Ganja transport: కిలో గంజాయి రవాణాకు రూ.5వేలు
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:26 PM
Marijuana smuggling పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నా గంజాయి రవాణా ఆగడం లేదు. పలాస రైల్వేస్టేషన్ వద్ద సోమవారం రెండు వేర్వేరు ఘటనల్లో గంజాయి రవాణా చేస్తూ ఐదుగురు పట్టుబడ్డారు. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉండడం గమనార్హం.
40 కిలోలు తరలిస్తూ పట్టుబడిన మహిళా గ్యాంగ్
రెండు కేసుల్లో ఐదుగురి అరెస్టు
పలాస, జూలై 15(ఆంధ్రజ్యోతి): పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నా గంజాయి రవాణా ఆగడం లేదు. పలాస రైల్వేస్టేషన్ వద్ద సోమవారం రెండు వేర్వేరు ఘటనల్లో గంజాయి రవాణా చేస్తూ ఐదుగురు పట్టుబడ్డారు. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉండడం గమనార్హం. ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చి.. తమకు అప్పగిస్తే కిలోకు రూ.5వేలు చొప్పున ఇస్తామని చెప్పడంతో వారు అత్యాశకు పోయి.. చివరకు పోలీసులకు చిక్కారు. ఈ వివరాలను మంగళవారం కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లోని విలేకరుల సమావేశంలో డీఎస్పీ వి.వెంకటఅప్పారావు వెల్లడించారు. ‘బీహార్ రాష్ట్రం హరిహరపూర్ గ్రామానికి చెందిన ముతోష్‌షా, ఆయన భార్య ఆశాదేవి, అనితాదేవి, భీమాదేవి పాట్నాలో ఓ హోటల్‌లో వంట కూలీలు. వీరితోపాటు పింకి అనే మహిళ కూడా ఆ హోటల్‌లో పని చేస్తోంది. పింకి బీహార్‌లో గంజాయి రవాణా, అమ్మకం కూడా చేస్తుండేది. ఈమెకు ఒడిశాకు చెందిన సుమిత్‌గుప్తా, మనోజ్‌గుప్తాతో గంజాయి రవాణాకు సంబంధించి పరిచయం ఉంది. ఈ క్రమంలో ముతోష్‌షా, ఆశాదేవి, అనితాదేవి, భీమాదేవికి గంజాయి రవాణాపై పింకి అవగాహన కల్పించింది. ఒడిశా నుంచి గంజాయి తీసుకువచ్చి తమకు అప్పగిస్తే కిలోకు రూ.5వేలు చొప్పున ఇస్తామని చెప్పింది. అత్యాశకు పోయి వారు అంగీకరించారు. ఆ నలుగురు ఒడిశా రాష్ట్రం కొందమాల్ వెళ్లగా.. అక్కడ సంబల్‌పూర్‌కు చెందిన గీత, ఆమె భర్త వీరికి 40కిలోల గంజాయిని అప్పగించారు. ఆ గంజాయిని ప్యాకింగ్ చేసి పలాస మీదుగా బీహార్ వెళ్లేందుకు వారు సిద్ధమయ్యారు. కాగా, సోమవారం రాత్రి పలాస రైల్వేస్టేషన్ బయట వీరు అనుమానస్పదస్థితిలో తిరుగుతుండగా కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తన బృందంతో వెళ్లి తనిఖీ చేయగా గంజాయి బయట పడింది. ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని, మంగళవారం పలాస కోర్టులో హాజరుపరిచామ’ని డీఎస్పీ తెలిపారు.
రెండు కిలోలతో మరొకరు..
పలాస రైల్వేస్టేషన్ వద్ద సోమవారం 2 కిలోల గంజాయితో పట్టుబడిన ఒడిశా రాష్ట్రం ఘాటి గూడ గ్రామానికి చెందిన బిటున్‌హాసన్‌ను అరెస్టు చేశామని డీఎస్పీ వి.వెంకట అప్పారావు మంగళవారం విలేకర్లకు తెలిపారు. ఈయన కేరళలో ఓ హోటల్‌లో పనిచేస్తున్నప్పుడు అదేరాష్ట్రానికి చెందిన సుభ్రాత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఒడిశాకు చెందిన అంబాజిహోలా అనే వ్యక్తి వద్ద గంజాయి కిలో రూ.3వేలు చొప్పున కొనుగోలు చేసి సుభ్రాత్‌కు రూ.10వేలకు విక్రయించడానికి తీసుకువెళ్తుండగా పోలీసులకు చిక్కాడు. బిటున్‌హాసన్‌ను అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. గంజాయి రవాణా చేసినా, అమ్మినా తీవ్రమైన నేరంగా పరిగణిస్తామన్నారు. గంజాయితో పట్టుకుంటే కనీసం పదేళ్ల జైలు, రూ.2లక్షల అపరాధ రుసుం విధిస్తామని స్పష్టం చేశారు. గంజాయి స్మగ్లర్ల ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం ఉందన్నారు.