Share News

249 పోస్టులు ఖాళీ

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:37 PM

Staff shortage in Srikakulam Corporation శ్రీకాకుళం నగర పాలక సంస్థకు ఉద్యోగులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఒకప్పుడు మునిసిపాలిటీగా ఉన్న శ్రీకాకుళానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో(2015లో) కార్పొరేషన్‌ హోదా కల్పించారు. అప్పటి నుంచి స్థాయి పెరిగినా.. పూర్తిస్థాయిలో ఉద్యోగులు మాత్రం లేరు.

249 పోస్టులు ఖాళీ
శ్రీకాకుళం కార్పొరేషన్‌ కార్యాలయం

  • శ్రీకాకుళం కార్పొరేషన్‌లో సిబ్బంది కొరత

  • ఉండాల్సిన ఉద్యోగులు 408 మంది

  • 159 మందితో నెట్టుకొస్తున్న వైనం

  • అంతంతమాత్రంగానే ప్రగతి

  • ర్యాంకింగ్‌లోనూ వెనుకబాటు

  • పట్టించుకోని అధికారులు, పాలకులు

  • శ్రీకాకుళం/అర్బన్‌, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగర పాలక సంస్థకు ఉద్యోగులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఒకప్పుడు మునిసిపాలిటీగా ఉన్న శ్రీకాకుళానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో(2015లో) కార్పొరేషన్‌ హోదా కల్పించారు. అప్పటి నుంచి స్థాయి పెరిగినా.. పూర్తిస్థాయిలో ఉద్యోగులు మాత్రం లేరు. కనీసం యాభైశాతం కూడా సిబ్బంది లేకపోవడంతో ప్రగతి కుంటుపడుతోంది. కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించకపోవడం, పాలకవర్గం లేకపోవడం వల్ల కూడా అభివృద్ధికి అవరోధంగా మారింది. తాజాగా ప్రభుత్వం పది అంశాల ఆధారంగా రేటింగ్‌ ప్రకటించగా.. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు 78వ ర్యాంకు రావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా సరిపడా సిబ్బంది నియామకంలో ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • అన్ని విభాగాల్లోనూ అంతే..

  • శ్రీకాకుళం నగరపాలక సంస్థలో మొత్తం 408 మంది ఉద్యోగులకుగానూ కేవలం 159మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 249 పోస్టులు ఏళ్లతరబడి నుంచి ఖాళీగానే ఉన్నాయి. సాధారణ పరిపాలన విభాగంలో 68మంది ఉద్యోగులకుగాను 35 మంది మాత్రమే ఉన్నారు. మేనేజర్‌, టౌన్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ గ్రేడ్‌-3, రెవెన్యూ ఆఫీసర్‌, అకౌంటెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్స్‌ - 3, బిల్లు కలెక్టర్‌లు -6, ఆఫీస్‌ సబార్డినేటర్స్‌ -3, ఆయాస్‌ -1, టైపిస్టు -2, రికార్డు అసిస్టెంట్‌లు -3, నైట్‌వాచ్‌మన్‌, డ్రైవర్‌లు - 2, ట్రాక్టర్‌ డ్రైవర్‌లు, తోటీస్‌, స్వీపర్‌, కమ్యూనిటీ ఆర్గనైజర్స్‌ -3, పబ్లిక్‌ వర్క్‌ మేస్త్రీ, సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

  • ప్రజారోగ్యం విభాగంలో 209మంది ఉద్యోగులకుగాను 80 మందితో నెట్టుకొస్తున్నారు. ఇందులో అత్యధికంగా పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్స్‌ 114 పోస్టులు ఖాళీ. పబ్లిక్‌ హెల్త్‌ మేస్త్రీలు -6, మెటర్నటీ అసిస్టెంట్‌లు -2, హెల్త్‌ అసిస్టెంట్‌లు -2, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు -4, మెడికల్‌ ఆఫీసర్‌ ఒక పోస్టు ఖాళీగా ఉంది.

  • అత్యంత కీలకమైన టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో 15 మంది ఉద్యోగులకుగాను 5 మందే ఉన్నారు. ఇందులో ఫౌంటైన్‌ క్లీనర్‌లు -2, చైన్‌మెన్‌ -2, టౌన్‌ప్లానింగ్‌ ట్రేసర్‌ -1, టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ -3, టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ - 2 పోస్టులు ఖాళీ.

  • ఎడ్యుకేషన్‌-నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ విభాగంలో 28 మందికిగానూ 10 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. నైట్‌ వాచర్స్‌ -2, స్వీపర్స్‌ -3, అటెండర్స్‌ -3, వాటర్‌ బోయ్‌ -1, వాటర్‌ ఉమెన్‌ -1, తోటీ -2, రికార్డు అసిస్టెంట్స్‌, సీనియర్‌ అసిస్టెంట్స్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  • ఇంజనీరింగ్‌ విభాగంలో పావువంతు సిబ్బంది మాత్రమే ఉన్నారు. 88 మంది సిబ్బందికి 29 మందితో నెట్టుకొస్తున్నారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌లు -2, రోడ్‌ రోలర్‌ డ్రైవర్‌ -1, ఎలక్ట్రీషియన్‌ గ్రేడ్‌-2 రెండు, మీటర్‌ రీడర్‌, పైపులైన్‌ ఫిట్టర్‌, లైటినింగ్‌ సూపరిండెంట్‌, డ్రైవర్‌(ఎల్‌వీ), ఫౌంటైన్‌ క్లీనర్‌ - 3, రోడ్‌ రోలర్‌ క్లీనర్‌ -1, ట్రాక్టర్‌ క్లీనర్‌ -3, రోడ్‌ మజ్దూర్‌ -2, హెల్పర్‌ -4, నాన్‌పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్‌ -8, ఎవెన్యూ మజ్దూర్‌ -2, మేన్‌ మజ్దూర్‌ -6, వాటర్‌ వర్క్స్‌ వాచ్‌మన్‌ -1, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ -1, గాంగ్‌ మజ్దూర్‌ -9, పార్క్‌ వాచర్‌ -1, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ -2, టీ.బీ వాచర్‌, ఉమెన్‌ మజ్దూర్‌, క్లీనర్స్‌ వాటర్‌ సప్లయ్‌, బోర్‌వెల్‌ మజ్దూర్స్‌, బోర్‌వెల్‌ హెల్పర్స్‌ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  • జిల్లా కేంద్రంలో ఇలా ఉంటే.. ?

  • జిల్లాకేంద్రమైన శ్రీకాకుళంలో అరగంట వర్షం కురిస్తే చాలు.. గంటపాటు ప్రజలు మురుగునీటితో అవస్థలు పడే పరిస్థితి నెలకొంది. శతాబ్దాల నాటి డ్రైనేజీని పూర్తిగా ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రతిపాదనలు.. ప్రణాళికలు పంపినా ఆచరణకు నోచుకోవడంలేదు. డ్రైనేజీ సమస్యను సరిదిద్దడం.. వార్డులను పరిశుభ్రంగా ఉంచడం.. డివిజన్లలో పారిశుధ్యం చర్యలతోపాటు రక్షిత నీరు అందించడం.. వీధిలైట్లు సరిచేయడం.. మార్కెట్‌ల పర్యవేక్షణ.. వీధికుక్కలను నియంత్రించడం.. రోడ్లపై ఆవులను నిర్మూలించడం.. వంటి బాధ్యతలన్నీ నగర పాలక సంస్థ అధికారులదే. కాగా అరకొర సిబ్బంది కారణంగా అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. ప్రజలకు అంతంతమాత్రంగానే సేవలు అందుతున్నాయి. ఉన్న సిబ్బందిపై పని భారం పడుతుండగా.. ఆశించినస్థాయిలో ప్రగతి కనిపించడం లేదు. చాలా సమస్యలకు పరిష్కారం చూపడం లేదు.

  • 78వ ర్యాంకుకు పరిమితం

  • రాష్ట్ర ప్రభుత్వం పది అంశాల ఆధారంగా మునిసిపాలిటీలకు ర్యాంకులు ప్రకటించింది. తాగునీటి సరఫరా, ఇంటింటా చెత్త సేకరణ, వ్యర్థాలు, వరద నీటి నిర్వహణ, రోడ్లు, వీధి దీపాలు, ఆదాయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రేటింగ్‌ ఇచ్చింది. రాష్ట్రంలో 123 మునిసిపాలిటీలు ఉండగా.. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు 78వ ర్యాంకు లభించింది. మొత్తం 100 మార్కులకుగానూ 50 పాయింట్లతో మధ్యస్థంగా 5వ రేటింగ్‌ దక్కింది. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో వివిధ విభాగాలకు సంబంధించి లభించిన స్కోరును పరిశీలిస్తే.. నీటి సరఫరాకు - 7, ఇంటి నుంచి చెత్త సేకరణకు - 6, లెగసీ వేస్ట్‌(వ్యర్థ నిర్వహణ)కు - 4, పక్కా రోడ్లకు - 10, వీధి లైటింగ్‌కు - 6, ఆదాయ విభాగంలో - 10, రెవెన్యూ విభాగంలో 10 పాయింట్లు వచ్చాయి. వేస్ట్‌ ప్రోసెసింగ్‌ స్కోర్‌, లిక్విడ్‌ వేస్ట్‌ స్కోర్‌, స్టార్మ్‌ వేస్ట్‌ స్కోర్‌ సున్నా లభించింది. ఇప్పటికైనా కార్పొరేషన్‌కు ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ప్రజాప్రతినిధులు స్పందించి శ్రీకాకుళం కార్పొరేషన్‌ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు. పూర్తిస్థాయిలో ఉద్యోగులు, సిబ్బంది నియామకానికి ప్రతిపాదనలు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Sep 28 , 2025 | 11:37 PM