద్దానానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం ఆనందంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ సుజలధార పథకాన్ని నిర్వీర్యం చేసింది. ఈ పథకానికి నిధులు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. మూతపడిన అన్ని కేంద్రాలను అందుబాటులోకి తెస్తాం. ఎక్కడైనా శుద్ధజలాల ప్లాంట్లు పాడైతే ఫిర్యాదు చేయాలి. ఉద్దానం ప్రజలకు శుద్ధి జలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

    - డాక్టర్‌ బెందాళం అశోక్‌, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే

Updated Date - Jun 07 , 2025 | 12:35 AM